వివాదం రగిలించిన ‘ఏరువాక సాగారో’ పాట

(ఈరోజు 03-02-2022 వహీదా రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా)

అద్భుత విజయాన్ని సాధించిన నేషనల్ ఆర్ట్ థియేటర్ వారి ‘జయసింహ’ (1955) చిత్రంలో వహీదా రెహమాన్ అనే నూతన నటి హీరోయిన్ పాత్రను పోషించింది. అప్పుడే సారథి ఫిలిమ్స్ సంస్థ నిర్మాత సి.వి. రామకృష్ణ ప్రసాద్ పెత్తందార్ల వ్యవస్థను నిరసిస్తూ, భూస్వాములకు-రైతాంగానికి మధ్య జరిగే ఘర్షణ సోషలిస్టు సమాజ స్థాపనకు దోహదం చేస్తుందనే నేపథ్యంలో ‘రోజులు మారాయి’ చిత్రనిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ విప్లవాత్మ చిత్రం ఏప్రిల్ 14 న 1955 న విడుదలై 17 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని అఖండ విజయాన్ని సాధించింది. తరవాత 1956లో ఇదే సినిమాను తమిళంలో ‘కాలం మారిపోచ్చు’ పేరుతో పునర్నిర్మించగా తమిళనాడులోనే కాకుండా కేరళ రాష్ట్రంలో కూడా ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. ‘రోజులు మారాయి’ సినిమా దాదాపు పూర్తి కావస్తున్న దశలో, పల్లెటూరి వాతావరణాన్ని, జీవనశైలిని చాటిచెప్పే పాటను డ్యాన్సుగా చిత్రీకరిస్తే బావుంటుందని దర్శకుడు తాపీ చాణక్యకు అనిపించి, నిర్మాత దృష్టికి తీసుకెళితే, రామకృష్ణ ప్రసాద్ వెంటనే స్పందించి కొసరాజు రాఘవయ్య చౌదరిని పిలిపించి పాటను జొప్పించే సన్నివేశాన్ని గురించి ఆలోచించమని కోరారు. జేష్ఠ మాసంలో వచ్చే తొలకరి జల్లుల ఆగమనంతో అన్నదాతలు పౌర్ణమి నాడు అరకలతో దుక్కిదున్ని పొలంపనులు మొదలు పెట్టడం మనకు సంప్రదాయంగా వస్తున్నదే! ఆ సందర్భంగా పాటపెడదామని కొసరాజు ‘’ఏరువాక సాగారోరన్నో చిన్నన్న…నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న” అనే గొప్పపాటను రాశారు. ఆ పాట సూపర్ హిగా నిలిచిన విషయం అందరికీ తెలిసిన విషయమే! ‘రోజులు మారాయి’ తోబాటు తమిళ వర్షన్ ‘కాలం మారిపోచ్చు’ కు కూడా సంగీత దర్శకుడుగా మాస్టర్ వేణు వ్యవహరించారు. అసలు ఈ పాటను కొసరాజు రాఘవయ్య చౌదరి త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో నిర్మించనెంచిన ‘పాలేరు’ అనే సినిమా కోసం రాశారు. అప్పుడే ఈ పాటను మాస్టర్ వేణు ‘పాలేరు’ చిత్రం కోసం రికార్డు కూడా చేశారు. కమలా లక్ష్మణ్ చేత ఆ పాటను చిత్రీకరించాలని ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ అనివార్య కారణాలవలన ఆ సినిమా ఆగిపోయింది. మాస్టర్ వేణు స్వరపరచిన ఈ కొసరాజు పాటనే ‘రోజులు మారాయి’ చిత్రంలో వాడుకున్నారు. వాహినీ సంస్థలో నాట్యాచార్యుడుగా పనిచేస్తున్న వేదాంతం జగన్నాథశర్మ సూచన మేరకు ‘జయసింహ’ చిత్రంలో నటించిన వహీదా రెహమాన్ చేత ఆపాటకు నృత్య దర్శకుడు వెంపటి పెద సత్యం నాట్యం చేయించారు. ఈ పాటలో వాడిన కనకతప్పెటలను వాయించే వాద్యగాళ్ళను గుంటూరు జిల్లా కొలకలూరు నుంచి పిలిపించి, మాస్టర్ వేణు వారికి శిక్షణ ఇచ్చి పాటను జిక్కి చేత పాడించి మరలా రికార్డు చేసి చిత్రీకరణ జరిపించారు. పాట యెంత పాపులర్ అయిందంటే, ప్రేక్షకులు ఈ పాటకోసమే సినిమా హాళ్ళకు వెళ్ళేవారు. తెర మీద ఈ పాట వచ్చినప్పుడు చిల్లర డబ్బులు కూడా విసిరేవారు.

అసలు ఈ ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా’ పాట యెంత సూపర్ హిట్టయిందో అంత వివాదాస్పదం కూడా అయింది. ఆరోజుల్లో జానపదులు ‘అయ్యో కొయ్యోడా’ అనే గీతాన్ని పల్లెటూర్లలో వినిపిస్తూ వుండేవారు. దానిని ఆనాటి రంగస్థల గాయకుడు, రచయిత అయిన వల్లూరి జగన్నాధరావు జనావళి లోకి తీసుకొచ్చారు. 1950లో వచ్చిన ఘంటసాల బలరామయ్య చిత్రం ‘శ్రీలక్షమ్మ కథ’ లో ‘అయ్యో కొయ్యోడా’ అనే మాటను అనుకరిస్తూ ‘’అయ్యో! పిల్లోడా!! మా అయ్యొస్తే మరి తంటారో చీటికి మాటికి చిట్టెమ్మంటావ్’’ అనే పాటను సృష్టించారు. కస్తూరి శివరావు, జిక్కి ఆలపించగా సి.ఆర్. సుబ్బురామన్ ట్యూన్ చేసిన ఈ పాట బాణీ వేరు. మాస్టర్ వేణు మాత్రం ‘అయ్యో కొయ్యోడా’ పాట స్పూర్తితోనే ‘ఎరువాక సాగారో రన్నో చిన్నన్నా’ పాటకు ప్రాణం పోశారు. ‘రోజులు మారాయి’ చిత్ర విజయంతో సారథి పిక్చర్స్ సంస్థ ఇదే సినిమాను తమిళంలో ‘కాలం మారిపోచ్చు’ పేరుతో పునర్నిర్మించి మే 4, 1956 న విడుదల చేయగా ఆ చిత్రం అటు తమిళనాటే కాకుండా కేరళ రాష్ట్రంలో కూడా డంకా బజాయించి శతదినోత్సవం జరుపుకుంది. ‘కాలం మారిపోచ్చు’ చిత్రానికి కూడా మాస్టర్ వేణే సంగీతం సమకూర్చారు. ముఖ్యంగా ‘ఏరువాక సాగారో’ పాటను ‘‘కళ్ళం కబడమ్ తెరియాదవనే, ఉళగం పోవదు పురియాదవనే’ గా మాస్టర్ వేణు స్వరపరచగా అది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ పాట వివాదం ఇక్కడే మొదలైంది..

