విజయవాడ S R R & C R కళాశాల ప్రాంగణ మంతా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సాహితీ వ్యక్తిత్వ స్మరణ తో పులకించింది. తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కృతులు, పద్మవిభూషణులు, కల్పవృక్ష ప్రతిష్ఠాతలు, మాన్యులు కవిసమ్రాట్టులు విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతిని విశిష్ట రీతిలో అంగరంగవైభవంగా విశ్వనాథ ఫౌండేషన్ , ఎస్. ఆర్. ఆర్ & సి. ఆర్. కళాళాల యాజమాన్యం వారి సంయుక్త అధ్వర్యంలో విశ్వనాథ జయంతిని నిర్వహించారు.
అంతటి మహత్తర కార్యక్రమంలో స్మారకోపన్యాసం చేయటానికి మిత్రులు విశ్వనాథ సత్యనారాయణ గారు నాకు అవకాశం కల్పించారు. విశ్వనాథ వారి విశిష్ట వ్యక్తిత్వాన్ని గురించి, విద్య విద్యార్థుల విషయంలో వారికున్న ఖచ్చితమైన అభిప్రాయాలు, వారి రచనలల్లో కనిపించే జాతీయ విద్యావిధానంపై ప్రీతి , మొదలైన అంశాల పై దాదాపు 20 నిముషాలు ప్రసంగించి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని వారికి నివాళులర్పించాను.
ఈ కార్యక్రమం లో ప్రముఖ శతావధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు రూపొందించి ప్రదర్శించిన “ విశ్వనాథ విజయం “ సాహిత్య రూపకం అందరినీ విశేషంగా అలరించింది. ఇందులో కళాశాల ప్రధానాచార్యులు శ్రీ వెలగా జోషి గారు శ్రీ రాజా రంగయ్యప్పారావుగా, చెళ్ళపిళ్ళ గా శ్రీ పాలపర్తివారు, విశ్వనాథగా వారి పౌత్రుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, కాటూరి గా డా. పింగళి వెంకటకృష్ణారావుగారు, కొడాలి ఆంజనేయులుగా శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు, బెజవాడ గోపాలరెడ్డి గా డా.గుమ్మా సాంబశివరావు గారు, కరుణశ్రీ గా డా.జంధ్యాల మహతీ శంకర్ గారు , శ్రీశ్రీ గా శ్రీ సశ్రీ గారు, కుందుర్తిగా డా. కప్పగంతు రామకృష్ణ గార్లు అభినయించి ఆయాకవులకూ, విశ్వాథవారికీ ఉన్న అనుబంధంతో బాటు, వారి కవిత్వం గురించిన పలు విశేషాంశాలను సోపపత్తికంగా ప్రసావిస్తూ అభినందించారు.
కార్యక్రమ ప్రయోక్త డా.పాలపర్తి వారు కడుసమర్థత తో విషయాలను సమన్వయ పరుస్తూ స్పష్టమైన రీతి లో విశ్వనాథవారి నిలువెత్తు సాహితీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించి వారి ప్రతిభకు దర్పణంపట్టారు.
చివరగా విశ్వానాథ పాత్రధారి విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ మార్గాన్ని, తన భాషా వ్యవహారాన్ని ఘనంగా చెప్పి పెద్దలందరికీ ప్రణతులర్పించారు.
ఈ సందర్భగా కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీలలోని విజేతలకు విశ్వనాథ ఫౌండేషన్ వారు బహుమతులందించారు.
అపురూపమైన ఈకార్యక్రమం లో కళాశాలఅధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థుల తో బాటు పురప్రముఖులు, విశ్వనావారి మనుమలు శ్రీ శక్తిధర్, శ్రీ పాణిని మొదలైన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.