రేడియో సిలోన్ కు 70 ఏళ్ళు

‘రేడియో సిలోన్’ అంటే మా పాత తరం వాళ్ళకు అభిమాన ప్రసార చానల్. ఆసియా ఖండంలో రేడియో కార్యక్రమాలను ప్రసారం చేసిన తొలి రేడియో స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ. అంతేకాదు BBC తరవాత ప్రపంచంలో రేడియో ప్రసారాలు చేస్తున్న అత్యంత ప్రాచీన రేడియో స్టేషన్ కూడా ఇదే. 1925లో ‘కొలంబో రేడియో’ పేరుతో మీడియం వేవ్ మీద వెలికాడ స్థావరం నుండి తొలిసారి ప్రసారాలను ప్రారంభించింది. అప్పటికి BBC ప్రసారాలు ప్రారంభమై కేవలం మూడేళ్లు మాత్రమే. 1949లో శ్రీలంక ప్రభుత్వం రేడియో సేవలకోసం ఒక ప్రత్యేక విభాగానికి శ్రీకారం చుట్టింది. 1967 లో అది ఒక స్వతంత్ర సంస్థగా రూపురేఖలను మార్చుకుంది. ఇప్పుడు ఈ సంస్థను ‘శ్రీలంక బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్’ (SLBC) గా వ్యవహరిస్తున్నారు. 1990 వరకు మీడియమ్ వేవ్ ద్వారా ప్రసారాలు రిలే అవుతూ వచ్చాయి. తరవాత FM బ్యాండ్ ద్వారా ప్రసారాలను అత్యంత శక్తివంతమైన స్టీరియో సాంకేతికతతో రిలే చేయడం మొదలెట్టారు.

1950లో తొలిసారి రేడియో సిలోన్ ద్వారా హిందీ ప్రసారాలను రిలే చేయడం మొదలైంది. దాంతో భారత్ నుంచి వాణిజ్య ప్రకటనల ద్వారా ఈ రేడియో సంస్థకు ఆదాయం పెరిగింది. సినిమాలలోకి రాకముందు ప్రముఖ హిందీ నటుడు సునీల్ దత్ కూడా రేడియో సిలోన్ లో ప్రకటనకర్తగా పనిచేశారు. రేడియో సిలోన్ అంటే శ్రోతలకు ముందుగా గుర్తుకొచ్చే పేరు అమీన్ సాయాని, మీనాక్షి పొన్నుదొరై. 1952 నుండి అమీన్ ప్రసారం చేసే ‘బినాకా గీత్ మాలా’ కార్యక్రమం శ్రోతలను కట్టిపడేసేది. హిందీ సినిమాలలోని పాటలను ప్రతి బుధవారం అమీన్ సాయాని తన అద్భుత కామెంటరీతో ప్రసారం చేస్తుంటే ఇంట్లో రేడియో లేనివాళ్లు ఆ సమయానికి హోటళ్లవద్ద, టీ షాపులవద్ద పెద్ద సంఖ్యలో జమకూడేవారు. మహమ్మద్ రఫీ, ముఖేష్, కిశోర్ కుమార్, కె.ఎల్. సైగల్, లతా మంగేష్కర్, ఆశా భోస్లే పాడిన పాటలు బినాకా గీత్ మాలా కార్యక్రమంలో ప్రసారమయ్యేవి. రేడియో సిలోన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఆల్ ఇండియా రేడియో (AIR) బాలీవుడ్ సంగీతం నిషేధించింది. వాణిజ్య ప్రకటనలకోసం జింగిల్స్ ను రేడియో సిలోన్ రూపొందించి ఆసియా ఖండంలోని అన్నీ రేడియో స్టేషన్లకు అందజేసింది. వాటిలో లక్స్ సబ్బులు, కోకా కోలా పానీయం కు సంబంధించిన ప్రకటనలు అధికంగా వుండేవి. ఇక తెలుగు ప్రసారాలను మీనాక్షి పొన్నుదొరై ప్రసారం చేసేవారు.

-ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap