ఆనందాన్ని పంచిన తెలుగు భాషా దినోత్సవం

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముప్పవరపు వెంకయ్య నాయుడు (భారత గౌరవ ఉపరాష్ట్రపతి) గారి స్పందన… ….

తెలుగు భాషా దినోత్సవాన్ని స్వాభిమాన దినోత్సవంగా జరుపుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత. మన కట్టు, బొట్టు, మన భాష, ప్రాస, యాస, మన గోస.. మనమెప్పుడూ విడవరాదు. మనపద్యం, గద్యం, మన పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు అన్నింటినీ గౌరవించుకోవాలి. ఎక్కడ ఉన్నా శ్రద్ధగా జరుపుకోవాలి.
ఈ ఏడాది తెలుగు భాషా దినోత్సవం ఎన్నో అనుభూతుల్ని పంచింది. దక్షిణాఫ్రికా తెలుగు సమాజం ఏర్పాటు చేసిన తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసగించాను. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ తెలుగు సంఘాలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాయి. విదేశాల్లో ఉంటూ కూడా వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మాతృభాషకు, పుట్టిన నేలకు వారిచ్చిన గౌరవం నన్నెంతో ఆకట్టుకుంది..

నన్ను ఆకట్టుకున్న వాటిలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ కూడా ఉంది. శ్రీ టోనీ మనోజ్ కుమార్ అనే యువకుడు ఓ అంతర్జాల కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి గారు నమస్కారం అని సంబోధించగా… దానికి మోదీ గారు కూడా నమస్కారం చెప్పడం, టోనీ గారు అని సంబోధించడం, గారు అంటే అర్థాన్ని సహాధ్యాయులకు తెలియజేమనడం, తెలుగు భాషా దినోత్సవం నేపథ్యంలో అతడు తెలుగులో మాట్లాడుతాను అని అడగగా, ప్రధాని గారు ఒప్పుకోవటం, ఆ మాటలను ఆసాంతం విని అభినందించడమే కాక, తెలుగు వారి చిత్తశుద్ధి, కష్టపడే తత్వాలను ప్రశంసించడం ఆనందాన్ని అందించింది.
శ్రీ నందమూరి తారకరామారావు గారు, మాడుగుల నాగఫణిశర్మ అవధానానికి హాజరైన వీడియోను మరో మిత్రుడు నాకు పంపించారు. శ్రీ ఎన్టీఆర్ గారి మాటల్లో శతావధానం గొప్పతనాన్ని, పృచ్ఛకులుగా “నా ఆలోచన ఆచరణం, జాతికే అంకితం” అని వారు ఇచ్చిన మాటలను శ్రీ మాడుగుల గారు ఆశువుగా పూరించడం… ఇవన్నీ ఎంతో సంతోషాన్ని పంచాయి.
మారిషస్ లో ఉన్న ఐదో తెలుగు తరం యువతులు తెలుగు పాటలు పాడిన బి.బి.సి. వారి వీడియో ఒకటి చూశాను. వారి మనసుల్లో తెలుగు భాష పట్ల ఉన్న ప్రేమను చూసి ఆనందించాను. తెలుగు పాటలను ఎంతో చక్కగా పాడుతున్నారు. ఎల్లలు దాటిన తెలుగు వెలుగులు మన మాతృభాష వైభవాన్ని చాటుతుండడం తెలుగు వారందరికీ గర్వకారణం.
తెలుగదేలయన్న దేశంబు తెలుగు… అంటూ శ్రీ కృష్ణ దేవరాయల రూపంలో శ్రీ ఎన్టీఆర్ గారు నటించి మెప్పించిన సన్నివేశాన్ని కూడా ఆత్మీయులు పంపించారు. ఆ వీడియో చూస్తుంటే నా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. మా గురువు గారి నోటి వెంట తొలిసారిగా ఆ పద్య భావాన్ని విన్నాను. కన్నడ రాజై ఉండి, సంస్కృత పండితుడై ఉండి శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యద కావ్యాన్ని తెలుగులోనే రాయడానికి కారణం ఏమిటని రాణి గారు అడిగిన ప్రశ్నకు, ఈ దేశం తెలుగు వారిది, నేను తెలుగు రాజును, “దేశభాషలందు తెలుగు లెస్స” అంటూ చెప్పిన రాయల వారి మనసును ప్రశంసించకుండా ఎలా ఉండగలం.

మరెవరో తెలుగంటే.. గోంగూర, తెలుగంటే.. గోదారి అంటూ తెలుగు వారికి సొంతమై రుచుల్ని, అభిరుచుల్ని, కవుల్ని, మహనీయుల్ని, ప్రముఖుల్ని, స్వరాజ్య యోధులను గుర్తు చేస్తూ పంపించిన ఓ అక్షరామృతాన్ని కాసేపు ఆస్వాదించి, ఆనందించాను.
మిత్రుడు శ్రీ చిగురుపాటి కృష్ణ ప్రసాద్ గారి ధర్మపత్ని ఉమాగారు “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గీతాన్ని ఎంతో శ్రావ్యంగా పాడి నాకు తెలుగు భాషా దినోత్సవ బహుమతిగా పంపించారు. విని సంతోషించాను. నేల నలుచెరగుల నుంచి మారు మ్రోగే దాకా తెలుగు భాషా వైభవాన్ని చాటడం తప్ప ఆ గీతం గురించి తెలుగు వారికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంటుంది.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ లాంటి మహనీయులు చెప్పిన “తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా” అనే మాటలను గుర్తు చేసే విధంగా ఉన్నవి, వివిధ సందర్భాల్లో తెలుగు భాష గురించి నేను మాట్లాడిన వివిధ అంశాలతో తయారు చేసిన చిత్రాలు, తెలుగు భాష గొప్పతనం గురించి ఎంతో మంది రాసిన కవితలు, వచనాలు, పాటలు… ఇలా ఎన్నింటినో, ఎంతో మంది నాకు పంపించారు. వారందరికీ అభినందనలు.
ఇవన్నీ కలిపి చేసిన సంకలనం ఆదివారం చదివి, విని ఆనందిద్దాం. మాతృభాషపై మమకారం మరింతగా పెంచుకుందాం. పంచుకుందాం. మా అమ్మాయి దీప, అబ్బాయి హర్ష చేయించిన నా చిత్రాలు జోడించాము. మనందరం ఇంటిల్లిపాది కలసి ఆనందిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap