యాభైవసంతాల “విరసం”

(2020 జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాదులో 50 ఏళ్ల మహా సభలు)
ఈ ఏడాది జులై 4తో ‘విప్లవ రచయితల సంఘం’ యాభయ్యో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఇలాంటి తేదీలకు ప్రత్యేకంగా ఏ గుర్తింపూ ఇవ్వనవసరం లేదు. దేనికంటే ఇరవై ఏళ్లు, యాభై ఏళ్లు, వందేళ్లు అనే వాటికి ఫ్యూడల్ అర్థాలు కూడా ఉంటాయి. చారిత్రక దృష్టితో చూస్తే విశేషమైన అర్థాలు ఏమీ ఉండవు. కేవలం చారిత్రక సందర్భాలు మాత్రమే. సంస్థలు, ఉద్యమాలు ఆ సందర్భాల్లో ఒకసారి తన గమనాన్ని, గమ్యాన్ని తరచి చూసుకుంటాయి. ఒక లక్ష్యంతో పని చేసే క్రమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చాయి? వాటిని ఎలా అధిగమించాం? ఎలాంటి చారిత్రక సందర్భంలో ఈ ప్రయాణం మొదలైంది? అప్పటికీ ఇప్పటికీ ఏం మార్పులు వచ్చాయి? ఉద్యమాల వల్లనే వచ్చిన మార్పులు ఏమిటి? వ్యవస్థ తన సజీవ సంక్లిష్ట చలనం వల్ల ఏ మార్పుల గుండా సాగుతోంది? వాటిలో మన క్రియాశీల జోక్యం ఎలా ఉన్నది? ఇంకెలా ఉండాలి? అనే ప్రశ్నలు వేసుకొనే సందర్భాలుగా ఉపయోగపడతాయి. వాటికి గత అనుభవం నుంచి, అవగాహన నుంచి సమాధానాలు వెతుక్కోడానికి పనికి వస్తాయి. భవిష్యత్ కు అవసరమైన దారిని చదును చేసుకొనే సందర్భాలవుతాయి.

నిజానికి ఆచరణలో ఉండే ఉద్యమాలు నిత్యం ఈ ప్రశ్నల మధ్యనే పని చేస్తుంటాయి. భావాలు, వాస్తవాలు, మార్పులు కేవలం అక్షరాల్లో మాత్రమే కనిపించవు. భావాలు-భౌతిక వాస్తవాల మధ్య ఉండే సంక్లిష్ట క్రమాలు ఆచరణలోనే తెలుస్తుంటాయి. వాస్తవికతలోని అంతరార్థాలు ఆచరణలో, ప్రజా జీవితంలోనే అందుతుంటాయి. అనుక్షణం ఆచరణ, అనుభవం, సిద్ధాంతం అనే మూడు తలాల్లోంచి ఉద్యమాల ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి నిత్యం తెలుసుకుంటున్న విషయాన్నే ఒక కాలఖండిక వద్ద నిలబడి మరింత జాగ్రత్తగా పరిశీలించుకోడానికి ఇలాంటి సందర్భాలు ఉపయోగపడతాయి. ఏ ఉద్యమాలకైనా, నిర్మాణాలకైనా ఇది వర్తిస్తుంది.
విప్లవ రచయితల సంఘం అనుభవం కూడా ఇదే. ఒక రచయితల సమూహం యాభై ఏళ్ల కింద ఒక లక్ష్యం ప్రకటించుకొని సంఘటితమైంది. ఏదో ఒక లక్ష్యం లేకుండా ఏ సంఘమూ ఉండదు. సంస్థగా ఏర్పడటమంటేనే ఉమ్మడిగా సాధించవలసిన ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నట్లు. లక్ష్య సాధనకు ఒక దృక్పథం ఉన్నట్లు. దృక్పథం లేకుండా లక్ష్యం దిశగా సాగడం అయ్యేపని కాదు. అసలు ఏనీ దృక్పథం లేకుండా ఎవ్వరూ పని చేయలేరు. దృక్పథం అంటే చూపు దారి. విప్లవ రచయితల సంఘం మార్క్సిజం లెనినిజం మావోయిజం తన దృక్పథంగా ఈ యాభై ఏళ్లుగా పని చేస్తున్నది.
విరసం కొద్ది మంది రచయితల సమూహం కలిపి ఏర్పరిచిన సంఘం మాత్రమే కాదు. ఇది రూపం మాత్రమే. దీనికి తప్పక ప్రాధాన్యత ఉంది. ఆలాంటి రూపం ఏర్పడి యాభయ్యేళ్లు అయినందు వల్లనే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం.
అయితే అంత మాత్రమే కాదు. కొందరి వ్యక్తుల్లోని ఆకాంక్షగా, ఆశయ ప్రకటనగా కనిపించే ఈ రూపం వెనుక చారిత్రక సారం ఉన్నది. చరిత్రను నిర్మించే ప్రజలు తీవ్ర సంఘర్షణాయుతమైన మార్గం ఎంచుకున్నారు. సమాజాన్ని, జీవితాన్ని మార్చే ఆచరణను ఎంచుకున్నారు. అది సహజంగానే రచయితలను, బుద్ధిజీవులను ప్రభావితం చేసింది. రచయితలకు కర్తవ్యాలు నిర్దేశించిన ఉద్యమాలు మన దేశంలో ఎన్నో జరిగాయి. రచయితల భాగస్వామ్యాన్ని కోరుకున్న ఉద్యమాలు కూడా చాలానే జరిగాయి. నక్సల్బరీ ఉద్యమం కళా సాహిత్యాలతో, సృజనకారులతో అంతకంటే చాలా లోతైన సంబంధాన్ని ఏర్పర్చుకున్నది. ఉద్యమాలకు సాయపడటం, ప్రచారం చేయడం అనే దశ నుంచి రచయితలకు క్రియాశీలమైన విప్లవ కర్తృత్వాన్ని నక్సల్బరీ ఉద్యమం అందించింది. ఇది గతంలో రచయితలకు, ఉద్యమాలకు ఉన్న సంబంధాలకంటే చాలా భిన్నమైనది. మౌలికంగా విప్లవాత్మకమైనది.
అందువల్లనే కళా సాహిత్య రంగాలు, మేధో రంగాలు అనూహ్యమైన మార్పుకు లోనయ్యాయి. భావాలు కేంద్రంగా ఉండే సాహిత్యం భౌతికశక్తిగా మారింది. నేరుగా ప్రజా ఆచరణతో తాత్విక, రాజకీయ సంబంధం ఉన్నందు వల్లనే సాహిత్యానికి అంత శక్తి వచ్చింది. సాహిత్యం మానవ చైతన్యరూపంగా, మానవ ఆచరణ రూపంగా మారింది.
మిగతా ఎన్నో విజయాలు సాధించిన విప్లవ సాహిత్యోద్యమానికి ఇది పునాది. వర్గపోరాటాల వెలుగులో సాహిత్య రచన ఎలా ఉంటుందో ఈ యాభై ఏళ్లలో విరసం నిరూపిస్తోంది. ఈ క్రమంలో చాలా సంక్షోభాలను ఎదుర్కొంది. సమాజాన్ని, సాహిత్యాన్ని చాలా ప్రభావితం చేసింది. అలాగే సమాజంలోని ప్రజా పోరాటాల నుంచి నిత్యం ప్రభావితం అవుతోంది. అసాధారణ త్యాగాలు చేస్తూ ముందుకు వెళుతున్న సాయుధ వర్గపోరాటాల నుంచేగాక అనేక ప్రజాస్వామిక ఆకాంక్షలతో పోరాడుతున్న ప్రజలు అందిస్తున్న చైతన్యం వల్లనే ఈ యాభై ఏళ్ల ప్రయాణం సాగింది. అలాగే అనేక ప్రజాస్వామిక, సాంఘిక విముక్తి భావధారలను విరసం ప్రభావితం చేసింది. వాటి ప్రభావాన్ని స్వీకరించింది. ప్రభావితం చేయగల సజీవ ఉద్యమమే ప్రభావాలను లోనవుతుంది. నేర్పించగల శక్తి ఉన్న ఉద్యమమే నిత్యం నేర్చుకోవడం సాధ్యమవుతుంది. విరసం సాధించిన విజయాలన్నీ ఈ గతితర్కం వల్లనే సాధ్యమైంది. పోరాట ప్రజలు, చుట్టూ ఉండే సహచరులు, విమర్శనాత్మక మిత్రులతో కలిసి సాగించిన ప్రయాణం ఇది. అంతిమంగా ఇదంతా ప్రజాశక్తులు నిర్మిస్తున్న చరిత్ర.
