మొదటి కార్టూన్ ‘హాస్యానందం ‘లో – సునీల

నా పేరు సునీల దీక్షిత్. పుట్టింది మంథని గ్రామం, కరీం నగర్ జిల్లా. అమ్మ సుమతి (తెలుగు టీచర్), నాన్న మురళి రాజకీయ సన్యాసం తీసుకుని ప్రస్తుతం సేవాసదన్ లో సెక్రెటరీ గా ఉన్నారు. ఒక అక్క అనిల (ఇంజనీర్ ), తమ్ముడు (మానేజర్) శ్రీవారు మహేష్ ( ప్రముఖ MNC లో జనరల్ మానేజర్) నా సంతానం, ఒక కూతురు ఒక కొడుకు. ఉస్మానియా యూనివర్సిటీ లో M.Sc.(appilied electrinics) చేశాను. ప్రస్తుతం ఒక అమ్మల బ్లాగింగ్ ప్లాట్ఫారంకు తెలుగు ఎడిటర్ గా ఢిల్లీలో పనిచేస్తున్నాను.

ప్రస్థానం: అమ్మ తెలుగు టీచర్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని కావడంతో తెలుగు సాహీతీ ప్రభావం నాపై చాలా ఉండేది. వ్యాసాలూ రాయడం, వక్తృత్వ పోటీల్లో పాల్గొనడం ఇవన్నీ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. బలపం గీత దగ్గర నుండి భగవద్గీత వరకూ అన్నిటికీ అమ్మే టీచర్. చిన్నప్పటి నుండీ బొమ్మరిల్లు, బాలమిత్ర, చందమామ పత్రికలే మా నేస్తాలు. ఆటపాటల్లో కూడా చాలా చురుకుగా పాల్గొనేదాన్ని. సైక్లింగ్, బాడ్మింటన్, చెస్, క్రికెట్ ఇలా అన్నీ ఆడేవాళ్ళం.
బాపు గారి బొమ్మలంటే బహు ప్రీతి. వపా గారి బొమ్మలను బాగా గమనిన్చేదాన్ని, అనుకరించేదాన్ని కూడా. వడ్డాది పాపయ్య గారు మేని ముసుగు ఎలా వేస్తారబ్బా అని పెద్ద సందేహం ఉండేది. వారి చిత్రాలతో కలలు కనేదాన్ని.ఈనాడులో వచ్చే శ్రీధర్ గారి కార్టూన్ చూడందే పేపర్ లోపలి పేజీ చదవక పోయేదాన్ని. ఇంట్లో కూడా నాన్నగారు రాజకీయ అంశాలపై చర్చిస్తూ ఎలక్షన్లను గమనిస్తూ ఉండడం వలన రాజకీయ కోణం బాగా అర్ధమయ్యి శ్రీధర్ గారి కార్టూన్లు 8వ తరగతి నుండి బాగా అర్థమయ్యేవి. ఆ తరువాత చదువులో నిమగ్నమయి కొంత బ్రేక్ ఇచ్చాను. డిగ్రీ చదువుతున్నప్పుడు హైదరాబాదు రెడ్డి హాస్టల్ లో ఉన్నపుడు అక్కినేని గారి దగ్గరనుండి 7 బహుమతులు గెల్చుకోవడం ఒక మధుర స్మృతి. పెళ్లి అయిన తరువాత మా అమ్మాయి కోసం బోల్డు బొమ్మలు వేశాను.ప్రతీ కాంపిటీషన్ లో మొదటి బహుమతి రావాల్సిందే అనేంతగా నేర్పించేదాన్ని. అమ్మాయి నేషనల్ లెవెల్ దాకా వెళ్ళింది. ఈ ఇంటర్ నెట్ పరిచయం కావడం నాకు వరంగా మారింది. ఇంటర్నెట్ను ఔపోసన పట్టే క్రమంలో ఎన్నో నేర్చుకున్నాను. కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నాను. కార్టూన్ ప్రస్థానాన్ని మళ్ళీ మొదలు పెట్టాను. ఫోటోషాప్ లో కొంత ప్రావీణ్యత సంపాదించాను.

