జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా…
శిశుర్వేత్తి.. పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః… అంటే శిశువులు, పశువులు, పాములు కూడా సంగీతం వినబడితే తప్పకుండా స్పందిస్తాయి. అంతటి మహిమాన్వితమైన సంగీతం ఆది ప్రణవ నాదమైన ఓంకారం నుంచి ఆవిర్భవించింది. మనకున్న అరవై నాలుగు కళల్లో ఇదొకటి. భారతీయ సంగీతంలో ప్రధానమైనవిగా హిందుస్థానీ, కర్ణాటక సంగీత సాంప్రదాయాలను చెప్పవచ్చు. ఉత్తరాదిన హిందుస్థానీ, దక్షిణాదిన కర్ణాటక సంగీతాలుగా ప్రసిద్ధి పొందాయి. శ్రుతి, రాగం, తానం, పల్లవి తదితర శబ్ద లక్షణాలు సంగీతంలోని ప్రాథమిక సూత్రాలు. ఒక్కమాటలో చెప్పాలంటే సంగీతం మనిషి జీవితంలో ఒక అంతర్భాగం. ఉప్పులేని పప్పు ఎంత చప్పగా ఉంటుందో సాహిత్యం తోడు లేకుంటే సంగీతమూ అంతే. సంగీత, సాహిత్యాలు ఒక ఒరలో ఇమిడినప్పుడే పాటకైనా, పద్యానికైనా, జానపదానికైనా, జావళికైనా శోభ చేకూరేది. సంగీతానికి రాళ్లు కరగడమే కాదు… రాగాలతో రోగాలు కూడా నయమవుతాయని చెబుతారు.
మన సినిమాల్లో సంగీతం…
–––––––––—–––——–––
తెలుగు సినిమా విజయవంతం కావడానికి హీరో, హీరోయిన్లు సరిపోరు. కథ బాగున్నా పసందైన పాటలుంటేనే ఆ బొమ్మ మ్యూజికల్ హిట్టవుతుంది. పాటలే కాదు బీజీఎం సయితం బలంగా ఉంటేనే వీనులవిందు అవుతుంది. ఈ విషయంలో దర్శకుడు కె. విశ్వనాథ్ పాటలు, సంగీతంపై తన ముద్ర వేసుకున్నారు. ఎందుకంటే ఆయన సౌండ్ రికార్డిస్టుగా సినీ జీవితాన్ని ఆరంభించారు. అందుకే ఆయన చిత్రాల్లో ఎక్కువగా శాస్త్రీయ సంగీతం వినిపిస్తుంది. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ‘సిరిసిరిమువ్వ’ సంగీతంతో ముడిపడి ఉంటుంది. హైమ పాత్రలో నటించిన జయప్రదకు నాట్యమంటే పిచ్చి. నృత్యం, సంగీతం కవలలే. ఈ క్రమంలో పాటలన్నీ సంగీతభరితంగా ఉంటాయి. ఝుమ్మంది నాదం.. సయ్యంది పాదం, రా దిగిరా భువినుంచి దివికి దిగిరా పాటలు బాగుంటాయి. మరో ఆణిముత్యం ‘శంకరాభరణం’. పాశ్చాత్య సంగీతపు హోరులో వినిపించకుండాపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పునర్వైభవాన్ని ఆపాదించేలా ఈ చిత్రంలో పాటలుంటాయి. ఈ చిత్రంలో జేవీ సోమయాజులు సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతాన్ని ఎంతోమంది ఇష్టపడుతుంటారు. కె.వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి పాటా వినసొంపే. సాగరసంగమం, శ్రుతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం తదితర చిత్రాలన్నీ సంగీతం, కళాకారులతో ముడిపడి ఉన్నవే. సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం వంటి చిత్రాల్లో అద్భుతమైన పాటలను చిత్రీకరించారు. సంగీతపరంగా గొప్ప సినిమాలే. కార్తీక్, శోభన నటించిన ‘అభినందన’, ఓపీ నయ్యర్ సంగీతం అందించిన ‘నీరాజనం’ చిత్రాలు కూడా సంగీత ప్రాధాన్యత గలవే.
