భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో లలిత కళా అకాడమి (భువనేశ్వర్), తంజావూర్ లోని సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ నేతృత్వంలో శుక్రవారం (19-9-2025) ఆంధ్రా యూనివర్శిటీ లలిత కళా విభాగంలో ‘వికసిత్ భారత్, కే రంగ్, కళా కే సంగ్..’ (‘viksit bharat’ ke rang kala ke sang) అంశపై పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఇది రెండు కేటగిరీలలో జరిగింది. ఒకటి ప్రొఫెషనల్ విభాగం, రెండవది విద్యార్థుల విభాగం. ఈ రెండు విభాగాలలోనూ సుమారు రెండు వందలకు పైగా కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విజేతలు: ముగింపు కార్యక్రమం లో ఆంధ్రా యూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ… కళాకారులను, వారిలోని సృజనాత్మకతను నిరంతరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వీసీ మాట్లాడుతూ ఏయూ విద్యార్థులు చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, నేర్చుకునేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తామన్నారు. ప్రొఫెషనల్, విద్యార్థుల విభాగాల చిత్రకళా పోటీల ఫలితాలను ప్రకటించారు. ప్రొఫెషనల్ విభాగంలో… ప్రథమ స్థానంలో నిలిచిన తేజ సతీష్(కాకినాడ)కు రూ. లక్ష, ద్వితీయ స్థానంలో నిలిచిన జానకీ జయరాం (శ్రీకాకుళం జిల్లా, లాబర)కు రూ.75 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన ఎన్. ప్రసాద్ కు రూ.50 వేల నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థుల విభాగంలో, ప్రథమ స్థానంలో నిలిచిన పి. గిరిప్రసాద్ కు రూ.25 వేలు, ‘ద్వితీయ స్థానంలో నిలిచిన ఎం. రాజ్యలక్ష్మికి రూ.15 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన జీనత్ పర్వరు రూ.10వేలు, స్పెషల్ కేటగిరి కింద నలుగురికి రూ.1000 చొప్పున అందజేశారు.
ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎ. నరసింహారావు, ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతి డి. సింహాచలం, బీఓఎస్ చైర్మన్ శిష్టా శ్రీనివాస్, తంజావూర్ సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి బి. రంగ భాష్యం తదితరులు పాల్గొన్నారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు.
‘వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో కూడా పొటీలు నిర్వహించారు. ఫలితాలు అయితే వెలువరించాల్సివుంది. విజయవాడలో రేపు 28-9-2025 న School of Planning and Architecture ప్రాంగణంలో పోటీలు జరుగనున్నాయి.
-కళాసాగర్
