లేపాక్షి కళకు సరికొత్త శోభ ‘గిరిధర్’ చిత్రాలు
  • ఈనెల 7 నుంచి 12 వ తేదీ వరకు న్యూఢిల్లీలో చిత్రకళా ప్రదర్శన
  • కళాకృతి ఆర్ట్ గేలరీ సమర్పణలో ‘విండోస్ టు ది గాడ్స్’ నిర్వహణ

విజయనగర చిత్రకళలో లేపాక్షి శైలి ప్రత్యేకమైంది. లేపాక్షి దేవాలయంగా పిలువబడే వీరభద్ర దేవాలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలనలో నిర్మించబడింది. పౌరాణిక ఇతిహాస కథలను తన వ్యక్తిగత దృష్టి, ఊహ మరియు సున్నితత్వంతో సమకాలీనంగా రూపొందించే విషయంలో గిరిధర గౌడ్ కు ప్రతిభావంతుడైన చిత్రకారుడిగా పేరుంది. అంతకుముందు ఆయన దశావతార సిరీస్ మరియు కృష్ణ లీల సిరీస్‌లను చిత్రించిన అనుభవముంది. కథనంలో ఇంద్రియ ఆనందాన్ని, ఇతిహాసాలలోని వివిధ కథలలో సూక్ష్మంగా అల్లుకుని కప్పబడిన స్వాభావిక తత్వాన్ని కనుగొనాలని కోరుకునే ఒక రకమైన నైపుణ్యం కలిగిన వ్యక్తి, కానీ అన్నింటికంటే మించి ఇతిహాస కథనాలలో, భారతదేశ చిత్ర సంప్రదాయం యొక్క దృశ్య సౌందర్యంలో మరియు లేపాక్షి, బాదామి, హంపి, తాడిపత్రి, శ్రీశైలం, కాళహస్తి, తిరుపతి, మరియు ముఖ్యంగా విజయనగరంలోని భిట్టి పెయింటింగ్స్ అని పిలువబడే చిత్రాలలో కనిపించే విభిన్న ప్రాంతీయ మరియు జానపద శైలులలో వ్యక్తమయ్యే సంప్రదాయం యొక్క సాంస్కృతిక మూలాలు గిరిధరుడిని ఆకర్షించి, ప్రేరేపించి, సూక్ష్మమైన అధునాతనత, వాస్తవికత మరియు సృజనాత్మకతతో గుర్తించబడిన చిత్ర రచన వైపు మళ్ళించాయి. అందులోని రేఖా విన్యాసం, వర్ణ సమ్మేళనం విశిష్టమైనవి. మరుగున పడిన నాటి చిత్రకళా శైలికి కొత్త మాధ్యమాల పోకడలను మేళవిస్తూ, నవ్య ధోరణలను జోడిస్తూ విస్తృతంగా చిత్రీకకరణ చేస్తున్నారు ప్రముఖ చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్. పురాణ గాథలు, పాత్రలతో లేపాక్షి శైలి చిత్రకళకు పునరుజ్జీవం కల్పిస్తున్నారు. దృక్పథంలోనూ, వ్యక్తీకరణలోనూ తనదైన ప్రత్యేకతతో జాతీయ, అంతర్జాతీయ చిత్రకళా వేదికలపై రాణిస్తున్నారు. తాజాగా ‘విండోస్ టు గాడ్స్ పేరుతో థర్డ్ ఎడిషన్ చిత్రాలను న్యూఢిల్లీలో ప్రదర్శించనున్నారు.

55 చిత్రాలతో న్యూఢిల్లీలో ప్రదర్శన:
న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆర్ట్ గ్యాలరీ ‘బికనీర్ ‘హౌస్’లో ఈనెల ఏడో తేదీ సాయంత్రం చిత్రకళా ప్రదర్శన ప్రారంభించి, 12వ తేదీ వరకు కొనసాగిస్తారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని సీసీఆర్టీ ఆరుదైన ‘ఆవార్డ్ ఆఫ్ ఫెలోషిప్’తో రెండేళ్లపాటు గిరిధర్ గౌడ్ అధ్యయనం చేసి, లేపాక్షి చిత్రశైలిలో రామాయణంలోని రెండు ముఖ్యపాత్రలైన రాముడు, హనుమంతుడిలోని వేర్వేరు అంశాలను ప్రతిబింబిస్తూ వేసిన వాటితో పాటు మరికొన్ని చిత్రాలను కలిపి మొత్తం 55 చిత్రాలను ఇందులో ప్రదర్శించనున్నారు.

