నెల్లూరు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి వెంకయ్య నాయుడు 5 లక్షలు విరాళం
నెల్లూరులో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని శనివారం (30-8-25) మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా “తెలుగు భాష- స్వర్ణ భారత్-తిక్కన” పురస్కారానికి తన వంతు సేవగా తన వ్యక్తిగత పెన్షన్ నుంచి ఐదు లక్షల రూపాయల మూల నిధిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తెలుగు వారికి సంతోషం కలిగించే నిర్ణయం ఇది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రతి ఏటా ఎంపిక చేసే తెలుగు భాష సేవకులకు ఈ మూలనిధి నుంచి పురస్కారం అందజేస్తారు.
వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ దూరదృష్టితో, మన చొరవతో ఈ విశిష్ట కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసుకోవడం సంతోషమే. అయితే ఇంతటితో మన బాధ్యత ముగిసిపోలేదు. ఎందుకంటే ఈ కేంద్రం మన రాష్ట్రంలో ఉంది, మన భాష ప్రాచుర్యం కోసం ఏర్పడింది. అందుకే దీన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వం పైన కూడా ఆధారపడి ఉంది అన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని సరిపెట్టుకోకూడదు అన్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరారు. తెలుగు గడ్డపై ఉన్న ఈ కేంద్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందుకు రావాలన్నారు.

తెలుగులో ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాండలికంలో ఒక్కో విశిష్టత ఉంది. ఆయా మాండలికాల్లో, ఆయా ప్రాంతాల్లో ఎంతో పద సంపద దాగి ఉంది. ఆ పద సంపదనంతటినీ ఒక్క చోట చేర్చి అందరికీ అందుబాటులోకి తెస్తే కొత్తగా పదాలను సృష్టించే అవసరమూ తగ్గుతుంది. ఈ పనిని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం చేపట్టాలి అన్నారు. ప్రాచీన తెలుగులో ఉన్న పదాలను సేకరించి వాటిని నేటి అవసరాలకు ఏవి తగిన పదాలో తేల్చి వాడుకలోకి తీసుకురావాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాచీన తెలుగు ప్రతులను, గ్రంధాలను యుద్దప్రాతిపదికన సేకరించి వాటిని డిజటలీకరించాలని సూచించారు.
–కళాసాగర్
