(ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ మరియు ఫోటో ఆర్ట్ కాంటెస్ట్)
184 వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ని పురస్కరించుకొని యువతలో అంతర్లీనంగా దాగి ఉన్న ఫోటోగ్రఫీ టాలెంట్ ని వెలికి తీయాలనీ, వారు మొబైల్స్ తో వండర్స్ క్రియేట్ చేయొచ్చని నిరూపించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, జాషువా సాంస్కృతిక వేదిక మరియు కామ్రేడ్ జి.ఆర్.కే & పోలవరపు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఆగస్ట్ 20వ తేదీ ఆదివారం, విజయవాడ, రాఘవయ్య పార్క్ ఎదురుగా ఉన్న బాలోత్సవ్ భవన్ మొదటి అంతస్తులో మొబైల్ ఫోటోగ్రఫీ (Mobile Photography) ఎగ్జిబిషన్ మరియు ఫోటో ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలియజేసారు.
ఈ మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ లో 20 మంది యువ ఫోటోగ్రాఫర్స్ తీసిన 80 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జిబిషన్ ని ఆదివారం (20-8-23) ఉదయం 10 గంటలకు CII ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ డాక్టర్.ఎమ్.లక్ష్మీ ప్రసాద్ లాంఛనంగా ప్రారంభిస్తారని అనంతరం సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని ప్రవేశం ఉచితమని ఔత్సాహికులు ఎవరైనా తిలకించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2-4 గంటల మధ్య 6 నుండి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు వినూత్నంగా “ఫోటో టు ఆర్ట్ కాంటెస్ట్” (Photo to Art Contest) వుంటుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
సాయంత్రం జరిగే బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి డాక్టర్ ఇండ్ల స్వప్న ముఖ్యఅతిథిగా, మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం ప్రతినిధి పిన్నమనేని మురళీ కృష్ణ, కామ్రేడ్ జి.ఆర్.కే & పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు, సోమూరి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రేష్మా సోమూరి ఆత్మీయ అతిథులుగా హాజరై మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పార్టిసిపెంట్స్ కి ఫోటో ఆర్ట్ కాంటెస్ట్ విజేతలకు, ప్రసంశా పత్రాలు, బహుమతులు అందజేయబడతాయి.
ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ, కోకన్వీనర్ గిరిధర్ అరసవల్లి, ఈవెంట్ మేనేజర్ స్ఫూర్తి శ్రీనివాస్, కోఆర్డినేటర్లు కళాసాగర్ యెల్లపు, ఎస్.పి.మల్లిక్, శ్రావణ్ కుమార్ లు పాల్గొన్నారు.