చతుష్షష్టి కళలు (64 కళలు) ఏమిటి ?

మన పత్రిక పేరు 64కళలు కదా! అందుకే అందరూ 64కళలంటే ఏమిటో తెలియజేయండి అంటూ మెయిల్ చేస్తున్నారు. కళల్ని మన భారతీయులు 64కళలుగా విభజించారు. అవి ఎప్పుడో పురాతన కాలంలో నిర్ణయించారు కాబట్టి అవి కాలానుగుణంగా మారుతూ వుంటాయి.

కళ అనే శబ్దం యొక్క అర్థాలు, నిర్వచనాలు, ప్రాచీన మధ్య యుగాలలో ఒక విధంగాను, ఆధునిక కాలంలో మరొక విధంగాను వ్యాఖ్యానించటం జరుగుతుంది. ఆధ్యాత్మిక విద్యలలో దైవిక సంబంధమైన అంశాలలో ‘కళ’ శబ్దాన్ని ప్రయోగిస్తున్నట్లుగా వేద పురాణ ఆగమ గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. మానవ జీవితానికి ఉపయెక్తమైన విషయాలలో నైపుణ్యము, పాకృతిక భావనలు సంగమించిన సందర్భంగా కళ శబ్దం విస్తృతంగా ప్రయోగించినట్లుగా అర్థం అవుతుంది. ఇక నేటి కాలంలో ప్రజోపయోగమైన అంశాన్ని కళగా భావిస్తున్నారు. ఒక మహా చైతన్యం నుంచి ఏకాంశ విభాగితమై స్వయం ప్రకాశమై ఉన్నప్పుడు అది కళగా సంభవించబడుతుంది. ఒక నిర్జీవమైన వస్తుతత్వం నుంచి, ఒక అచేతన నుంచి, భావన నుంచి జీవం లేదా జీవ లక్షణ వ్యవస్థీపూరితమైన బాహ్య స్వరూపాన్ని పొందినప్పుడు లేదా దార్శినిక దృష్టితో ఒక వైలక్షిణమైన అంశం కనబడినప్పుడు దానిని కళ అంటారు. నిత్యనవీనమై చైత్యదాయకమైన ప్రాకృతిక మూల శక్తి మానవ భావ నార్భావ అంశంలో మేళవించిన రూపానికి, భావానికి ప్రతీకగా ఏదైతే నిలుస్తుందో దానిని కళగా అభివ్యక్తీకరిస్తున్నాము. మనం చెప్పుకునే 64 కళలూ మానవ జీవ పరిణామ దశలో ఒక భావం. ప్రవాహశీలత కలిగిన మానవ జీవితంలో కొత్త కళలు రావచ్చును. పాత కళలు ఉనికిని కోల్పోవచ్చును.

అయినా కళ నిత్యం జీవం కోసం, ఆనందం కోసం ఏర్పడిన వృత్తులలో నైపుణ్యం ప్రసారమానమైనప్పుడు అది కళగా రూపు దిద్దుకుంటుంది. మానవ జీవనంలో అధిక భాగం కళా స్పర్శ ఉంటుందన్న విషయం గమనించాలి. ఈ కళల వెనుక ఆర్థిక కోణం, మానవ శ్రేయస్సు భౌగోళిక అంశాలు ఇమిడి ఉన్నాయి.

ఒక శాస్త్రం పుట్టుక వెనుక వందల సంవత్సరాల మానవ జీవనానుభవం ఉంటుంది. గత కాలాన్ని పరిశీలించి, వర్తమాన కాలాన్ని వివేచించి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శాస్త్రకారుడు శాస్త్రాన్ని బందిస్తాడు. అందులో సమకాలీన సమాజం ప్రతిఫలిస్తుంది.
లలిత కళలకు మానవుడు దగ్గరైనప్పుడు, అతని కాఠిన్య ఛాయలు ఏమైనా ఉంటే, అవి ఆవిరైపోయి, అతనిలోని మానవత్వం లాలిత్యాన్ని సంతరించుకొని, అపూర్వ చిత్రమనే చక్కటి సమాజానికి శోభను తెస్తుంది.

కళలు 64 గా భారతీయులు గణించారు. వీటిని చతుష్షష్టి కళలంటారు.
అవి వరుసగా:

  1. ఇతిహాసము
  2. ఆగమము
  3. కావ్యము
  4. అలంకారము
  5. నాటకము
  6. గాయకత్వము
  7. కవిత్వము
  8. కామశాస్త్రము
  9. దురోదరము
  10. దేశభాషా లిపిజ్జానము
  11. లిపికర్మము
  12. వాచకము
  13. అవధానము
  14. స్వరశాస్త్రము
  15. శకునము
  16. సాముద్రికము
  17. రత్నశాస్త్రము
  18. రథాశ్వ గజకౌశలము
  19. మల్లశాస్త్రము
  20. సూదకర్మము
  21. దోహదము
  22. గంధవాదము
  23. ధాతువాదము
  24. ఖనివాదము
  25. రసవాదము
  26. జలవాదము
  27. అగ్ని స్తంభనము
  28. ఖడ్గ స్తంభనము
  29. వాక్ స్తంభనము
  30. వాయు స్తంభనము
  31. వశ్యము
  32. ఆకర్షణము
  33. మోహనము
  34. విద్వేషణము
  35. ఉచ్చాటనము
  36. మారణము
  37. కాలవంచనము
  38. పరకాయ ప్రవేశము
  39. పాదుకాసిద్ధి
  40. వాక్సుద్ధి
  41. ఇంద్రజాలికము
  42. ఆంజనము
  43. దృష్టి వంచనము
  44. స్వర వంచనము
  45. మణి సిద్ది
  46. చోరకర్మం
  47. చిత్ర క్రియ
  48. లోహ క్రియ
  49. అశ్న క్రియ
  50. మృత్రియ
  51. దారుక్రియ (వడ్రంగం)
  52. వేణు క్రియ
  53. చర్మ క్రియ
  54. అంబర క్రియ
  55. అదృశ్య కరణము
  56. దూతీ కరణము
  57. వాణిజ్యము
  58. పాశుపాల్యము
  59. కృషి
  60. ఆసవకర్మ
  61. ప్రాణి ద్యూత కౌశలము
  62. జలస్తంభనము
  63. మంత్రసిద్ధి
  64. ఔషధసిద్ధి

లలితకళలు:
చిత్రలేఖనము, శిల్పము, సంగీతము, నృత్యము, కవిత్వము(కావ్యం) ఈ ఐదింటిని లలితకళలు అంటారు. వీటినే ఆంగ్లంలో Fine Arts అంటారు.

SA: