‘సంప్రదాయం’ తో వేణుమాధవ్

దాదాపు దశాబ్దానికి పైగా తెలుగు తెరపై నవ్వుల పండించిన నటుడు వేణుమాధవ్. వెండితెరపై కనపడగానే నవ్వుల పూయించడంలో తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. వేణుమాధవ్ 1969, సెప్టెంబరు 28న సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభాకర్, తల్లి సావిత్రి. చదువంతా కోదాడలోనే సాగింది. వేణుమాధవ్ కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించారు.

చదువుకునే రోజు ల్లోనే ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించేవారు. ముంబై నుంచి ప్రత్యేకంగా ఒక బొమ్మ తెచ్చుకుని, కోదాడలో వెంట్రిలాక్విజాన్ని ప్రజలకు పరిచయం చేయాలని ఆయన చదివే కళాశాల వార్షికోత్సవంలో ప్రద ర్శన ఇచ్చారు. ఆ కార్యక్రమంలో అప్పటి శాసనసభ్యులు చందర్ రావు వచ్చి, ఆ ప్రదర్శనను తిలకించడం జరిగింది. ఆయన ఎంతో ముచ్చటపడి భువన గిరిలో ఆయన పార్టీ మీటింగ్లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నారు. ఆ మీటింగ్ కి వచ్చిన రాష్ట్ర మాజీ హోం శాఖామంత్రి మాధవరెడ్డి కూడా వేణు మాధవ్ ను నల్గొండ పార్టీ మీటింగ్ లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నారు. నల్గొండ ప్రదర్శన చంద్రబాబు నాయుడు చూసి, మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నారు. మహానాడు ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పారు.
సభ అయిపోయిన తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి -“మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్” అని చెప్పి చంద్రబాబు నాయుడు వైపు తిరిగి “వీరిని మనతో పాటే ఉంచండి” అని అన్నాడు.
ఆ పరిచయంతో వేణు హిమాయత్నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలి ఫోన్ ఆపరేటర్గా ఉద్యోగంలో చేరారు.
అయినా తనకు అబ్బిన మిమిక్రీ విద్యను వదిలిపెట్టకుండా పలు ప్రదర్శనలు ఇచ్చేవారు. తరువాత అసెంబ్లీలోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా చేర్చారు. తరువాత ఎన్టీ ఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్దిరోజులు పనిచేశారు. బొమ్మతో మిమిక్రీ చేస్తారు కాబట్టి ఎన్టీయార్ ఆయన్ని ‘బొమ్మగారూ!” అని ఆప్యా యంగా పిలిచేవారు.
అసెంబ్లీలో లైబ్రరీ అసిస్టెంటుగా పనిచేసేట ప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్రభారతికి వెళ్ళడం అలవాటైంది.
ఒకసారి ఆకృతిసంస్థ మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళి, అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చారు వేణుమాధవ్.
ఆ కార్యక్రమంలో ‘గుల గుల గులాబ్ జామ్’ అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డిలకు చాలా బాగా నచ్చి, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం అనే సిని మాలో అవకాశ మిచ్చారు. ఆ సినిమా పూర్తయిన మూడు రోజులకే ‘శ్రీకారం’లో అవకాశం వచ్చింది.

అలా వరుస అవకాశాలతో బిజీ అయి పోయారు వేణుమాధవ్. అలా స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగుతెరపై తిరుగులేని జైత్ర యాత్రను కొనసాగించారు. తొలిప్రేమ సినిమాలో అమ్మాయిల పైన వేణుమాధవ్ చెప్పిన డైలాగు ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది. దిల్ సినిమాతో మంచి పేరు వచ్చింది. 2006 లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డును అందు కున్నారు. హంగామా సినిమాతో హీరోగా మారిన వేణుమాధవ్, ప్రేమాభిషేకం సినిమాను నిర్మించారు. “హంగామా’, ‘భూకైలాష్’, ‘ప్రేమాభిషేకం’ చిత్రాల్లో వేణు హీరోగా నటించాడు. వేణుమాధవ్ తన పుట్టినరోజును అనాథ శరణాలయంలోనే జరుపుకునేవారు. వారికి ఉపయోగపడే ఏదొక పని చేయడం తనకు చెప్పలేని సంతృప్తి అని వేణుమాధవ్ చెప్పేవారు.
అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిల చలవతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి చేరు కున్న వేణుమాధవ్ తన ఇళ్ళకు అచ్చొచ్చిన కృష్ణ నిలయం అని పేరు పెట్టుకున్నారు.

400 సినిమాలలో నటించిన నవ్వులు పంచిన వేణుమాధవ్ కాలేయ సంబంధిత సమస్యతో కన్నుమూసారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

SA: