తప్పెటగుళ్లు మోగాయంటే వినేవారి గుండె ఝల్లు మంటుంది. ఆనందంతో హృదయం పరవళ్లు తొక్కుతుంది. ఆ కళారూపానిది అంతటి మహత్తు. కళాకారుల తీయని స్వరం. వారి నడుమున వయ్యారంగా ఊగులాడే మువ్వలస్వరం, వారంతా హుషారుగా నర్తించే తీరు, ఆ పైన ఎగసిపడే తప్పెట్ల ధ్వని అన్నీ కలిసి అమరలోకనాదమేదో మన చెవి సోకినట్టుంటుంది. ఉత్తరాంధ్రకే స్వంతమైన ఈ తప్పెటగుళ్లు తెలుగు కళా వైభవానికి అద్భుతచిహ్నం.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా పల్లెసీమల్లో పండగయినా, తీర్థమైనా, పరసలైనా తప్పెటగుళ్లు లేకుండా జరగనే జరగవు. ఈ ప్రదర్శన మూలంగానే అవన్నీ రక్తికడుతుంటాయి. శ్రమజీవుల చెమటచుక్కల్లోంచి పుట్టుకొచ్చిన కళారూపంగా దీనికో విశిష్టత ఉంది. వ్యవసాయకూలీలుగా, వృత్తిపనివారిగా రెక్కలు ముక్కలు చేసుకున్న శ్రామిక జనం తమకష్టాలను మరచిపోవడానికి వందలయేళ్ల కిందటే నిర్మించుకున్న కళారూపమిది.
తప్పెటగుళ్లు కళాకారులను చూస్తే ముచ్చటేస్తుంది. వారు తమ గుండెలమీద తప్పెటను కట్టుకుంటారు. దీనిని ఇనుపరేకు డబ్బాతో తయారుచేసుకుంటారు. ఈ తప్పెటను మోగిస్తే లయబద్దమైన ధ్వని వినవస్తుంది. గుండెలు బాదుకుంటున్నట్టుగా వీటిని తడుతూ కళాకారులందరూ చిత్రమైన శబ్దాన్ని సృష్టిస్తుంటారు. దీంతోపాటుగా తమ కటివలయాలకు మువ్వల వడ్డాణాలను చుట్టుకుంటారు. కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. హనుమంతుడి మాదిరిగా నడుముకు దట్టీ ధరిస్తారు. ఈ ఆహార్యంతో ప్రదర్శన ప్రారంభిస్తారు. ఒక్కో బృందంలోనూ పదిమందికి తక్కువ కాకుండా సభ్యులుంటారు. వీరికో నాయకుడుంటాడు. ఇతగాడు చక్కగా పాడేవాడయ్యుంటాడు. ముందుగా పల్లవి అందుకుంటాడు.
గ్రామదేవతకు సంబంధించిగానీ, లేదా భాగవత, రామయణాలకు చెందిన కళలను గానీ తీసుకుని గానం చేస్తుంటాడు. మిగిలినవారంతా అతని గీతానికి వంత పాడుతుంటారు. అప్పుడప్పుడు కొన్ని సందర్బోచితమైన సంభాషణలూ పలుకుతుంటారు. ఒకవైపు తప్పెట్లను రెండు చేతులతో జోరుగా మోగిస్తుంటారు. మరోవంక అల్లంత ఎత్తున ఎగిరెగిరి పడుతుంటారు.
అలా అలుపు లేకుండా సాయంత్రం మొదలు పెట్టిన ప్రదర్శన తెల్లవారుఝాము వరకూ సాగుతూనే ఉంటుంది. మధ్యమధ్యలో ప్రేక్షకులను ఆనందపరచడం కోసం తప్పెటగుళ్ల కళాకారులు కొన్ని విన్యాసాలు చేస్తుంటారు. సర్కస్ లో మాదిరిగానే ఒకరిమీద మరొకరు నిలిచి రకరకాల సాహసకృత్యాలకు దిగుతుంటారు. దీంతో చూపరుల ఆనందానికి అవధులుండవు. ఒక్కసారి తప్పెటగుళ్ల ప్రదర్శనను తిలకిస్తు ఏకకాలంలో చాలా కళారూపాలను చూసినట్టవుతుంది.
నృత్యం, గానం, వాద్యగోష్ఠి ఇలా అన్నీ కలగలిసి ఐక్యత సాధించినట్టుంటుంది. ఉత్తరాంధ్రలో పుట్టిన ఈ కళారూపానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. దేశవిదేశీ జానపద కళా ఉత్సవాల్లో ప్రదర్శనకు నోచుకుంది. ప్రముఖ దర్శకుడు జంధ్యాల ముద్దమందారం సినిమా నిర్మాణం కోసం అప్పట్లో విశాఖజిల్లా వచ్చారు. తప్పెటగుళ్ల ప్రదర్శనను సినిమాలో సందర్బోచితంగా వాడుకున్నారు. జో లాలీ… ఓలాలీ.. ఒక టాయె రెండాయే ఉయ్యాల.. పాట ఆ సినిమాలోకి అలా వచ్చిందే.
కాలం ఎంతగా మారిపోతున్నా ఇప్పటికీ ఉత్తరాంధ్ర వాకిట సాయంసంధ్యవేళలో ఏ రామకోవెల ముంగిట్లోనో ఏ రచ్చబండ మీదనో, ఏ పండగ సంబరాల్లోనో తప్పెటగుళ్లు మోగుతూనే ఉంటాయి. దీనిని బట్టి పల్లెజనం ఈ కళారూపం పట్ల చూపుతున్న ఆదరణ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
-డా. చింతకింది శ్రీనివాసరావు
తప్పెటగుళ్ళు వ్యాసం బాగుంది
పూర్తి సమాచారం ఉంటే ఇంకా బాగుండేది