ఆ వాన నాలో ఇంకా కురుస్తూనే వుంది …

1979 అక్టోబర్ 9 సాయంత్రం ఖమ్మం పట్టణంలోని వర్తక సంఘం భవనం ముందు సుమారు రెండు వందల మంది ఊరేగింపునకు సిద్ధంగా ఉన్నారు. రెండు రోజులుగా అక్కడ తర్జన, భర్జనలకు మధ్య, ఉద్వేగాల మధ్య, సుదీర్ఘ చర్చలు, సమీక్షలు, నవ మార్గ నిర్మాణ ఆశల, ఆశయాల కూర్పు తరువాత, ఒక నూతన ప్రజాస్వామిక స్వప్నకేతనాన్ని ఎగరేసిన సంఘటనని, ప్రపంచానికి ప్రకటించడానికి సిద్ధమైన ఊరేగింపు అది.
ఊరేగింపుతో పాటే పెద్ద వాన కూడా మొదలైంది. అందరం తడచి ముద్దయ్యాము. శ్రీ శ్రీ, కోకు, రావిశాస్త్రి, జ్వాలా ముఖి, వరవరరావు, కేవీఆర్, నగ్నముని, సీవీ, ఓల్గా, నేనూ, కిరణ్ బాబు, సుగమ్ బాబు, ఇంకా నాకు గుర్తులేని అనేక మంది. ఇందరు దిగ్గజ రచయితలూ, కవుల మధ్య నేను. ఆ వర్షం యాభై ఏళ్ల తర్వాత కూడా ఇంకా నాలో కురుస్తూనే ఉన్నట్టనిపిస్తుంది. అది ఎప్పటికీ కురుస్తూనే ఉంటుంది. బహుశా అట్లా ఆవిర్భవించిన విప్లవ రచయితల సంఘం, ఈ యాభై ఏళ్ల మహా ప్రయాణం తర్వాత, ఆనాటి తన నిర్దేశిత లక్ష్యాల పట్టికలో పేర్కొన్న ఆశయాలలో యెన్నింటిని, ఏమేరకి సాధించగలిగిందో, ఏమి సాధించగలిగిందో నిలిచి వివేచించాలి. సమీక్షించుకోవడానికి, ఈ సందర్భాన్ని నాయకత్వం నిజాయితీగా ఉపయోగించుకుంటుందని విశ్వసిస్తున్నాను.
విరసం ప్రయాణం ప్రారంభమైన తర్వాత, ఈ ఐదారు దశాబ్దాలలో భారత దేశం, ప్రపంచం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. కమ్యూనిష్టుపార్టీలు ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలు విడిచి పెట్టి, ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలుగా మారాలని నిర్ణయించుకున్నతర్వాత, ఈ దేశపు శ్రామిక, మధ్యతరగతి ప్రజలకి అండగా ఉండి, దిశానిర్దేశం చేయగలవనుకున్న విప్లవ పార్టీలు కూడా చీలికలు పేలికలై, విశాల ప్రజానీకాన్ని గందరగోళంలో విడిచి పెట్టాయి. పర్యవసానంగా మెజారిటీ ప్రజలు, జాతీయ, ప్రాంతీయ పార్టీల రాజ్యాధికార క్రీడలో నిస్సహాయ ఓటర్లుగా మారిపోయారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో, 40వ దశకాల్లో ప్రజానాట్యమండలి, అభ్యుదయ రచయితల సంఘం, ఒక విశాల ప్రాతిపదిక మీద, నిర్వహించిన పాత్రని విరసం నిర్వహించగలిగిందా అనే ప్రశ్న నిరాధారమైయిందేమీ కాదని అనుకుంటాను. బహుశా ఇది నేననుకుంటున్నంత సింపుల్ ప్రశ్న కాకపోవచ్చు కూడా.
విముక్తి పోరాటాలు చేస్తున్న అజ్ఞాత పార్టీలకి, వెలుపలి ప్రపంచంలో ఒక స్వరంగా మారే బాధ్యతని స్వీకరించిన విరసం… ఇతర భావసారూప్య సంస్థలనూ, మేధావులనూ, కవులనూ, కళాకారులనూ, కలుపుకుపోవడంలో ఇంకా ఎక్కువ చొరవతో, ఇంకా ఎక్కువ సమయాన్ని, ఇంకా ఎక్కువ కృషినీ, వెచ్చించ వలసిందనుకుంటాను. నిజమే విరసం స్వాభావికంగానే కణకణ మండే నిప్పుల గుండం లాంటిది. అందులో సభ్యత్వం అంటే అగ్నిపునీతమే. దానితో స్నేహం కూడా తక్కువ ప్రమాదకరమేమీ కాదు. అయినా యెందుకో విరనం రెక్కలు వర్తిగా విప్పవలసిందనిపిస్తోంది. దాని నిర్దేశిత రాజకీయ ఆచరణతోపాటు, హేతువాదం, లౌకిక వాదం వంటి అనేక కీలకమైన రంగాల మీద విరసం పుట్టక ముందు పాక్షికంగానే అయినా సాగిన సాహిత్య, సాంస్కృతిక కృషిని అందుకుని పెద్ద ఎత్తున ముందుకు తీసుకు పోవలసిన బాధ్యత మీద దృష్టి పెట్టలేకపోయింది. విరసం వంటి ప్రజా సాహిత్య సంస్థలు దేశవ్యాప్తంగా కూడా ఈ పని తమది కానట్టు వ్యవహరించడం వల్లనే భారత దేశం ఇప్పుడు ఒక మతరాజ్యపు సరిహద్దు మీద ప్రమాదకరంగా నిలుబడి ఉంది.
విరసం మీద విమర్శలు ఎన్నైనా ఉండవచ్చు కానీ.. ఈ యాభై ఏళ్లు తెలుగు సాహిత్యం మీద , సాంస్కృతిక రంగం మీద దాని ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల గాఢతను అవి ఏమీ తగ్గించలేవు, ఇప్పుడు గొప్ప రచయితలుగా, కవులుగా, విమర్శకులుగా, ఎదిగిన వారిలో అనేకమంది మీద విరసం వెలుగు ప్రసరించి, ప్రతిఫలించింది, ఇందుకు నేనూ, శివారెడ్డి, ఓల్గా, ఖాదర్, దేశరాజు వంటివాళ్లం కూడా మినహాయింపు కాదు, ..
ఈ సంరంభం జరుగుతున్నప్పుడు, యాభై ఏళ్లుగా విరసం ప్రధాన స్వరంగా భావ, భాస్వరంగా మండుతూ విరసం ఉనికికి ఒక సంచార లైట్ హౌస్ వలె ప్రపంచానికి చాటుతూ వచ్చిన మహత్తర కవి వి.వి. ఎక్కడ? ఎందుకిలా? విరసం పెద్దలు, విరసం అభిమానులు ఆలోచించవలసిన ప్రశ్నలు, “విప్లవ” రచయితల సంఘం, విప్లవ “రచయితల సంఘంగా, కొత్త జవసత్వాలతో, విశాల యోచనలతో వర్ధిల్లాలి!
-దేవీప్రియ

SA: