సాహితీ విరాణ్మూర్తి విశ్వనాథ సత్యనారాయణ

అమ్మభాష ఆధ్వర్యంలో ‘కవిసమ్రాట్’ విశ్వనాథ 125వ జయంతి వేడుకలు

తరతరాల పాటు తెలుగుజాతి సగర్వంగా చెప్పుకునేంతటి ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించి, తెలుగుజాతికి మహూపకారం చేసిన కవి విశ్వనాథ సత్యనారాయణ అని పలువురు వక్తలు కొనియాడారు. ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ 125వ జయంతి వేడుకలు ‘అమ్మభాష’ భాషాభిమానుల వేదిక ఆధ్వర్యాన గురువారం గాంధీనగర్, లెనిన్ సెంటర్ లోని విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ మాట్లాడుతూ లక్ష పేజీల లిఖిత సాహిత్యాన్ని సృష్టించిన ఘనత మనదేశంలో కేవలం విశ్వనాథకు మాత్రమే దక్కుతుందన్నారు. సమాజంలో ధర్మాన్ని పున:ప్రతిష్ఠించాలనే సంకల్పంతోనే విశ్వనాథ రచనలు సాగాయన్నారు. గత వెయ్యి సంవత్సరాల్లో విశ్వనాథ వంటి కవి లేడని, భవిష్యత్తులోనూ పుట్టే అవకాశం లేదన్నారు. ప్రసిద్ధ పత్రికా రచయిత తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ విజయవాడ అంటేనే విశ్వనాథ గుర్తుకు వస్తారన్నారు. తెలుగువారికి తొలిసారిగా జ్ఞానపీఠ పురస్కారాన్ని తీసుకువచ్చిన ఘనత విశ్వనాథకు దక్కుతుందన్నారు. మాజీ శాసనసభ్యులు కె.సుబ్బరాజు మాట్లాడుతూ విశ్వనాథ స్మారక చిహ్నాలను భద్రపరచటం, తగిన గౌరవం తీసుకువచ్చేలా విశ్వనాథ జ్ఞాపకాలను పదిలపరచటంలో అన్ని ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయన్నారు. విశ్వనాథ విషయంలో అన్ని ప్రభుత్వాలు తీవ్రమైన ఉదాసీనతతో వ్యవహరిస్తూ తెలుగుజాతి మహనీయుడిని అగౌరవపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమ్మభాష’ సంస్థ ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు స్వాగత వచనాలు పలికారు. ఉపాధ్యక్షులు గూటాల రామకుమార్ విశ్వనాథ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. సంస్థ కార్యదర్శి ఆదుర్తి సుహాసిని, తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు, ఎస్.ఆర్.ఆర్. కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ కె.బాలకృష తదితరులు పాల్గొన్నారు.

SA:

View Comments (1)

  • చక్కటి కార్యక్రమం చేసిన
    అమ్మభాష కు
    అభినందనలు