ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీషా, ముఖ్య అతిథిగా
విజయవాడలో ‘జూన్ 5’ ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ విజయవాడ, డ్రీమ్ యంగ్ & చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో, కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, విజయవాడలో జూన్ 5 నిర్వహించిన చిత్రలేఖన పోటీలు మరియు ఆర్ట్ ఎగ్జిబిషన్ విజయవంతమయ్యింది.
చిత్రకళా ప్రదర్శన: ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీషా, ఐఏఎస్ ముఖ్యఅతిథిగా హాజరై చిత్రకళా ప్రదర్శననను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు. యువతలో పర్యావరణ చైతన్యం పెంపొందించడంలో కళ ఒక శక్తివంతమైన సాధనమని ఆయన అభిప్రాయపడ్డారు.
చిత్రలేఖన పోటీలు: “మన ప్రకృతిని మనం కాపాడుకుందాం” అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొని తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి, జీవవైవిధ్య సంరక్షణ వంటి అంశాలపై విద్యార్థులు రూపొందించిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సునీత, తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్ధన్, జీఆర్‌కే సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు, 64 కళలు వ్యవస్థాపకులు కళాసాగర్, డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు పి. రమేష్, మార్పు వ్యవస్థాపకులు తులసీ పద్మశ్రీ, మోతుకూరి వెంకటేశ్వర రావు, విజయభాస్కర్, న్యాయవాది నరేంద్ర ప్రత్యేక అతిథులుగా పాల్గొని చిత్రకారులను, విద్యార్థులను అభినందించారు.
అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ కళాకారుల కళాఖండాలతో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. కళ ద్వారా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని సమాజానికి చేరవేయడంలో కళాకారుల పాత్రను అతిథులు ప్రశంసించారు.

బహుమతి ప్రదానోత్సవం: సాయంత్రం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో హైదరాబాద్ కు చెందిన గజల్ గాయకుడు కృష్ణ గజల్స్ పాడి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేయబడింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని భాగస్వామ్య సంస్థలకు, కళాకారులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం యువతలో ప్రకృతి పరిరక్షణ పట్ల మరింత అవగాహన, బాధ్యతను పెంపొందించిందని అతిథులు పేర్కొన్నారు.


