నార్వే దేశపు ప్రఖ్యాత కళాసంస్థ టూన్స్ మాగ్ 2020 సంవత్సరానికి గానూ ‘మదర్ ఎర్త్’ అన్న అంశంతో ‘వరల్డ్ కార్టూనిస్ట్ అఫ్ ది ఇయర్ 2020’ అంతర్జాతీయ అవార్డ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన కార్టూన్ పోటీలలో భారత దేశానికి చెందిన మన తెలుగు కార్టూనిస్ట్ మరియు ఖమ్మం జిల్లా ఖజానా శాఖ డిప్యూటి డైరెక్టర్ గా పనిచేస్తున్న వెంటపల్లి సత్యనారాయణ “షేకింగ్ ది వరల్డ్ బై కొవిడ్-19” అన్న పేరుతో వేసిన కార్టూన్ ఫైనల్స్ పోటీలో ప్రఖ్యాత అమెరికన్ ఎకనామిస్ట్ పత్రిక ప్రెస్ కార్టూనిస్ట్ మరియు అంతర్జాతీయంగా బుకర్ ప్రైజ్ లాంటి ఎన్నో అవార్డులు సాధించిన సీనియర్ కార్టూనిస్ట్ కోవెన్ కెల్ కల్లాఘర్ కార్టూన్ తో పోటీ పడి అంతర్జాతీయంగా అత్యధిక వీక్షణలతో ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులచే అత్యదధిక వోట్లు సాధించి 2020 సంవత్సరానికి “వరల్డ్ బెస్ట్ కార్టూనిస్ట్ అఫ్ ది ఇయర్ 2020” అనే అంతర్జాతీయ అవార్డ్ ని గెల్చుకుంది.
గత నాలుగేళ్ళుగా టూన్స్ మాగ్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్టూన్ పోటీలో ప్రపంచంలోని అన్ని దేశాల కార్టూనిస్టులు తమ తమ కార్టూన్లను పోటీకి పంపగా ఆన్ లైన్ లో అందరికంటే ఎక్కువ వోట్లు సాధించిన ఒకే ఒక్క కార్టూనిస్ట్ కి వరల్డ్ కార్టూనిస్ట్ అఫ్ ది ఇయర్ అవార్డ్ ప్రకటించడం జరుగుతుంది.
ఇంతవరకూ ఈ అవార్డ్ 2016, సంవత్సరానికి గానూ మెక్సికో దేశానికి చెందిన ఎంటానియో రోడ్రి గేజ్ గార్శియా, 2018 కి గానూ కోస్టారికా దేశపు కార్టూనిస్ట్ ఆర్కాడియో ఎస్క్వివేల్, 2019 సంవత్సరానికి గానూ డొమినికన్ రిపబ్లిక్ దేశానికి చెందిన జురెల్ ఒర్టిగా లు ఈ అంతర్జాతీయ అవార్డ్ ని సాధించగా 2020 సంవత్సరానికి గానూ తొలిసారిగా మన భారతదేశం, అందునా మన తెలుగు కార్టూనిస్ట్ మరియు ఖమ్మం జిల్లా ఖజానా శాఖాదికారిగా ఎంతో భాద్యతాయుత విధుల్లో వుంటూ కూడా ప్రవృత్తిగా అతను వేసిన ఈ కార్టూన్ ప్రపంచ కార్టూన్ పోటీలలో విజేతగా నేడు తనను నిలబెట్టడం నిజంగా ఎంతో గర్వకారణం.
ఈ సందర్భంగా నార్వే దేశంనుండి వచ్చిన అధికారిక మెయిల్ తో పాటు టూన్స్ మాగ్ సంస్థ అధికారికంగా తమ వెబ్ సైట్ లో పెట్టిన విజేతల ఫోటోలను కూడా వెంటపల్లి విడుదల చేసారు. అంతేగాకుండా ఈ పోటీలో విజేతగా నిలిచినందుకుగానూ వారు ప్రకటించిన అవార్డ్, ప్రశంశా పత్రం, పోటీలకు వచ్చిన కార్టూన్లతో వెలువరించే సావనీర్ మరియు వారు ప్రకటించిన 2000 క్రోన్స్ నార్వే దేశపు కరెన్సీ నగదు బహుమతి కూడా ఆ సంస్థ అందజేయనున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా తన కార్టూన్ ని అంతర్జాలంలో వీక్షించి ఎంతో క్లిష్టంగా వున్నఈ ఓటింగ్ ప్రక్రియలో తమ తమ మెయిల్స్ ద్వారా ఎంతో ఓపికతో వోట్లు వేసి తనను అంతర్జాతీయ పోటీలో విజేతగా నిలిపిన వోటర్లందరికి ధన్యవాదములు తెలియజేశారు.
ఈ సందర్భాన్ని పురష్కరించుకుని వెంటపల్లి సత్యనారాయణ తాను “కొవిడ్ -19” నేపధ్యంలో వేసిన కార్టూన్లతో ది 21-02-2021 నాడు ఖమ్మం జిల్లా ఖజానా శాఖ కార్యాలయ సమావేశ ప్రాంగణంలో THE IMPACT OF COVID -19 పేరుతో కరోనా పై వేసిన యాభై కార్టూన్లతో చేసిన వ్యక్తిగత కార్టూన్ ప్రదర్శనను ఖమ్మం జిల్లా కల్లెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆయన సతీమణి జిల్లా పరిషత్ C.E.O శ్రీమతి ప్రియాంక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన అన్ని శాఖల అధికారులతో పాటు ముఖ్య అతిథిగా ప్రముఖ కళావిమర్శకులు మాకినీడి సూర్య భాస్కర్, వివిధ ప్రాంతాల నుండి చిత్రకారులు , కార్టూనిస్ట్ లు బీర శ్రీనివాస్, కార్టూనిస్ట్ మిత్రులు హాస్యానందం ఎడిటర్ పి. రాము, బాచి, గాలి వేణుగోపాల్, అంతోటి ప్రభాకర్, అర్జున్, సుభాని తదితరులు పాల్గొని వెంటపల్లి కార్టూన్లలోని విశిష్టతను కొనియాడారు.