వర్గపోరాటాలతో అత్యంత సన్నిహితంగా ఉన్నందు వల్ల విరసం వేస్తున్న ప్రభావాలకు సమాజమే కాదు, మొదటి నుంచి రాజ్యం చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. భావాల ప్రచారం, భావాలను భౌతికశక్తిగా మార్చడం వల్ల తనకు వచ్చే విపత్తు గురించి రాజ్యానికి, పాలకవర్గాలకు బాగా తెలుసు. అందుకే సంస్థ ఏర్పడిన తొలి రోజుల నుంచి ఇప్పటి దాకా తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటున్నది. రచయితలు ఇంత హింసను, అణచివేతను అనుభవించేందుకు సిద్ధం కావడం దాని తాత్విక బలాన్నే కాక, నిర్మాణ బలాన్ని కూడా సూచిస్తోంది. ప్రపంచంలోనే రాజ్య నిషేధానికి గురైన సంస్థ కూడా విరసమే. అయితే నిషేధం కూడా దాని సృజనశక్తిని, చైతన్యాన్ని అడ్డుకోలేకపోయింది.
ఇలాంటి ప్రయాణం కాబట్టే యాభై వసంతాలనే కాదు, యాభై శిశిరాలనూ అనుభవించింది. అయితే ఎప్పటికప్పుడు వసంతమనే ప్రగతి వైపే మొగ్గుతూ శిశిరాన్ని అధిగమిస్తూ ముందుకెళుతోంది. సంక్షోభాలు, కల్లోలాలు, సవాళ్లు ప్రజా ఆచరణలో భాగమైన శక్తులకే ఉంటాయి. అంతే కాదు. ఇలాంటి ఆచరణే అన్ని అవరోధాలను అధిగమించగలదని ఈ యాభై ఏళ్ల కాలం నిరూపించింది. ఆ రకంగా తాను రుజువు చేసుకుంటున్న సంస్థ.
కాబట్టి యాభై ఏళ్లకు ఒక చారిత్రక ప్రత్యేకత ఉంది. తనలోకి తాను లోతుగా తొంగి చూసుకొని మదింపు వేయవలసిన సందర్భం కూడా ఇది. ఇప్పుడున్న సంక్షోభకాలాన్ని ఎదుర్కోడానికి మరింత గాఢమైన ఆలోచనలతో ముందుకు వెళ్లేందుకు దారిని విస్తరించుకోవాలసిన సమయం ఇది. ఈ పని విరసం ఒక్కటే చేసేది కాదు. అనేక రకాల శక్తులు కలిసి చేయవలసిన పని. ఇప్పటి దాకా జరిగిన పని కూడా అనేక శక్తుల పరస్పర సంఘీభావం వల్లనే సాధ్యమైంది. అలాంటి సందర్భంగా కూడా దీన్ని మలిచే ప్రయత్నంలో భాగంగా సెప్టెంబర్ 28న హైదరాబాదులో విరసం యాభై ఏళ్ల మహా సభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల్లోని మూడు తరాల ప్రగతిశీల రచయితలను ఆహ్వానించాం. వేర్వేరు పీడిత అస్తిత్వ ఆకాంక్షలను సాహిత్య మేధో రంగాల్లో ఎత్తిపడుతున్న సృజనకారులను, మేధావులను, విప్లవాభిమానులను, ప్రజా సంఘాల నాయకులను ఆహ్వానించాం.
హాజరైన వాళ్లంతా సమాజంపట్ల ఆర్తితో విస్తృత చర్చలో పాల్గొన్నారు. విరసం, విప్లవోద్యమ విజయాలతోపాటు తమ వ్యక్తిత్వాల రూపకల్పనలో విరసం ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకింత ఉ ద్వేగ వాతావరణంలో లోతన సంభాషణ సాగించారు. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ఇంకా చేయవలసి ఉన్న కర్తవ్యాలు, వాటికి సూచనలు, విమర్శలు ఎన్నో ముందుకు వచ్చాయి. ‘యాభై వసంతాల సృజనాత్మక ధిక్కారం’ కేంద్రంగా 2020 జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాదులో జరిగే 50 ఏళ్ల మహా సభలు విజయవంతం చేయడానికి కృషి చేద్దామనే సంకల్పాన్ని సమావేశం ప్రకటించింది. సమావేశానికి హాజరైన సాహిత్య మిత్రులతోపాటు మొత్తంగా విరసం ఆహ్వానించిన రచయితలందరితో కలిసి ఆహ్వాన సంఘం ఏర్పడింది.

-పాణి

http://virasam.org/index.php

 

1 thought on “యాభైవసంతాల “విరసం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap