భావితరాలకు ‘బెజవాడ’ నగర చరిత్ర

*విజయవాడ తొలి ‘వారసత్వ నడక’కు మంచి స్పందన
*ఇంటాక్ (INTACH) వాలంటీర్లు ప్రతి ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
*12-10-2025, ఆదివారం విజయవాడలో ‘ఇంటాక్’ వారసత్వ యాత్ర నిర్వహణ.
*సాంస్కృతిక, వారసత్వంపై విద్యార్థులు, ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం.

ఆదివారం ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) విజయవాడ చాప్టర్ నిర్వహించిన మొట్టమొదటి వారసత్వ నడక మరియు కార్ రైడ్‌లో పాల్గొనేందుకు, అన్ని వయసుల పురుషులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరిలో కొందరు కెమెరాలు కూడా వెంట తెచ్చుకున్నారు. ఈ హెరిటేజ్ కార్ ర్యాలీని ఇంటాక్ జాతీయ ఛైర్మన్ అశోక్ సింగ్ ఠాకూర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ జెండా ఊపి ప్రారంభించారు.

విజయవాడలోని సిద్దార్థ కళాశాల వద్ద నుంచి ఉదయం 10 గంటలకు ఆరంభించి.. నగరంలో ఉన్న సాంస్కృతిక వార సత్వ కట్టడాలన్నింటినీ సందర్శిస్తూ.. వాటి గురించి అందరికీ వివరిస్తూ సాగిన హెరిటేజ్ వాక్ పాల్గొన్న వారందరినీ ఆకట్టుకుంది. నగర ప్రాచీన వైభవాన్ని నేటితరానికి పరిచయం చేసేందుకు ‘ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్(ఇంటాక్)’ స్వచ్ఛంద సంస్థ ఏపీ ఛాప్టర్ ఆధ్వర్యంలో ఈ హెరిటేజ్ కార్ ర్యాలీ సాగింది. మీ వారసత్వం గురించి తెలుసుకోండి.. నినాదంతో ఫ్యామిలీ డ్రైవ్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం వినూత్నంగా ఉండడంతో అధిక సంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఈ వారసత్వ నడక జెండా ఊపి ప్రారంభించారు. సిద్ధార్థ కళాశాల వద్ద ఆరంభమైన నడక, కార్ ర్యాలీ.. మొగల్రాజపురం గుహలు, బందరు రైవస్, ఏలూరు కాలువలు, గాంధీ హిల్, ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న అక్కన్న మాదన్న గుహలు, ఉండవల్లి గుహల మీదుగా సాగి తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ‘ఇన్ టాక్’ విజయవాడ ఛాప్టర్ ను ప్రారంభించారు. ఇన్లాక్ ఛైర్మన్ ఎ.కె. సింగ్, డైరెక్టర్ శుక్ల, ఏపీ ఛాప్టర్ కన్వీనర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రముఖ చరిత్రకారులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి హాజరై విజయవాడలోని వారసత్వ కట్టడాల వైభవం గురించి, ఆయా ప్రదేశాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి? పేర్ల వెనుక కథ అందరికీ వివరించారు.

విజయవాడ చారిత్రాత్మక నగరం. దీనికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. వారసత్వ, చారిత్రక, పర్యాటక, సాంస్కృతిక వైభవం, కళలకు నిలయం. నేటితరానికి నగర వైభవాన్ని తెలియజేసేందుకు ‘ఇంటాక్’ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించిన ‘ఇంటాక్ విజయవాడ’ ఛాప్టర్ కన్వీనర్ సాయి పాపినేని, కో-కన్వీనర్ బి. నాగ ప్రసూన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నగరంలోనూ కచ్చితంగా చేపట్టాలి. అప్పుడే మన చారిత్రక వైభవం భవిష్యత్తు తరాలకు తెలుస్తుంది.

-కళాసాగర్

Share via
Copy link
Powered by Social Snap