ఎంతో ఆత్మీయంగా పాల్గొన్న ఖమ్మం జిల్లా అధికారులకు ఒక అధికారిగా వెంటపల్లి కార్యాచరణ సరణి గురించి వివరించనవసరం లేదని, అందువల్ల ఆర్టిస్టుగా ఆయన గురించి వివరిస్తానన్నారు మాకినీడి. ప్రముఖ కళావిమర్శకులు డా. సూర్యదేవర సంజీవదేవ్ రచనలను వెంటపల్లి బాగా ఆపోశన పట్టారనీ, అందుకే ఆయన రచనల్లో సంజీవదేవ్ కళాతాత్త్వికత తొంగి చూస్తుంటుందన్నారు మాకినీడి. ముఖ్యంగా వ్యాసం ఎత్తుగడ, ముగింపుల విషయంలో సంజీవదేవ్ బాణీ కొట్టవచ్చినట్లు కనిపిస్తుందన్నారు. ఒక చిత్రకారుడు విజయవంతం కావాలంటే, అతనికి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అవగాహనలతో పాటు చారిత్రక నేపథ్య అవగాహన కూడా ఎంతో అవసరమంటూ, ఆ అవగాహన పుష్కలంగా ఉన్న చిత్రకారుడు వెంటపల్లి అన్నారు. పోటీ పరీక్షలకు తయారయ్యే సందర్భంగా వెంటపల్లి మామిడిపూడి వెంకట రంగయ్య గారి చరిత్ర పుస్తకాలను కూలంకషంగా చదివారనీ, బహుశా, ఆ పఠనమే ఆయన చారిత్రక ఆధారాలకు, అవగాహనకు ఆలంబన కావచ్చునని అభిప్రాయపడ్డారు.
“వరల్డ్ కార్టూనిస్ట్ అఫ్ ది ఇయర్ 2020′ అంతర్జాతీయ అవార్డ్”కు వెంటపల్లిని ఎంపిక చేసిన కార్టూన్ గురించి మాట్లాడుతూ, అది అంతర్జాతీయ అవార్డు సాధించడానికి అన్ని విధాలా అర్హత కలదన్నారు. ‘మదర్ ఎర్త్’ అంశానికి సంబంధించి “షేకింగ్ ది వరల్డ్ బై కొవిడ్-19”అన్న పేరుతో వేసిన ఈ కార్టూన్ ఆ అంశాన్ని బాగా ప్రస్ఫుటీకరించిందన్నారు. భూగోళంపై కోవిడ్ పట్టు ఆక్టోపస్ పట్టులాంటిదని భూగోళాన్ని చుట్టిన దాని నాలికల పట్టుతో సూచించారన్నారు. చిత్రం మొత్తం అధికంగా ఎరుపురంగులో ఉండడం, అది కలుగజేసే ప్రమాద తీవ్రతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
ముఖ్యంగా కలక్టర్ కర్ణన్ దంపతులు వారి చిన్నపిల్లలతో సహా ఈ కార్టూన్ ప్రదర్శనకు విచ్చేసి చివరి వరకు వుండి వెంటపల్లి కార్టూన్ల లో వ్యక్త పరిచిన సామాజిక సందేశాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. చివరిగా టూన్స్ మాగ్ నార్వే వారు పంపిన ధ్రువపత్రం సర్టిఫికేట్ తో పాటు దుస్సాలువతో వెంటపల్లి దంపతులను సన్మానించిన అనంతరం హాస్యానందం రాముతో పాటు వివిధ ప్రాంతాలనుండి వచ్చిన కార్టూనిస్ట్ మిత్రులు కూడా వెంటపల్లిని ప్రభాకర్ వేసిన వెంటపల్లి కేరికేచర్ ని బహుకరిస్తూ ఘనంగా సన్మానించారు. చివరిలో దూరప్రాంతాలనుండి వచ్చిన చిత్రకారులు కార్టూనిస్ట్ మిత్రులను వెంటపల్లి తన చిరు జ్ఞాపికతో సత్కరించారు. తమ బాస్ అయిన వెంటపల్లి పై అభిమానంతో ఒక పెద్ద పండుగను తలపించేలా ఈ కార్టూన్ ప్రదర్శనను వుమ్మడి ఖమ్మం జిల్లా ఖజానా సిబ్బంది యావత్తూ నిర్వహించడం గొప్ప విషయం .
-మాకినీడి సూర్యభాస్కర్
గుడ్ ఆర్టికల్ సర్….
ఇది వెంటపల్లి గారికి , హాజరైన మనకు కూడా గొప్ప జ్ఞాపకం గా ఉండిపోతుంది.
మిత్రులు. శ్రీ.వెంటపల్లి గారికి అభినందనలు.
ధన్యవాదములు శ్రీనివాస్ గారు అలాగే రాసిన మాకినీది గారికి ప్రచురించిన మిత్రులు కళాసాగర్ గారికి
ధన్యవాదములు శ్రీనివాస్ గారు .అర్టికాల్ రాసిన మాకినీది గారికి 64 కళలు.కాం ప్రచుంచిన కళాసాగర్ గారికి ధన్యవాదములు
Congrats Ventapalli garu…. Great achievement.
Thank you so much sir shankar sir