Sunila cartoons

కార్టూన్లతో విజృంభించాను. హాస్యం, అమ్మ ద్వారా పూర్తిగా పుణికి పుచ్చుకున్నాను. గూగుల్ ఆప్స్ అన్నీ ఎలా వాడాలో తెలుసుకున్నాను. ఇలా నా తెలుగును టెక్నాలజీనీ మెరుగుపరుచుకున్నాను. అమ్మ తెలుగు టీచర్ కావడంతో చనుబాలతోనే తెలుగు నా రక్తంలో ప్రవేశించింది. సామాజిక మాధ్యమాలలో తెలుగు టైపు చేయడం నాకు వరంగా మారింది. అలా ఎంతో మంది పాఠకుల ప్రశంసలు అందుకున్నాను. పాఠకులకు దగ్గరయ్యాను కూడా. చదువులో కూడా చిన్నప్పటి నుండి తెలుగులో నేనే మొదటి స్థానంలో ఉండేదాన్ని. దానికి హాస్యం వ్యంగ్యం తోడై ఒక కార్టూనిస్టుగా, మహిళా కార్టూనిస్టుగా నాకు పేరు తెచ్చిపెట్టింది. ఇంకా నేర్చుకుంటున్నాను. ప్రముఖులతో పరిచయం (ఇంటర్నెట్ లోనే) నా మీద నాకు ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రామకృష్ణ పుక్కల్ల గారు నాకు చక్కగా ఎంతో ఓపికగా ఫోటోషాప్ కూడా నేర్పించడం అన్నీ సహాయపడ్డాయి. ప్రతీ కార్టూన్ లో మంచి హాస్యం ఉండేలా జాగ్రత్త పడతాను. అన్నీ నా మస్తిశ్క అవిష్కరణలే. బొమ్మలు వేసేప్పుడు రిఫరెన్స్ తీసుకుని వేస్తాను. యండమూరి గారి ‘లోయ నుండి శిఖరానికి’ పుస్తకంలో నా కార్టూన్ అచ్చవడం నాకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. డా.జయదేవ్ బాబు గారు ఒక తండ్రిలాగా నా ప్రతీ వంకర గీతను సవరించుకునేలా చాలా సార్లు ప్రోత్సహించారు. వరకట్న నిషేధంపై వంద కార్టూనిస్టుల సమరం లో నా కార్టూన్లు, నవ్య, మన తెలంగాణ, నమస్తే తెలంగాణ హస్యనందం లో నా కార్టూన్లు అచ్చయ్యాయి. జయదేవ్ గారి కార్టూన్లలో గీతోపదేశం, సరసి గారి కార్టూన్లలో హాస్య రస గిలిగింతలు, లేపాక్షి గారి చమత్కారం, రామకృష్ణ గారి కార్టూన్లలో హ్యాండ్ రైటింగ్, పుక్కల్ల గారి మేజిక్ వాండ్, బాచి గారి కాచి వడబోసిన కాప్షన్, వర్చస్వి గారి కుంచె, చక్రవర్తి గారి కార్టూన్లలో ఉన్న చక్కర కేళి, మృత్యుంజయ్ గారి రాజకీయ స్వైర విహారం, శ్రీధర్ గారి చమక్కులు అంటే ఎంతో ఇష్టం మిగతా మిత్రులందరి ప్రతీ కార్టూన్ ఎంజాయ్ చేస్తాను.

Sunila cartoons

ఫేసుబుక్లో ఒక్కో కార్టూన్ కి అభిమానులు నన్ను ఆదరించి ఇచ్చే చాలా లైక్స్, బోల్డు షేరింగ్స్ కామెంట్స్ రావడం కూడా నన్ను మరింత ఉత్సాహవంతురాలిని చేశాయి. పిల్లలు కాస్త పెద్దవాళ్ళైన తరువాత తల్లుల వేదికగా అంతర్జాలంలో ప్రాచుర్యం పొందిన మామ్స్ ప్రెస్సో వెబ్సైట్ సంపాదకురాలిగా ఉద్యోగం వచ్చింది. ఎన్నో హాస్య రచనలు, కవితలు, కథలు రాసాను. హాస్యానందం మాసపత్రిక నిర్వహించిన తలిశెట్టి రామారావు గారి స్మారక పోటీల్లో 2020లో నాకు మొదటి బహుమతి రావడం నా కార్టూన్ ప్రయాణానికి కలికి తురాయి. తెలంగాణ ప్రభుత్వం ద్వారా మహిళా కార్టూనిస్ట్ గా గుర్తింపు పొందడం ఒక మధురానుభూతి. ఐఐసీ, బెంగళూరులో కార్టూన్ ప్రదర్శనకు, ప్రపంచ తెలుగు మహాసభల్లో కార్టూన్ ప్రదర్శనకు సమన్వయకర్తగా వ్యవహరించి కార్టూనిస్టుగా కార్టూనిస్టుల కోసం సేవలందించగలిగాను. సాధించినది కొంచం సాధించాల్సింది కొండంత. ఈ ప్రయాణం ఇలాగే సాగాలనీ మీ అందరి అభిమానం కూడా తోడై మరిన్ని కార్టూన్లు గీయాలని ఉంది.
మీ సునీల

Sunila cartoon
Sunila cartoons

3 thoughts on “మొదటి కార్టూన్ ‘హాస్యానందం ‘లో – సునీల

  1. మహిళా తెలుగు కార్టూనిస్టు శ్రీమతి సునీల దీక్షిత్ (న్యూ ఢిల్లీ ) గారి పరిచయం అందించినందుకు అరువదినాలుగుకళలు.కామ్ వారికి ధన్యవాదాలు…సునీల గారికి అభినందనలు. సదాశివుని.లక్ష్మణరావు (లాల్ ) విశాఖపట్నం 19-3-2021

  2. బావుందండీ మీ ప్రయాణం. మీరు సమర్ధవంతంగా వరల్డ్ తెలుగు కార్టూనిస్టుల వాట్సాప్ గ్రూపుని నిర్వహిస్తున్నారు. బెంగుళూరులో కార్టూన్ ప్రదర్శనకు మీరందించిన సేవ అనితర సాధ్యం. విజయీభవ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap