“చిత్రకళ” వైవిధ్యంతో కూడుకున్న కళ. చిత్రకారుని యొక్క వైవిధ్యం వల్ల ప్రకృతికి ప్రతిసృష్టి జరిగి కళారూపంగా మారుతుంది. ఇతర కళలతో పోలిక చెప్పుకుంటే ప్రకృతికి ప్రతిరూపంగా దాదాపుగా వెళ్ళ గలిగేది చిత్రకళ అని చెప్పవచ్చు. రూపపరంగా ప్రకృతిని పునఃసృష్టి చేయగలిగినది “చిత్రకళ”. శబ్దపరంగా సంగీతాన్ని చెప్పవచ్చు. మూడవ అయితనంగా చెప్పుకుంటే శిల్పం. తనదైన శైలిలో ప్రకృతికి అంజలి పట్టే నాట్యం . ఇలా కళలన్నీ వైవిద్యభరితమైనవే. కానీ రంగులో, రూపంలో, ఆకారంలో అన్నింటా ప్రకృతికి దాదాపుగా సరిపోలినట్లు చిత్రించడమన్నది చిత్రకళలోనే సాధ్యం. ఇందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. కాన్వాసుగానీ, కుంచెలుగానీ, పేలట్ గానీ, రంగులతో గానీ కళలేదు. ఇవి కళాసాధనాలు మాత్రమే. వీటిని సమర్ధవంతంగా వినియోగించుకున్న కళాకారుని అంతరింగిక జగత్తు వెలుపలికి వస్తుంది. చిత్రకళారూపంగా మనముందు సాక్షాత్కరిస్తుంది.
అందరూ చూస్తున్న వాటినే చిత్రకారుడు చూస్తున్నాడు. కానీ చూసిన ఆ కోణం, తనలోని అంత:చైతన్యం, భావ ఉద్దీపనంతో ఒక విశేషమైన “చిత్రకళారూపం” వెలువడుతుంది. ఇలాంటిది మరో కళారూపాన దాదాపుగా ఇంత మొత్తంలో జరుగదు. అనుకరణంగా ఉంటాయి. చిత్రకళ ఒక అనుసరళంగా ప్రతిసృష్టిగా చెప్పబడుతుంది.
చిత్రకారుడు తను చూసిన, తాను పొందిన, తాను సంపాదించుకున్న తాను అనుభవించిన అనుభవాలు తన చిత్రంలో పొందుపరుస్తాడు. చిత్రకారుని దృష్టి కోణమే వేరుగా ఉంటుంది. అందరూ చూస్తున్న దృశ్యాన్నే తనదైన వ్యూ ఫైండర్ తో చూస్తాడు. ఊర్ధ్వ, క్షితజ, భూరేఖల మధ్యన తను చూపిన రూపాన్ని పునఃసృష్టిస్తాడు.
అందరూ చూస్తున్న రూపంగా ఉన్న “గుర్రమే” హుస్సేన్‌సాబ్ చేతిలో తనదైన శైలిలో కనబడుతుంది. ఇంత అందంగా “కాకులు” కూడా ఉంటాయా అనిపిస్తాయి ఆర్కేలక్ష్మణ్ కార్టూన్ క్యారికేచర్లలో కాకులను చూసినపుడు. తను జంతు, వృక్ష, ఇతర విషయాలే కాక ప్రతి చిత్రకారుడు ప్రతి విషయాన్నీ కళాత్మకంగా చూస్తాడు. చూపరులకు చూపించగలడు.
వయత్ అనే చిత్రకారుని చిత్రం ‘పిగ్” (పంది) ఎంతో అందంగా అనిపిస్తుంది. రంగుల సాంద్రత వల్ల చిత్రానికి ఆ సున్నితత్వం వచ్చి, అది చూడడానికి వైవిద్యంగా ఉంటుంది. జార్జ్ టబ్ గుర్రాలు గీస్తాడు. గుర్రాల అనాటమీ బాగా స్టడీ చేసినవాడు కాబట్టి ఆ చిత్రాలతో అంత పుష్టి ఉంటుంది. లీ హెమండ్ అనే చిత్రకారుణి గుర్రాల చిత్రాలు, పక్షుల చిత్రాల సిరీస్ ఎన్నో చిత్రించింది. వీటిని ఔత్సాహికులకు నేర్చుకోడానికి వీలుగా స్టెప్ బై స్టెప్ గా ఎలా పక్షుల చిత్రాలు గీయాలో తన ప్రతిభను వైవిధ్య భరితంగా చూపుతుంది.
ప్రతిచిత్రకారుడు తన చిత్రం వైవిధ్య భరితంగా ఉండాలని కోరుకుంటాడు. ఇతరుల చిత్రాలకన్నా తన చిత్రం వైవిధ్యంగా ఉండాలనే కాక, తన చిత్రాలే ఒకటి మరోటి మధ్య వైవిధ్యం ఉండాలని తపిస్తాడు. అలా తపించినవాడే ఉత్తమ చిత్రకారుడు. కాలానికి నిలబడగలిగినవాడు కాగలడు. అందుకే ప్రతీ చిత్రకారుడు వైవిధ్య భరితంగా ఆలోచించగలుగుతాడు.
విన్సెంట్ వాంగో వేసిన “సన్ ఫ్లవర్స్” చిత్రం నేటికి ఉత్తమ చిత్రంగా చెప్పబడడానికి కారణం అతను చూసిన, కాన్వాస్ పై సాధించిన అతని నైపుణ్యం. మారెల్, కెసల్, హుసన్, కోస్టర్, మానెట్, రినోయర్, పిస్సారో, సిజానె, మటిస్సీ, రోడిన్, గాగిన్, రూసో, పియరీ బెనార్డ్ ఇలా ఎందరో పుష్ప రచనలు చేసిన అజరామరం చేశారు.
నందలాల్ బోస్ గీసిన గోవుచిత్రాలు, టాగోర్ చిత్రాలు గానీ, ఎందరో భారతీయ చిత్రకారుల వారి చిత్రకళా వైవిధ్యం చిత్రరూపాలుగా దర్శనమిస్తుంది. ఆంధ్ర చిత్రకారులలో కూడా కొండపల్లి శేషగిరిరావుగారి చిత్రాలలో గానీ, రాజయ్యగారి చిత్రాలలో గానీ, జంతు, వృక్ష వైవిధ్యం కనబడుతుంది. ప్రతి ఒక్క చిత్రకారుడు చిత్రకళలో తనదైన శైలిలో రూపంలో వైవిధ్యం సాధించడానికి తపిస్తుంటాడు. వైకుంఠంగారి లక్ష్మా గౌడ్, లక్ష్మణ్ చిత్రాలలోని మనుష్యులలోని వైవిధ్యం కనబడుతుంది. గిరిధర్ గౌడ్ గారి “వృషభం” సిరీస్ లో ఎన్నో వేసిన ఒంగోలు గిత్తలు మనకు వైవిధ్యాన్ని చూపుతాయి.
చిత్రకారుని దృష్టి వైవిద్యంతో ఉంటుంది. అందువల్లనే చిత్రరచన కూడా వైవిధ్య భరితంగానే ఉంటుంది.
–ఎల్.ఆర్. వెంకటరమణ
చాలా మంచి రచన చిత్రకారులపై…చిత్ర కళ పై….
అభినందనలు….రమణ గారూ….
మీరు మరిన్ని మంచి రచనలు చేసి…కళా ప్రేమికుల మనసును రంజింప చేస్తారని ఆసిస్తూ…..
……… శ్రీనివాస్ బీర.
Nice Article LRV garu..Congratulations