హైదరాబాద్ లో ‘దశావతార’ ప్రదర్శన:
గతంలో గిరిధర్ గౌడ్ హైదరాబాద్ లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీ సహకారంతో అక్కడే ‘దశావతార’ పేరుతో ప్రదర్శన, అదే గ్యాలరీ సౌజన్యంతో న్యూఢిల్లీలో ‘కృష్ణలీల’ చిత్రకళా ప్రదర్శనను నిర్వహించారు. ప్రస్తుతం జరగనున్న ప్రదర్శనను థర్డ్ ఎడిషన్ గా ఆయన పేర్కొన్నారు. ఈసారి హైదరాబాద్ కు చెందిన చిత్రకళాకారుడు సచిన్ జల్తారేతో కలిసి ‘చిత్రకళా జుగల్బందీ’గా ‘విండోస్ టు ది గాడ్స్’ ప్రదర్శనను చేస్తుండటం విశేషం. వాల్మీకి రామాయణాన్ని గిరిధర్ అధ్యయనం చేశారు. రాముని వ్యక్తిత్వం, హనుమ భక్తితత్వం, రామునికి దాసునిగా, భక్తునిగా హనుమ తనకు తాను వ్యక్తపరచుకున్న తీరును చిత్రీకరించినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో శాస్త్రీయ పద్దతిలో కాన్వాసుపై అక్రలిక్ రంగులతో 15 చిత్రాలు, బాంబూ, వార్స్ లీ పేపరుపై తీర్చిదిద్దిన 40 మినియేచర్ చిత్రాలున్నాయి. చిత్రశైలిలో భాగంగా కొన్ని మినియేచర్స్ చిత్రాల్లో బంగారం రేకు పూతనూ వినియోగించడం మరో ప్రత్యేకతగా చెప్పారు.

గిరిధర గౌడ్ కళా ప్రస్థానం : రాయన గిరిధర గౌడ్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని గరువుపాలెం అనే చిన్న గ్రామానికి చెందిన కళాకారుడు. మైసూర్లో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ చేశారు. బరోడాలో మాష్టర్స్ చేశాక, అక్కడే సహాయ అధ్యాపకుడిగా కొంత కాలం పనిచేశారు. వృత్తి జీవితం బాగానే ఉన్నా, తనలోని కళాహృదయానికి సంతృప్తి కరువైంది. గిరిధర గౌడ్ తన మానసిక సంఘర్షణ గురించి చెప్తూ… “నా బాల్యం నుండి కథలు, కవితలు మరియు చారిత్రక ఇతిహాసాలపై నాకు అపారమైన ఆసక్తి ఉంది. నేను ఎల్లప్పుడూ ఈ ఇతిహాసాలను మతపరమైన, మూఢనమ్మక కథలుగా కాకుండా అమూల్యమైన ఇతిహాసాలు, జ్ఞాననిధి మరియు జీవిత సారాంశానికి ఉదాహరణలుగా భావిస్తాను” అంటారు. స్వస్థలానికి చేరుకుని అక్కడే చిత్రకళా సాధనకు అంకితమయ్యారు. మూడు దశాబ్దాలుగా చిత్రకళలో రకరకాల ప్రయోగాలు చేస్తూ, భావాలకు రంగుల దృశ్య రూపం కల్పిస్తున్నారు. పురాణ గాథలు, ఆధ్యాత్మిక భావాలతో స్ఫూర్తిని పొందిన గిరిధర్… పద్మశ్రీ జగదీష్ మిట్టల్ సూచనలు, ‘ట్రెడిషనల్ స్కూల్స్’ సమాచారం తీసుకుంటూ మినియేచర్ సహా విస్తృతమైన కాన్వాసుపై తన దైన పంథాలో చిత్రరచన చేస్తున్నారు. కొన్నేళ్లుగా లేపాక్షి చిత్రకళా శైలి పునరుజ్జీవానికి కృషి చేస్తున్నారు. వీటన్నిటి కలయికతో రూపొందించిన కళాకృతులు ఢిల్లీ సహా దేశంలోని ప్రముఖ నగరాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో ప్రదర్శనకు నోచుకున్నాయి. హైదరాబాద్ లో ఒకే ఏడాది మూడు వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శనలను నిర్వహించిన ఖ్యాతిని గిరిధర్ దక్కించుకున్నారు.

-కళాసాగర్

5 thoughts on “లేపాక్షి కళకు సరికొత్త శోభ ‘గిరిధర్’ చిత్రాలు

  1. Giridhar Goud Ji is a fantabulous painter of our times. He mastered to his own style and has a great plasticity in a definite way. He held many national and international exhibitions and is ardent to his day to day practice of painting and sketching. The article Highlights his greater achievements in his artistic career.

  2. గొప్ప చిత్రకారుడుడైన గిరిధర్ గౌడ్ గారి చిత్రకళ రీతిని చాలా చక్కగా ఆవిష్కరణ చేశారు.చిత్రకళా మిత్రులు గిరిధర్ గౌడ్ గారి కీ . వ్యాస రచయిత కళా సాగర్ గారికి అభినందనలు. ఢిల్లీ లో జరగనున్న ఈ షో విజయవంతం కావాలని కోరుకుంటున్నాను

  3. గ్రేట్ ఆర్టిస్ట్ శ్రీ గిరిధర్ గౌడ్ గారి గురించిన వ్యాసం చాలా చక్కగా ఉంది. వారు వారి చిత్రాలు ఎందరికో స్ఫూర్తిదాయకం…
    వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐🙏💐కళా సాగర్ గారు ధన్యవాదములు 💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *