ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం ‘ఉస్మానియా ‘

రాజకీయ విశ్లేషకులు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం అధ్యాపకులు ఆచార్య కె. నాగేశ్వర్ గారి అనుభవాలు…

నేను ఉస్మానియా యూనివర్సిటీలో 1983లో ప్రవేశించాను. కానీ అంతకుముందే నాకు ఓయూతో అనుబంధం, పరిచయం ఉంది. మా అన్నయ్య 1979 బ్యాచ్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాడు. ఆయనతో పాటు రెగ్యులర్గా ఓ.యూ.కు వెళ్లడం, అక్కడ హాస్టల్లో గడపడం వల్ల నాకు అందులో విద్యార్థిగా చేరకముందే ఉస్మానియా యూనివర్సిటీతో పరిచయం, అనుబంధం ఏర్పడింది.
ఉస్మానియా యూనివర్సిటీ భవనాలు, అక్కడి వాతావరణం, విద్యార్థులు, ఇవన్నీ చూసి అన్నయ్య కోసం ఓ.యూకి వచ్చినప్పుడు అనుకునేవాడిని ఎప్పటికైనా ఇక్కడ విద్యార్థిగా చేరాలి. ఉన్నత చదువులు చదవాలి’ అని. ఆ తర్వాత బి.ఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాను. దాని తర్వాత రెండు మూడు కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించాను. ఎం.ఏ. ఇంగ్లీష్, ఎం. ఎస్సీ, మ్యాగ్స్, జర్నలిజం మూడు కోర్సుల్లో చేరడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మూడింటిలో జర్నలిజంలో చేరడానికి ఆసక్తి చూపించాను. అలా మాతోటే 1984లో ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం బ్యాచ్ స్టార్ట్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేక లక్షణం, ప్రత్యేక చరిత్ర ఏంటంటే. ఈ యూనివర్సిటీ మొదలైనప్పటి నుంచి ఉద్యమాలకు కేంద్రంగా ఉంది. వందేమాతరం ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అన్నీ ఉద్యమాల్లో ఉస్మానియా యూనివర్సిటీ పాలు పంచుకుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే. ఇక్కడికి చదువుకోడానికి వచ్చే విద్యార్థులంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు. దీంతో ఓ.యూ కి చైతన్య ప్రవాహం నిరంతరం ఉండేది.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో, ఇతర జిల్లాల్లో యూనివర్సిటీలు, పెద్ద స్థాయి విద్యాసంస్థలు ఉండేవి కాదు. కాకతీయ యూనివర్సిటీ ఉన్నప్పటికీ అది ఓ.యూకి అనుబంధంగా, ఒక శాఖగా ఉండేది. దీంతో అనాడు తెలంగాణ మొత్తానికి ఓ.యూనే ప్రధాన విద్యా కేంద్రం. తెలంగాణలో ఉండే ప్రజా చైతన్యం విద్యార్థుల ద్వారా ఓ. యూకి ప్రసరించింది. అందుకే తొలి దశ తెలంగాణ ఉద్యమం, వందేమాతరం ఉద్యమంలాంటి ఎన్నో మహాత్తర ఉద్యమాల్లో ఓ.యూ విద్యార్థులు పాలు పంచుకున్నారు. వామపక్ష ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ గుండెకాయగా, కేంద్రంగా ఉండేది. అప్పుడు పరవళ్లు తొక్కిన పది వసంతాల చరిత్ర అంటూ అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీలో పుస్తకాలు ముద్రించి పంచారు. ఆ సమయంలో నేను ఓ. యూలో ప్రవేశించాను. ఒకపక్క వామపక్ష ఉద్యమాలు బలంగా నడుస్తున్న కాలంలోనే, వాటికి సమాంతరంగా రైట్ విద్యార్థుల భావజాల ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ రెండు రకాల ఉద్యమాలు, భావాల ఉద్యమాలు బలంగా నడిచిన కారణంగా ఓ.యూలో భావాల సంఘర్షణ నిరంతరం జరుగుతుండేది. ఆరోజుల్లో ఎటు చూసినా ఓ.యూలో, హాస్టల్ గోడలపై వాల్ రైటింగ్, పోస్టర్లు, నినాదాలు ఉండేవి. ఈ క్రమంలో విద్యార్థుల భావజాల ప్రచారం ఉండేది. వారిలోని సృజనాత్మకత కూడా బయటపడేది. ఒకరకంగా చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక రాజకీయ పాఠశాలగా వ్యవహరించింది.

ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకు ఏ పరిణామం జరిగినా. దాని తాలూకు రిఫ్లెక్షన్ ఉస్మానియా యూనివర్సిటీ గోడల మీద వాలాస్టర్లుగా కనిపించేది. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగినా, అమృత్సర్ స్వర్ణ దేవాలయం మీద పోలీస్ యాక్షన్ జరిగినా, తృతీయ ప్రపంచ దేశాల్లో విప్లవాత్మక సంఘటనలు జరిగినా అవన్నీ ఓ.యూలో ప్రతిబింబించేవి. దీని వల్ల ఓ.యూ విద్యార్థులకు ఒక రాజకీయ విద్యను అందించినట్టయింది. కొన్నిసార్లు భావాల సంఘర్షణ, మరికొన్నిసార్లు భౌతిక సంఘర్షణలకు కూడా ఓ.యూ సాక్షిగా నిలిచింది. ఇలా ఏదో ఒకరకంగా ఓ.యూ నిరంతరం లైవ్ గా ఉండేది. జీవంతో తొణికిసలాడుతున్న రాజకీయ పరిస్థితులకు ఓ.యూ కేంద్రంగా ఉండేది. ఇదంతా కూడా మాకు స్పూర్తినిచ్చేది. విద్యార్థి సంఘాల ఎన్నికలుండేవి. తర్వాత కాలంలో అవి రద్దు చేశారు.

ఒకవైపు చదువులు, మరోవైపు సామాజిక దృక్పథాన్ని రెండింటినీ మేళవిస్తూ, మాలాంటి విద్యార్థులు స్పందించేవారు. చదువుకు ఎలాంటి ఆటంకం రానివ్వకుండానే, సమాజం తరుపున నినదించే బ్యాచ్ లో మేముండేవాళ్ళం. ఓ.యూలో ఉండే భావసంఘర్షణ మాకు చదువునిస్తూనే. మాలో ఆలోచనా దృక్పథాన్ని పెంచింది. 1986 లోనే నేషనల్ ఫెలోషిప్ అందుకున్న తొలి విద్యార్థిని నేను. జర్నలిజంలో ఆలిండియా ఫస్ట్ వచ్చిన తొలి ఓ.యూ విద్యార్థిని నేనే. ఓ.యూలో జరిగే అన్ని రకాల పోటీల్లో బహుమతులు గెలుచుకునేవాణ్ణి. ఉపన్యాస పోటీలు, వ్యాసాల పోటీలు, పరీక్షలు ఎలాంటి పోటీలు పెట్టినా అందులో ప్రైజ్ కొట్టాల్సిందే. రాను రాను ఇతర జిల్లాలకు ఉన్నత విద్యను వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతీ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుచేశారు. ఆ విషయంలో ఓ.యూ పేరెంటల్ పాత్ర పోత్ర పోషించిందని చెప్పవచ్చు. పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్య అందించడంలో ఓ.యూ ఎంత ప్రముఖ పాత్ర పోషించిందో. గ్రామీణ తెలంగాణకు విద్యావ్యాప్తి చేయడంలో కూడా అదే పాత్ర పోషించి చరిత్రలో నిలిచిపోయింది. ఎన్ని విశ్వవిద్యాలయాలు వచ్చినా. ఉస్మానియా విశ్వవిద్యాలయం పాత్ర, చరిత్ర, వన్నె తరగదు. ఇక ఎన్ని కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినా, వాటిలో వసతుల కల్పన విషయంలో ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ పెట్టలేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయాన్ని తీసుకురావడం ఈ రోజుల్లో అసాధ్యమేమీకాదు. స్టాండర్డ్ పాటించడంలో విఫలమవుతున్నాం.

ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్పాలంటే ఒకప్పుడు ప్రపంచస్థాయి యూనివర్సిటీలో టాప్ లో ఉండేది. కానీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంక్ 23 స్థానంలో నిలిచింది. దీన్నిబట్టి మనం ఓ.యూకి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. విద్య విషయంలో నిజాం రాజు ప్రదర్శించినంత దార్శనికత కూడా స్వతంత్రానంతరం స్వదేశీ పాలకులు ప్రదర్శించలేకపోయారనే చేదునిజం మనకు ఓ. యూని చూస్తే అర్థమవుతుంది. విద్యలో చూసినా, మౌలిక సదుపాయాల విషయంలో చూసినా, కట్టడాల దృష్ట్యా చూసినా ఓ.యూ ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీగా ఉండాలి.

కానీ నేడు పరిస్థితి అలా లేదు. ఈ శతవసంతాల వేడుకల సందర్భంగా అయినా. ఓ.యూ గొప్పతనం గురించి చెప్పుకుని సంతోపడకుండా ఏం చేస్తే ఓ.యూని ప్రపంచంలో నెంబర్ వన్ యూనివర్సిటీగా నిలబెట్టెచ్చో ఆలోచించాలి. ఆ దిశగా నిర్ణయాలు, చట్టాలు అవసరమైతే చేయాలి. నిధులు కేటాయించాలి.
ఉస్మానియా యూనివర్సిటీ అనే నది తెలంగాణ విద్యాస్థాయిని ప్రపంచానికి చాటే ఒక మాధ్యమం. దాన్ని కాపాడుకుంటూ, అభివృద్ధి చేసుకుంటే మన రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. తద్వారా భవిష్యత్ తరాలు ఉన్నతమైన విద్యను, జ్ఞానాన్ని ఆర్జించగలుగుతారు. పటిష్టమైన విద్యావ్యవస్థ నిర్మాణం సాధ్యపడుతుంది. తెలంగాణ శాసన మండలిలో కూడా నేను శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారికి విన్నపం చేశా. ఈ శతజయంతి ఉత్సవాలను ఒక వేడుకలా జరపడంతో పాటు, ఒక అవకాశంగా తీసుకుని ఓ.యూ అభివృద్ధికి చేయాల్సిన మార్గదర్శకాలు, రోడ్ మ్యాప్ రూపొందించాలి.

ఓ.యూలో ఇంటర్నేషనల్ స్థాయి జర్నలిజం స్కూల్ ఏర్పాటు చేయాలి. అనే ప్రతిపాదన పెట్టాం. తెలంగాణను అందించడంలో ఉస్మానియా యూనివర్సిటీ ఏనాడు వెనకడుగు వేయలేదు. అలాంటి ఓ.యూ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే బాధనిపిస్తుంది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీని పరిరక్షించుకోవడంలో ప్రభుత్వం ఆలోచించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. ఓ.యూ శతజయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవాలి. ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా తీసుకుని గొప్ప విశ్వవిద్యాలయాన్ని తిరిగి ఉన్నత స్థానంలో నిలిపేలా తీసుకునే చర్యలకు పునాది వేయాలి. ఆర్కిటెక్చర్ విషయంలో తెలంగాణ ప్రపంచంలోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ యూనివర్సిటీ. హార్వర్డ్ విశ్వవిద్యాలయ భవనం, ఓ.యూ ఆర్ట్స్ భవనం రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మన ఛాతి ఉప్పొంగుతుంది. ఒకప్పుడు తెలంగాణకు ప్రధాన విద్యాకేంద్రంగా ఉన్న ఓ.యూ. ఇప్పుడు జిల్లాకో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల ఓ.యూ పరిధి హైదరాబాదు వరకే కుంచించుకుపోయిందన్న విషయం కొన్నిసార్లు బాధ పెట్టే అంశం. కానీ ఓ.యూ ప్రభావం మాత్రం అణువంత కూడా తగ్గలేదు. అణగారిన వర్గాలకు చైతన్యాన్ని విజ్ఞానాన్ని ఇచ్చే కేంద్రంగా ఓ.యూ స్థానం ఎప్పుడూ సుస్థిరమే. మేధోపరమైన ఆలోచనా విధానం, ఆచరణలో పెడితే. ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచంలోనే ది బెస్ట్ యూనివర్సిటీ అనిపించుకునేందుకు పెద్దగా సమయం పట్టదు..

నేను ఓ.యూలో ముప్పై ఏళ్ళుగా ఉంటున్నా, విద్యార్థిగా జాయిన్ అయి, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా, జర్నలిజం విభాగానికి అధిపతిగా ఇలా ముప్పై ఏళ్లుగా ఓ.యూనే అంటిపెట్టుకుని ఉన్నా. ఓ. యూతో ఒకసారి అనుబంధం ఏర్పడితే దాన్ని వదులుకోడానికి ఎవరూ సాహసించరు. ఇష్టపడరు. అలాంటి ఇష్టాన్ని ఓ.యూ మనసులో పెంచుతుంది. ఈ ముప్పై ఏళ్ళ యూనివర్సిటీ జీవితంలో ఒకే ఒక సంవత్సరం లేను. ఒక వర్కింగ్ ఎడిటర్‌గా ఉండి, యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న వ్యక్తిని ఈ దేశంలో బహుశా నేను మొదటి వ్యక్తిని అయి ఉండొచ్చు. ప్రాక్టీస్ చేయకుండా డాక్టర్ ఎలా ఆపరేషన్ చేయలేడో. జర్నలిజం వృత్తిలో కొనసాగకుండా. జర్నలిజం పాఠాలు చెప్పడం అసాధ్యమనే నిజాన్ని నేను నమ్ముతా. అందుకే ఇప్పటికీ ఒక వర్కింగ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే. యూనివర్సిటీలో జర్నలిజం పాఠాలు బోధిస్తున్న. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడుకూడా నా తోటి ప్రొఫెసర్లకు చెప్పా. దీని తర్వాత నేను మళ్ళీ ఓ. యూకే వస్తా అని. కానీ వారు నమ్మలేదు. ఒకసారి అటువైపు వెళ్ళాక. తిరిగి ఇటువైపు రావడం అసాధ్యం సార్. అన్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉంటూనే శాసన మండలిలో ఉన్న వ్యక్తిని నేనొక్కణ్ణి. నాకు ఓ.యూ చదువున్చింది. ఉపాధి నిచ్చింది. జీవితాన్నిచ్చింది. చాలా ఇచ్చింది. అందుకూ ఓ.యూకు నేను ఋణపడి ఉంటాను. నేనే కాదు ఇక్కడ జీవితాన్ని ప్రారంభించిన ప్రతి ఒక్కరు ఓ.యూకి ఋణపడే ఉంటారు. ఇక్కడ చదువుకున్న వారు ప్రపంచస్థాయి కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ప్రపంచదేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. అదీ ఓ.యూ గొప్పతనం. ప్రపంచానికి, తెలంగాణకు ఇంత ఇచ్చిన ఓ.యూకు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు, మనందరి మీద ఉంది.

ఆచార్య కె. నాగేశ్వర్ , రాజకీయ విశ్లేషకులు, జర్నలిజం అధ్యాపకులు

(ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ళ సంబరాల సంచిక-2019 నుండి…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap