విజయవాడలో చారిత్రాత్మక గ్రంథాలయ సందర్శన యాత్ర
  • జూన్ 28న ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ఆధ్వర్యంలో అక్షర యాత్ర
  • పేర్ల నమోదుకు జూన్ 10 ఆఖరి తేదీ

గ్రంథాలయాలు కేవలం పుస్తకాలకు నిలయాలు కావు, అవి మన జాతి విజ్ఞాన సంపదను కాపాడే అక్షర దేవాలయాలు. డిజిటల్ యుగంలో పుస్తక పఠనం క్రమంగా తగ్గుముఖం పడుతున్న ప్రస్తుత తరుణంలో, గ్రంథాలయాల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడానికి ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చరిత్రలో మన సాహిత్య సంపదను పదిలంగా కాపాడుతున్న ప్రతిష్టాత్మక గ్రంథాలయాలను సందర్శించి, వాటిని గౌరవించడమే లక్ష్యంగా “గ్రంథాలయ సందర్శన యాత్ర”ను నిర్వహిస్తోంది.

యాత్ర ప్రధాన ఉద్దేశం: పుస్తక ప్రియుల్లో పఠనాసక్తిని పెంచడంతో పాటు, కవులు, రచయితలు తమ రచనలను ప్రతిష్టాత్మక గ్రంథాలయాల్లో చూసుకుని మురిసిపోయే అపురూపమైన అవకాశాన్ని కల్పించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. తొలివిడతగా 100 ఏళ్ల చరిత్ర పూర్తి చేసుకున్న ప్రకాశం జిల్లా వేటపాలెంలోని ‘సారస్వత నికేతనం’, గుంటూరులోని ‘అన్నమయ్య గ్రంథాలయం’లను విజయవంతంగా సందర్శించిన రచయితల సంఘం… ఈసారి బెజవాడలోని చారిత్రాత్మక గ్రంథాలయాలపై దృష్టి సారించింది.

ఒకే రోజులో అపురూప గ్రంథాలయాల సందర్శన: ఈ యాత్రలో భాగంగా 110 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన విజయవాడలోని పలు చారిత్రక గ్రంథాలయాలను ఒకేరోజు సందర్శించనున్నారు. అవి:

*హనుమంతరాయ గ్రంథాలయం
*రామ్మోహన్ గ్రంథాలయం
*ఠాగూర్ పరిశోధనాత్మక గ్రంథాలయం
*విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయం
*సర్వోత్తమ గ్రంథాలయం

యాత్ర విశేషాలు – సదుపాయాలు: యాత్ర తేదీ: జూన్ 28 (ఉదయం నుండి సాయంత్రం వరకు)

వసతులు: ఈ యాత్ర కోసం ప్రత్యేక బస్సు సౌకర్యంతో పాటు, సందర్శకులకు ఉచితంగా అల్పాహారం, భోజన సదుపాయం కల్పిస్తారు.

సత్కారం: పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరిస్తారు.

ప్రత్యేక ఆకర్షణ: ప్రముఖ రచయితలు, గ్రంథాలయోద్యమకారులు పాల్గొనే ఈ యాత్రలో పలువురు రచయితల కొత్త పుస్తకాల ఆవిష్కరణలు కూడా జరగనున్నాయి.

పేర్ల నమోదుకు వివరాలు: జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఈ ప్రతిష్టాత్మక సాహిత్య యాత్రలో పాల్గొనాలనుకునే ఆసక్తి గలవారు జూన్ 10వ తేదీలోపు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలి.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9247475975

సాహిత్యభిలాషులు, రచయితలు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని సాహిత్యయాత్రకు సహకరించాలని ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ప్రతినిధులు డా. సి. భవానిదేవి, చలపాక ప్రకాష్ ఒక ప్రకటనలో కోరారు.

Share via
Copy link
Powered by Social Snap