విక్టరీ ఆయన ఇంటిపేరు 

(జూన్ 14 వి.మధుసూదనరావుగారి 97వ జయంతి సందర్భంగా)
వి. మధుసూదనరావు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి దర్శకుడిగా వెలుగొందిన వ్యక్తి. ఇంటి పేరు వీరమాచినేని అయినా సినిమా అభిమానులంతా వి. మధుసూదనరావు అంటే విక్టరీ మధుసూదనరావు అనే అనుకునేవారు. ప్రజానాట్య మండలి నేపథ్యం నుంచి సినిమారంగానికి వచ్చిన మరో ఉత్తమ కళాకారుడు ఆయన. తొలి సినిమాతోనే ఆయనకి సవాల్ ఎదురయింది. మధుసూదనరావుగారు కమ్యూనిస్ట్ భావజాలం పూర్తిగా పుణికి పుచ్చుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి తొలి సినిమాగా ‘సతీ తులసి’ పౌరాణిక సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది.

అయినా తన వృత్తికి కట్టుబడి సతీతులసి సినిమాని ఆసక్తిదాయకంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఆయన తీసిన ప్రతీ భక్తి రస.. పౌరాణిక చిత్రాలు ఘనవిజయం సాధించడం ఆయన అంకితభావానికి నిదర్శనం. భక్త తుకారాం సినిమా అక్కినేని నాగేశ్వరరావు.. అంజలీదేవిలతో తీశారు. ఆ సినిమాలో విలన్ పాత్రధారి నాగభూషణం ద్వారా తన వామపక్ష భావజాలాన్ని సంభాషణల్లో చొప్పించారు మధుసూదనరావు.. ఆ సినిమా సూపర్ హిట్. అంతకుముందు ఎస్.టి.ఆర్.. శోభన్ బాబులతో తీసిన వీరాభిమన్యు బ్లాక్ బస్టర్ హిట్. ముఖ్యంగా పద్మవ్యూహం.. కురుక్షేత్రం యుద్ధ సన్నివేశాలు అప్పటికే చాలా అప్ డేటెడ్ గా .. హైటెక్నికల్ ట్రిక్ ఫొటోగ్రఫీతో తీశారు. చక్రధారి సినిమా కూడా విజయవంతం అయింది. ఆయన కెరీర్ చివరిదశలో లవ్.. కుశ్ హిందీ చిత్రం కూడా నవల) పౌరాణిక చిత్రం కావడం ఓ విశేషం. జయప్రద.. జితేంద్ర.. సీతారాములుగా నటించిన ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ హిందీలో నిర్మించారు.

రీమేక్ చిత్రాలు.. మంచి డ్రామా.. ఆసక్తిదాయకమైన కథనం ఉన్న సినిమాలను అధికశాతం వి.మధుసూదనరావు తన కెరీర్ లో రూపొందించారు. అయితే వాటిలో అధికశాతం రీమేక్ కథాంశాలు కావడం.. వాటికి తెలుగు వాస్తవికత జోడించి సినిమాలను తీర్చిదిద్దారు వి.మధుసూదనరావు, రక్తసంబంధం, ఆరాధన, ఆత్మబలం, గుడిగంటలు, మంచికుటుంబం, లక్ష్మీ నివాసం,  కళ్యాణ మంటపం,  మంచిరోజులు వచ్చాయి, కృష్ణవేణి, జేబుదొంగ, చక్రధారి,  ఎదురీత, విచిత్ర జీవితం, అంగడిబొమ్మ, మల్లెపూవు, శివమెత్తిన సత్యం, సంసారం, సంతానం, విక్రమ్,  సామ్రాట్ ,  ప్రాణ స్నేహితులు,  ఆత్మకథ, సింహస్వప్నం, పాపే మా ప్రాణం లాంటి 23 సినిమాలు రీమేక్ చేశారు. అన్ని విజయవంతమైన సినిమాలే…

నవలా చిత్రాల దర్శకుడు.. అలాగే నవలలని సినిమాలుగా తీసి.. సక్సెస్ అయిన దర్శకుల్లో వి.మధుసూదనరావు ముందుంటారు. యద్దనపూడి సులోచనారాణి రాసిన ఆత్మీయులు..కాంచనగంగ.. వాసిరెడ్డి సీతాదేవి రాసిన సమత నవల ఆధారంగా ప్రజానాయకుడు.. మాదిరెడ్డి సులోచన రాసిన ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఈ తరం మనిషి (మిస్టర్ సంపత్..ఎమ్.. ఆరెకపూడి (కోడూరి) కౌసల్యాదేవి రాసిన చక్రవాకం,  పోల్కంపల్లి శాంతాదేవి,  చండీప్రియ వి.మధుసూదనరావు డైరెక్ట్ చేశారు.

కొత్తవారికి ప్రోత్సాహం.. ప్రజానాట్యమండలి నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు. ప్రఖ్యాత రచయిత ముళ్ళపూడి వెంకటరమణ సంభాషణలు రాసిన తొలి చిత్రం ఎన్.టి.ఆర్ రక్తసంబంధం. చిన్నా చితకా వేషాలు వేస్తున్న శోభన్ బాబుని.. వీరాభిమన్యుతో స్టార్ హీరోగా మలిచింది. వి. మధుసూదన్ రావు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం తేనెమనసులు అయినప్పటికీ తెరపై కనబడ్డ తొలి చిత్రం పదండి ముందుకి. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేష్ ని జగమొండి చిత్రంతో పరిచయం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబుని సామ్రాట్ చిత్రంతో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున తొలిచిత్రం విక్రమ్ ని డైరెక్ట్ చేసింది ఆయనే.. సినిమా డైరెక్షన్ తగ్గించిన తర్వాత హైదరాబాద్ లో మధుఫిలిం ఇన్ స్టిట్యూట్ అని సినిమా శిక్షణాలయాన్ని ప్రారంభించారు. హీరో శ్రీకాంత్.. శివాజీ రాజా.. చిన్నా..సూర్య.. డైరెక్టర్ పూరీజగన్నాథ్ తదితరులంతా ఆ ఫిలిం ఇన్ స్టిట్యూట్ నుంచి వచ్చినవాళ్ళే. 2012లో తుదిశ్వాస తీసుకునేంతవరకూ సినిమా కళయే శ్వాసగా బతికిన మహాదర్శకుడు వి.మధుసూదనరావు. (జూన్ 14 వి.మధుసూదనరావుగారి 97వ జయంతి సందర్భంగా) వి.మధుసూదనరావు గారి జయంతి సందర్భంగా జూన్ 13వ తేదీ సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ఆవరణలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విమధుసూదన్ రావు గారి జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మధుసూదనరావు కుమార్తె వాణి గారు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ కి లక్ష రూపాయలు విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్నకుమార్ మా అధ్యక్షులు వికె నరేష్ మా సెక్రటరీ జీవిత రాజశేఖర్ మా ట్రెజరర్ రాజీవ్ కనకాల మా ఈసీ మెంబర్ సురేష్ కొండేటి పాల్గొన్నారు.

– తోట ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap