అంతరిక్షంలో అజరామరమైన ఆది తార

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 39

గుజరాత్ లో జన్మించిన భారత అంతరిక్ష పరిశోధనా పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌతిక శాస్త్రవేత్త విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. మన దేశానికి అంతరిక్ష పరిశోధనావసరాలను గుర్తించి దీనికై విశేష కృషి సలిపి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషనను అంతరిక్ష రంగంలో అగ్రదేశాల సరసన నిలిపిన పట్టువదలని విక్రమార్కుడు విక్రమ్ సారాభాయ్. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సి.వి.రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ రే ఇన్వెస్టిగేషన్ ఇన్ ట్రాపికల్ లాటిట్యూడ్ లో పరిశోధనలు జరిపి, పిహెచ్.డీ. పట్టా అందుకొన్నాడు. సారాభాయ్ కలలపంట తిరువనంతపురం సమీపంలో రాకెట్ ప్రయోగ కేంద్రస్థాపనను ఈయన జీవితంలో ఓ మైలురాయిగా పేర్కొనాలి. ఈ తుంబాకేంద్రం నుండి మనం తొలిసారిగా 1963 లోనే సోడియం వేపర్ పే లో తొలి అంతరిక్ష వాహనాన్ని ప్రయోగించగలిగాము. మనదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఉపగ్రహనిర్మాణ ప్రయోగశాలను నిర్మించాడు. బ్లెండ్ మెన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి, అంధులకు వెలుగునిచ్చిన విశాల హృదయుడీ సారాభాయ్. ఈయన ఆశయాలకు అద్దం పడుతూ తొలిసారిగా ఆర్యభట్ట స్వదేశీ పరిజ్ఞానంతో విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించబడింది. ఈ అంతర్జాతీయ అంతరిక్ష ఆణిముత్యం పద్మభూషణ్, పద్మవిభూషణ్ విక్రమ్ సారాభాయ్ నేటికీ మన ధృవతార.

(విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ జన్మదినం 12 ఆగస్ట్ 1919)

SA: