నేటి మహిళ సమానత్వం …

మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం

సమానత్వం అనేది సహజంగా మనసులో కలగాల్సిన భావన. కాని ఆ భావనకు వ్యతిరేకంగా మహిళలను తక్కువచేయటం,అవకాశం దొరకగానే లైంగికంగా దోచుకోవటం జరుగుతోంది ఈ ప్రపంచంలో. ఇటువంటి అక్రమాలు నిలువరించాలని, మహ ళలకు సమానహక్కులు, సమానహోదా కుటుంబంలో, సమాజంలో, వృత్తిపరంగా, అవకాశపరంగా కావాలంటూ శతాబ్దానికి పైగా సాగిన పోరాటం ఫలించి అంతర్జాతీయ దినోత్సవం ఆవిర్భవించి 45 ఏళ్ళు గడిచింది.
సరిగ్గా ఆ మహిళా దినోత్సవ సమయంలోనే గత ఏడు ప్రపంచవ్యాప్తంగా ‘మీటూ’ ఉద్యమం మొదలైంది. సినీరంగంలో ప్రముఖులు తమను ఎలా వాడుకుంటున్నది చెప్పేందుకు తారలు గొంతు విప్పారు. సరిగ్గా ఈ ఏటి మహిళా దినోత్సవానికి కొంచెం ముందుగా ‘మీటూ’ తొలి ఆరోపణ ఎదు ర్కొన్న హాలీవుడ్ బడా నిర్మాత హార్వే వెయిన్ స్టన్ని న్యూయార్క్ న్యాయస్థానం దోషిగా తేల్చింది.
ఇది తాజా మహిళా ఉద్యమంలోని విజయం. ఇటువంటి ఆరోపణలు భారతదేశంలోనూ వినిపిం చాయి. కాని వాటి ప్రగతి ఎలా వుందో మనకు
తెలియదు. అన్ని రకాల అసమానతల గురించి చర్చించే దేశాలు, మానవ హక్కుల గురించి మాట్లాడే నేతలు ప్రపంచంలోని సగం జనాభాకి
ఆ హక్కులు లేవని తెలుసుకోరేమిటి! అని ప్రశ్ని -స్తోంది 2020 మహిళా దినోత్సవం.
ఈ సంవత్సరం మహిళా దినోత్సవ థీమ్ గా ‘ఈచ్ ఫర్ ఈక్వల్’ని ఎంచుకున్నారు. సమానత్వానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అందరూ బాధ్యత తీసుకోవాలి అనేది నినాదం. .
స్త్రీ, పురుషులిరువురూ ఒక్కటే, అంతా సమా నమేననే విషయాన్ని తెలియచెపేలా రెండు చేతు లను మడిచి ఒకటి ఛాతి భాగంలో, రెండవది నాభి భాగంలో వుంచుతూ చూపే ఫోటో ఈ ఏటి సమా నత్వం ప్రకటించే చిత్రంగా ఎంచుకున్నారు.
ఆడవారు అన్ని బాధ్యతలను నిర్వహించ గలరు. వారికి చేతకానిదేదీ లేదు. వారంతట వారు వద్దనుకునే మహిళలను తప్పించి, ముందడుగు వేస్తామనే మహిళలందరినీ ప్రోత్సహించాలన్నది మహిళా లోకపు డిమాండ్.
ఆ విషయంమీదే ఇటీవల భారతీయ నారీ మణులు సుప్రీమ్ కోర్టుకి వెళ్ళి కీలక విజయం సాధించారు. సైనికదళాలలోకి మహిళలను అనుమతించినా, వారికి సరిహద్దుల్లో బాధ్యతలు ఇవ్వటానికి, యుద్ధంలో నాయకత్వం వహించటానికి సైనిక వర్గాలు సిద్ధంగా లేవు. ఆ ఆంక్షమీద మహిళా సైనికాధికారులు కోర్టుకు వెళ్ళి విజయం సాధించారు.
సమాన హక్కులు లేని మహిళాలోకాన్ని సహించ లేమంటూ భారతీయ మహిళలు కోర్టును ఆశ్రయించి సాధించిన విజయాలు అనేకం వున్నాయి.
దేవాలయ ప్రవేశం విషయంలో ఐనా, ముమ్మారు తలాక్ విషయంలో అయినా, పిల్లలను దత్తత తీసు కునే అంశంలో, పిల్లల స్కూల్ రికార్డులో తల్లి పేరు కూడా వుండి తీరాలన్న అంశంలోనూ మహిళలు కోరుతున్న సమానత్వానికి భారతీయ న్యాయస్థానాలు మద్దతుగా నిలుస్తున్నాయి.
ఇటువంటి సమానత్వపు స్థానం మహిళలకు అన్ని దేశాలు, సంస్కృతులు ఇవ్వటంలేదు. నేటికీ మహిళలను రెండవ స్థానంలో నిలబెడుతున్న దేశాలున్నాయి. అది అధిగమించి ప్రపంచవ్యాప్త సామాజిక, ఆర్థిక, సాంస్కృతికి, రాజకీయ సమానత్వపు వేగాన్నిపెంచే పిలుపును ఇవ్వటం మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉద్దేశమైంది.
చాలా దేశాలలో నేడు మహిళలకు కీలక పదవులు లభిస్తున్నాయి. దాదాపుగా 20 దేశాలను నేడు మహి ళలు నడిపిస్తున్నారు. 20 ఏళ్ళుగా జర్మనీని నడిపి స్తున్న ఏంజెలా మెర్కల్ నేడు ప్రపంచ రాజనీతిజ్ఞులలో ఒకరిగా గుర్తింపుపొందారు. బంగ్లాదేశ్ ఆర్థిక ప్రగ తిలో ప్రధాని షేక్ హసీనాది దశాబ్దకాలపు పాత్ర.
వివిధ దేశాల పార్లమెంట్లో మహిళా ప్రాతినిధ్యం తగినంతగా పెరిగింది. అంతరిక్ష పరిశోధనా రంగంలోకి మహిళలు ఆలస్యంగా ప్రవేశిన్చినా రికార్డులు అతివేగంగా తిరగరాస్తున్నారు.
పురుషులు సాధించిన ప్రతి అంశాన్ని తాము చేయగలమంటూ అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపి ఇటీవలే తిరిగి భూమిమీదికి వచ్చింది క్రిష్టినా కోచ్ అనే వనిత. .
1995లో బీజింగ్ వేదికగా నాల్గవ ప్రపంచమహిళా సమావేశపు సమానత్వపు ప్రకటన తర్వాత, పుట్టిన తరం నేడు పాతికేళ్ళ నవతరం. తమని తాము ‘సమానత్వపు తరం’గా ప్రకటించుకుని, మహిళా సమానత్వం కోసం ఉద్యమించే ప్రతిజ్ఞచేస్తున్నారు.
నిర్ణయాధికారం ఐతే మహిళల చేతులలోకి రావటం లేదు. బహిరంగ ప్రదేశాలలోనే అవమానం ఎదుర్కొంటున్న మహిళ ఇంటి లోపల ఎటువంటి కష్టాలు పడుతున్నదో చెప్పలేమంటున్నారు.
మహిళా సాధికారత, సమానత్వం కోసం చట్టాలు చేస్తున్న విషయం నిజం. అయితే మగవారి మనస్త త్వంలో మార్పురాకుంటే మహిళలజీవితాలు ఇలానే వుంటాయి. ప్రతి ఏటా సమానత్వం కోసం నినదించి అలసిపోవటమే మహిళలకు మిగులుతోంది… ఈ పరిస్థితినుండి మార్పు తేవాలన్నదే 2020 మహిళా దినోత్సవ ప్రతిజ్ఞ. మహిళలతోపాటు మగ వారు ఆ ప్రతిజ్ఞలో భాగం కావాలి.

-స్వాతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap