జానపద కళా సంస్కృతి

(నేడు ప్రపంచ జానపద కళల దినోత్సవం)

సంస్కృతి జీవిత మంత విశాలమైనది. సంప్రదాయాలు, కర్మకాండ, భాష, నుడికారాలు, భౌతిక వస్తు సామగ్రి, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పాదక పరికరాలు, సంగీతము, మౌఖికసాహిత్యరూపాలు, కళాప్రదర్శనలు, వైద్యము, ఇల్లు, పెళ్లిళ్లు, కట్టు, బొట్టు, ఆభరణాలు, శుభకార్యాలు, పుట్టుక, చావు, పండుగలు, వ్రతాలు, నోములు ఇత్యాదివి సంస్కృతిలో భాగం.

ప్రతి జాతికి సంస్కృతి ఉంటుంది. ఇది ఆది మానవ మొదలుకొని నేటి ఆధునిక మానవుల వరకూ ఎన్నో పరిణామాలుసంభవించాయి. అయితే మొదటిగా మానవ నాగరికత గ్రామాలలో వివిధ వృత్తులుతో ముడి పడిసాగింది. వ్యవసాయము, పశుపోషణ, చేనేత, కుమ్మరి, కమ్మరి, మేదరి, జాలరి, మంగళి, చాకలి ఇలా వివిధ వృత్తుల సమ్మేళనమే గ్రామీణ సంస్కృతి. మానవుడు ప్రకృతిని చూసి పరవశించి చిందులు వేశాడు. ఈ క్రమంలో శ్రమను మర్చిపోడానికి, సేద తీరడానికి అనేక కళ లు ఆవిర్భవించాయి. అవి కాల క్రమేణా జానపద కళలుగా రూపు దిద్దుకున్నాయి.

స్త్రీలకు సంబంధించి పిల్లల లాలి పాటలు మొదలకొని సమర్త, పెళ్లి,వ్యవసాయ పాటలు, పండుగ పాటలు మొదలగునవి జీవిత భాగస్వామ్యం అయినవి. గ్రామాల్లో పశువుల కాపరులు తాటి కమ్మల గొడుగుతో పిన్నల గర్రలు ఊదుతూ ఆనందించగ, గ్రామాల్లో చాటింపుకు, పెళ్లి, చావుకు డప్పులు సన్నాయి ప్రధాన మైనాయి. కొండ కోనల్లో నివసించే ఆది వాసీయులు వేటాడటంమే ఒకకళగా సాగుతూ, కిన్నెర, తుడుము, డప్పు జీవితంలో భాగమైంది.గ్రామ దేవతల పండుగలలో బుట్ట బొమ్మలు, పగటి వేషాలు, డప్పుల మోతప్రధానమైనాయి. చివరకు కొన్నికులాలవారు గంగిరెద్దులు, దాసర్లు, జంగాలు, ఎరుకల వారు వృత్తి కళాకారులుగా తయారైనారు. గ్రామాలలో తోలు బొమ్మలు, వీధి నాటకాలు, బుర్ర కధలు, భారత రామాయణ గాథలు చెప్పే కళాకారులుగా తయారైనారు. పొద్దంతా పని చేసి అలసట వచ్చిన రైతులకు, శ్రామికులకు ఈ కళాకారులు తమ ఆట పాటలతో స్వాంతన కలిగించారు. రాములోరి గుడి కాడ చెక్క భజన, కోలాటాల తో రామ భజన చేసి తృప్తి పొందారు. 7 లక్షల గ్రామాలు ఉన్న భారత దేశం నిన్నటి వరకూ పూర్తిగా గ్రామీణ సంస్కృతి నిండి ఉండేది. ఎండా కాలపు రాత్రులలో చుక్కల ఆకాశం కింద పల్లె పల్లెకు అలలుగా వ్యాపించే పాటలు ఇప్పుడు లేవు.పంట కాలములోనో, జాతర్ల లోనో రాత్రి తెల్లవార్లూ తప్పెట దరువ్వులేవు.

Different Telugu folk arts

తోలు బొమ్మలాట, కోయ్యి బొమ్మలాట, యక్ష గానాలు, ఒగ్గు కథలు, సిందు బాగోతాలు, జముకుల కథలు, గరగల నృత్యాలు లేవు. సన్యాసమ్మ, బాల నాగమ్మ కథలు లేవు. పీర్ల పండగ నాడు హిందు ముస్లిం సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఆటలు లేవు.సత్యహరిశ్చంద్ర వంటి పౌరాణిక నాటకాలు లేవు, గ్రామ యువకులు నటించే పూల రంగడు వంటి నాటకాలు లేవు.పిల్లలు పాడుకొనే పాటలు, గోలీలు, బొంగరాలు ఆటలు, కోతి కొమ్మచ్చి, సిరతా బిళ్ళల ఆటలు లేవు. మట్టి ఇల్లు లేవు, పేడతో కళ్ళాపి చల్లే వాకిళ్ళు లేవు, వ్యవసాయంలో యంత్రాలు వచ్చి నాగలి, దుక్కి టెడ్లు, ఎడ్ల బండి గ్రామాలలో నేడు లేవు, దేశవాళి ఆవులు లేవు, ప్రతి గుడిసెలోకి ప్రవేశించిన టివి, సినిమా ఛానెళ్లు సమస్త సంస్కృతులను ధ్వంసం చేస్తున్నాయి.

మనలను నవ్వించి, ఏడిపించి మనలో భాగమైన మన కళలను మనకి దూరం చేస్తున్నాయి.తర తరాలుగా వారసత్వం గా వస్తున్న కళా రూపాలు మట్టి కొట్టుకు పోతున్నాయి. జానపద కళాకారుల జీవితాలు చల్లా చేదురై కూలీలుగా మారుతున్నారు.
నేడు ఈ కళలకు వారసులు లేరు. జానపద బాణీలను సినిమా పాటలు గాను ఉపయోగించుకున్నారు. వామ పక్ష ఉద్యమాలకు ఉపయోగించుకున్నారు. కానీ ఈ కళలను బ్రతికించడానికి ప్రజా సంఘాలు గాని ప్రభుత్వంగాని పూను కోలేదు. మరో పక్క ఇంగ్లీష్ మాధ్యమానికి దగ్గరౌతూ అమ్మ నాన్న సంస్కృతికి దూరమౌతున్న తెలుగు జాతిని చూసి నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు.

బద్రి కూర్మా రావు, విజయనగరం.
సెల్: 83090 77607

SA:

View Comments (1)