ఆపాత మధురాలు…
–––––––———––––
దక్షిణ భారత సంగీతంలో పాశ్చాత్య సంగీతాన్ని మేళవింపు చేసిన మేస్ట్రో ఇళయరాజా సంగీతానికి దాసోహమనాల్సిందే. సీతాకోకచిలుక, నిరీక్షణ, అన్వేషణ, కిల్లర్, డిటెక్టివ్ నారద, కోకిల, బొబ్బిలిరాజా, జగదేకవీరుడు అతిలోకసుందరి, శివ, ప్రేమ, చెట్టుకింద ప్లీడర్, గీతాంజలి, ఘర్షణ, ఆరాధన, ఆలాపన, లేడీస్ టైలర్, సితార, వసంతకోకిల, ఎర్రగులాబీలు చిత్రాల్లో ఇళయరాజా స్వరపరిచిన పాటలన్నీ ఆపాత మధురాలే. మరో యువ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మాన్ స్వర ప్రపంచానికి యువరాజు. ఆయన చేసిన చిత్రాల్లోని పాటలు శీతల సమీరంలా ఎద ఎదనూ తాకి గిలిగింతలు పెడతాయి. ప్రధానంగా రోజా, జీన్స్, శివాజి, గజిని సినిమాల్లో పలికించిన స్వరాలు మరపురాని మధురాలు. ‘జగదేకవీరుని కథ’ చిత్రంలో పెండ్యాల స్వరపరిచిన శివశంకరీ శివానంద లహరీ పాట అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. సంగీతానికి రాళ్లు కరుగుతాయనడానికి ఉదాహరణ. ఇక భక్తి సంగీతానికి వస్తే.. అన్నమయ్య, త్యాగయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం, ఓం నమో వేంకటేశాయ, శిరిడి సాయి, మహాకవి క్షేత్రయ్య, భక్తతుకారాం, దేవుళ్లు, చక్రధారి, శ్రీమంజునాథ చిత్రాలు ముందువరుసలో నిలుస్తాయి. జానపద సంగీతానికీ మన తెలుగు సినిమాల్లో అగ్ర తాంబూలమిచ్చారు. కొత్త హీరోలను ఆరంగేట్రం చేయించిన కె. రాఘవేంద్రరావుది ఓ ప్రత్యేక బాణీ. ఆయన పాటల్ని చిత్రీకరించే విధానం సరికొత్తగా ఉంటుంది. పళ్లు, పూలు, బంతులు, బూరలు, బిందెలు.. ఇలా ఏవి పడితే వాటిని సెల్యులాయిడ్‌పై అందంగా చూపిస్తారు. ఆయన పాటలన్నీ సంగీత ప్రాధాన్యతగలవే. కొండవీటి సింహం, మేజర్ చంద్రకాంత్, అడవిరాముడు, దేవత, అడవిదొంగ, అల్లుడుగారు, ఝుమ్మందినాదం, పదహారేళ్ల వయసు, జస్టిస్ చౌదరి, ఘరానామొగుడు, బొంబాయి ప్రియుడు, రాజకుమారుడు, ఊరికిమొనగాడు చిత్రాల్లోని పాటలు ఆల్‌టైమ్ హిట్లు. ఇటీవలి కాలంలో విడుదలైన హనుమాన్, మిరాయి చిత్రాలకు సంగీతం అందించిన మరో యువకుడు గౌరహరి. అద్భుతమైన బీజీఎం అందించి థియేటర్లలో మోత మోగించారు. చాలామందికి బాత్రూమ్ సంగీతం అంటే ఇష్టం. స్నానిస్తూ పాటలు పాడుకుంటుంటారు. ‘మండేగుండెలు’ చిత్రంలో ‘జిల్లు జిల్లుమంటున్నాయ్ నీళ్లు.. చలిచలి అంటుంది ఒళ్లు’ పాటను దర్శకుడు కె.బాపయ్య.. కృష్ణ, జయప్రదల మీద చిత్రీకరించారు. గుర్తుంది కదా!
ప్రయోగాల దిట్ట సింగీతం…
––––––––——––––––––
సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు శిష్యుడు సింగీతం శ్రీనివాసరావు. ప్రతిభాశాలురైన సినీ దర్శక దిగ్గజాల్లో ఆయనొకరు. ప్రయోగాత్మక సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. మంచి సంగీత దర్శకుడు కూడా. ఆయన దర్శకత్వంలో వచ్చిన జమీందారుగారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, పంతులమ్మ, సొమ్మొకడిది సోకొకడిది, మయూరి, ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు, బృందావనం, భైరవద్వీపం చిత్రాల్లోని పాటలు మంచి సంగీతానికి మెచ్చుతునకలు. తొంభై నాలుగేళ్ల వయసులో సింగీతం దర్శకత్వం వహించిన చిత్రం ‘సింగ్ గీతం’ తాజాగా విడుదలైంది. ఇందులో ఆయన మరో సరికొత్త ప్రయోగం చేశారు. కుబేరపురంలోని ప్రజలందరికీ హఠాత్తుగా మాట పోయి పాట వస్తుంది. వారు ఏం చెప్పాలన్నా పాట రూపంలో చెబుతుంటారు. ఇలా అరగంట సేపు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. సింగీతానికి సంగీతం అంటే ఎంతిష్టమో ఈ చిత్రం ద్వారా నిరూపితమైంది. ఇంకా సంగీతం బ్యాక్ డ్రాప్‌లో సంగీత సామ్రాట్, సరిగమలు, మ్యూజిక్ షాప్ మూర్తి, రాగం తానం పల్లవి వంటి సినిమాలెన్నో ఉన్నాయి.
–చెన్నాప్రగడ శర్మ
చరవాణి: 94405 87567