Eruvaka sararo song

కృష్ణా పిక్చర్స్ నిర్మాత లేనా చెట్టియార్ యోగానంద్ దర్శకత్వంలో ‘మదురై వీరన్’ అనే సినిమా నిర్మించారు. ఎం.జి. రామచంద్రన్, భానుమతి, పద్మిని నటించిన ఈ చిత్రానికి జి. రామనాథన్ సంగీత దర్శకుడు. రామనాథన్ ‘రోజులుమారాయి’ సినిమాలో మాస్టర్ వేణు హిట్ చేసిన ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్న’ పాట స్వరాలను యధాతధంగా అనుకరిస్తూ ‘సుమ్మయ్ ఇరుందా సొత్తుక్కు నష్టం సోంబల్ వళందా యేర్పడు కష్టం’ అనే పాటకు రూపమిచ్చారు. ఉడుమలై నారాయణ కవి రాసిన ఈ పాటను పి. లీల, జిక్కి ఆలపించగా సినిమాలో పద్మిని, రాగిణి ల మీద చిత్రీకరించారు. తెలుగు పాటను ఆధారం చేసుకొని సాహిత్యం కూడా ఒకటేగా వుండేలా రాసిన ఈపాట అచ్చుగుద్దినట్టు ‘ఏరువాక సాగారో’ పాటను పోలివుండడం వివాదాస్పదమైంది. తమిళంలో ‘రోజులు మారాయి’ సినిమాని ‘కాలం మారిపోచ్చు’ గా సారథి పిక్చర్స్ సంస్థ నిర్మించినప్పుడు, ఆ చిత్ర పంపిణీ హక్కులు ఏ.వి.ఎం సంస్థ అధిపతి మెయ్యప్ప చెట్టియార్ తీసుకున్నారు. అందులో మాస్టర్ వేణు ‘ఏరువాక సాగారో’ పాటను ‘’కళ్ళం కబడమ్ తెరియాదవనే, ఉళగం పోవదు పురియాదవనే … యేరు పూట్టి పోవాయే అన్నే సిన్నన్నే, ఉన్ తుంబమెల్లా తీరుంమే అన్నే సిన్నన్నే’’ అనే సాహిత్యంతో మహావాయి రాజమాణిక్యం రాసిన పాటను జిక్కి పాడగా వహీదా రెహమాన్ మీద చిత్రీకరించారు. లేనా చెట్టియార్ నిర్మించిన ‘మదురై వీరన్’ సినిమా 13 ఏప్రిల్ 1956 న తమిళనాడులో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఆరోజుల్లో గ్రామఫోన్ రికార్డుల ముద్రణ కలకత్తా లోని డమ్ డమ్ కర్మాగారంలో జరిగేది. సినిమా విడుదలకు రెండు మూడు నెలలకు ముందే ఈ రికార్డులు ముద్రితమై మార్కెట్ లోకి విడుదలచేసేవారు. అలా జి. రామనాథన్ అనుకరించిన పాట కూడా మార్కెట్ లో విడుదలైంది. ఏ.వి.ఏం అధిపతి మెయ్యప్పన్ చెట్టియార్ పంపిణీకి తీసుకున్న ‘కాలం మారిపోచ్చు’ సినిమా విడుదల మూడు వారాల తరవాత… అంటే 4 మే, 1956 న విడుదలైంది. ఇందులో జెమిని గణేశన్, అంజలీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. ‘మదురై వీరన్’ చిత్రంలో అనుకరణకు గురైన ‘ఏరువాక సాగారో’ పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. పైగా ఈ పాటను పద్మిని, రాగిణి ల మీద చిత్రీకరించడం, సినిమాలో హీరో హీరోయిన్లు గా ఎం.జి.ఆర్, భానుమతి వుండడం నిర్మాత లెనా చెట్టియార్ కి కలిసివచ్చింది. అంతేకాదు తమిళ ప్రేక్షకులు ‘మదురై వీరన్’ సినిమాలోని పాటను ‘కాలం మారిపోచ్చు’ లో కాపీ చేశారని భ్రమ పడ్డారు. ఇది మెయ్యప్ప చెట్టియార్ కు కోపం తెప్పించింది. ‘కాలం మారిపోచ్చు’ సినిమాకు కూడా మంచి స్పందనే లభించినా, మంచి హిట్ సాంగ్ ని సంగీత దర్శకుడు రామనాథన్ కాపీ చేసి లబ్ది పొందడం రుచించని మెయ్యప్ప చెట్టియార్ ‘ఏరువాక’ పాటను కాపీ చేసినందుకు, దాని ప్రభావం ‘కాలం మారిపోచ్చు’ విజయం మీద పడిందని, దానివలన పరువు నష్టం జరిగిందని లెనా చెట్టియార్ మీద కోర్టులో దావా వేశారు. దానికి ముందే పత్రికలలో ‘డూప్లికేట్లను చూసి మోసవద్దు’ అంటూ ప్రకటనలు కూడా గుప్పించారు. ఈ కేసు వాదించేందుకు లెనా చెట్టియార్ అప్పట్లో మంచి పేరున్న వి.ఎల్. ఎతిరాజ్ అనే న్యాయవాదిని నియమించి కోర్టులో వాదనలు వినిపించారు. వాద ప్రతివాదనలు విన్న తరవాత న్యాయమూర్తి తీర్పును ప్రకటిస్తూ ‘’జానపద సంగీతం మీద ఎవరికీ యాజమాన్య హక్కులు వుండవు’’ అని కేసును కొట్టివేశారు. అయితే ‘మదురై వీరన్’ తోబాటు ‘కాలం మారిపోచ్చు’ సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శింపబడి శతదినోత్సవాలు చేసుకుంది. ‘మదురై వీరన్’ సినిమా 36 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకోవడమే కాకుండా ‘చంద్రలేఖ’ సినిమా వసూళ్లను అధిగమించి రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రాన్ని 15 డిసెంబర్ 1956 న ‘సాహసవీరుడు’ పేరుతో కృష్ణా పిక్చర్స్ వారు తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. ‘ఏరువాక సాగారో‘ తమిళ కాపీపాటను ఇందులో ‘సోమరులైతే తిండికి నష్టం, ఏమరుపాటున యేర్పడు నష్టం… మాటమీద నిలవాలి తానా తందాన, మామా, మనిషిలాగా బతకాలి తాన తందాన’ గా శ్రీశ్రీ రాయగా సుశీల, జిక్కిల చేత పాడించారు.

మాస్టర్ వేణు సృష్టించిన ‘ఏరువాక సాగారో’ పాట యెంతటి సంచనాన్ని సృష్టించిందో ఇంకా చెప్పాలంటే 1960లో ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు సచిన్ దేవ్ బర్మన్, చిత్రగుప్త లకు ఈ పాట ట్యూన్ యెంతగానో నచ్చింది. దర్శకనిర్మాత రాజ్ ఖోస్లా దేవానంద్, సుచిత్రాసేన్ లను హీరో, హీరోయిన్ గా 1960లో ‘బొంబై కా బాబు’ చిత్రం నిర్మించారు. అందులో మజ్రూహ్ సుల్తాన్ పురి చేత ‘ఏరువాక సాగారో’ ట్యూనుతో ‘’దేఖనే మే బోలా హై దిల్ కా సలోనా, బొంబై సే ఆయా హై బాబూ చిన్నన్న’’ అనే పాటను రాయించి, లతామంగేష్కర్ పాడగా సచిన్ దేవ్ బర్మన్ సూపర్ హిట్ చేశారు. అదే సంవత్సరం రాజేంద్రకుమార్, మాలాసిన్హా నటించిన మరొక విజయవంతమైన హిందీ చిత్రం ‘పతంగ్’ (తెలుగులో వాహినీ వారి పెద్దమనుషులు సినిమాకు రీమేక్)లో సంగీత దర్శకుడు చిత్రగుప్త ‘ఏరువాక సాగారో’ ట్యూనును అనుకరిస్తూ ఒక హిట్ సాంగ్ ను రూపొందించారు. రాజేంద్ర క్రిషన్ రాయగా లతాజీ ఆలపించిన ‘రంగ్ దిల్ కి ధడ్కన్ భీ లాటీ తో హోగీ, యాద్ మేరీ ఉన్కో భీ ఆతీ తో హోగీ’ అనే ఆ పాట ‘ఏరువాక సాగారో’ పాటకు అనుకరణే! ‘ఏరువాక సాగారో’ అంతటి గొప్ప పాటను అందించిన ‘రోజులు మారాయి’ సినిమా హైదరాబాదు నగరంలోని రాజేశ్వర్ థియేటర్ లో శతదినోత్సవ వేడుక చేసుకున్న మొదటి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. మాస్టర్ వేణుకు పద్మశ్రీ పురస్కారం లభించినత ఆదరణ దక్కింది.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap