తెలుగు భాషకు అపచారం

తెలుగు రచయితల మహాసభల్లో వక్తల ఆగ్రహం.
తెలుగుకు అన్యాయం జరిగితే సినీ పరిశ్రమ ఎందుకు మాట్లాడదు.
నిలదీసిన మండలి బుద్ధప్రసాద్.

విజయవాడ పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్‌ కళాశాలలో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆరంభ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భాషా పండితులు, ప్రముఖ సాహితీవేత్తలు హాజరయ్యారు. సాహిత్య అకాడెమీ అధ్యక్షులు చంద్రశేఖర కంబార ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రసిద్ధ రచయిత్రి శివరాజు సుబ్బలక్ష్మి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. ప్రముఖ గాయని ఆకునూరి శారద ప్రార్థనా గీతం ఆలపించారు. సంఘ అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు స్వాగతోపన్యాసం చేస్తూ… మూడు రోజులపాటు నిర్వహించే ఈ మహాసభల్లో భాషా పరిరక్షణకు చేపట్టాల్సిన అంశాలపై చర్చలు, ప్రతిపాదనలు, తీర్మానాలు జరుగుతాయని తెలిపారు. మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ తెలుగుతల్లి దూతలేనని అన్నారు. అనంతరం సంఘ కార్యదర్శి డా.జి.వి.పూర్ణచందు మాట్లాడుతూ…మహాసభలకు వస్తున్న విశేష స్పందన భాషా పరిరక్షణ ప్రాధాన్యాన్నితెలుపుతున్నాయన్నారు.

మహా సభల ప్రత్యేక సంచిక ‘తెలుగు ప్రపంచం’ను డా: కె.ఐ. వరప్రసాద్ (శంతా బయోటిక్ అధినేత) ఆవిష్కరించారు. భాషణ, బోధన, ఆలనా, పాలనా భాషకి నాలుగు చక్రాలు. తెలుగునాట అవేందుకో మొరాయించాయి. తలా ఒక చెయ్యి వేసిముందుకు నడిపిద్దాం అన్నారాయన. సభల సందర్భంగా “ప్రపంచ తెలుగు” పరిశోధనా గ్రంధాన్ని ఎన్. వెంకటేశ్వర్లు (సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు) ఆవిష్కరించారు.

మనకి ఇంగ్లిషు వచ్చు అనుకుంటున్నాం.. కాని రాదు. తెలుగు రాదనుకుంటున్నాం కానీ వచ్చు. ఇంగ్లీషులో మనం మాట్లాడుతున్నాం అంటే దాని అడుగున తెలుగు ఉంది. తెలుగు భూమికగా మన ఇంగ్లీషు సాగుతుంది. అందుకే మాతృభాష ఎక్కడికి పోదని వెల్చేరు నారాయణ రావు అన్నారు.

తెలుగు భాషకు అపచారం జరుగుతోందని, తెలుగు జాతికే ఇది అవమానం అని ప్రపంచ తెలుగు రచయితల నాలుగో మహాసభకు హాజరైన పలువురు ప్రముఖులు మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పె డుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహావే శాలు వ్యక్తమయ్యాయి. మీ పిల్లలను తెలుగు మాధ్య మంలో చదివిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. కార్పొ రేట్ పాఠశాలల్లో తెలుగు అక్షరాలు నేర్పకుండా చేసింది. ఈ ప్రభుత్వాలు కాదా?.. అని మండలి బుద్ధ ప్రసాద్ నిలదీశారు. సుదీర్ఘ రాజకీయ యాత్ర చేయా లనుకుంటున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఈ విధానం మంచిదికాదని, పక్కన సరైన సలహాలు ఇచ్చేవాళ్లు లేకుండా పోయారని సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం చేస్తున్నది.. తప్పు అని చెప్పేమొనగాడు తెలుగు రచయితల్లో లేరా అని ఆచార్య కొలకులూరి ఇనాక్ ప్రశ్నించారు. విజయవాడలోని సిద్ధార్థ అకాడమీలో కొమర్రాజు లక్ష్మణరావు సభా ప్రాంగణంలో శుక్రవారం ఈ మహాసభలను కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర కంబార ప్రారంభించారు. ప్రముఖ రచయిత్రి శివరాజు సుబ్బలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేశారు.
“భాషోద్యమకారులు వారి పిల్లలను ఆంగ్లంలో చదివిస్తున్నారా? అంటూ ప్రభుత్వంలో ఉన్న వారు విమర్శిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఆంగ్ల బోధన చేస్తున్నా పట్టించుకోనిది ప్రభుత్వాలు కాదా? తెలుగు మాధ్యమంలోనే బోధన చేయాలన్న ఉత్తర్వులు ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపజేసి మార్కుల కోసం కార్పొరేటు స్కూళ్లలో ఫ్రెంచి, హిందీ చెబుతూ తెలుగు అక్షరాలు. నేర్పని పరిస్థి తిని సృష్టించింది. ప్రభుత్వాలు కాదా? తెలుగు కోసం, తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చనిపోతే, ఆయన ప్రాణత్యాగానికి విలువ లేకుండా చేసేశాం. రూ. వందల కోట్ల వ్యాపారం చేస్తున్న తెలుగు సినీ పరిశ్రమ మాతృభాషకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించదు? ఎక్కడో ఆత్యాచారం జరిగితే స్పందించే సినీ ప్రముఖులు, తెలుగుకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే కనీసం ట్విటర్లో కూడా ఎందుకు మాట్లాడరు?” అని బుద్ధప్రసాద్ నిలదీశారు. ఇసుక కొరత వస్తే భవనాల నిర్మాణమే ఆగిపోతుందని, అదే భాష మనుగడకు ఇబ్బంది ఏర్పడితే జాతి నిర్మాణమే ఆగిపోతుందని.. తెలుగుభాష పరిరక్షణకు తెలుగు జాతి సత్యాగ్రహం చేయాలని” పిలుపునిచ్చారు.

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా సాహితీరంగ ప్రతినిధుల సదస్సు సురవరం ప్రతాపరెడ్డి సభావేదికపై శుక్రవారం సాయంత్రం 4.35 గంటలకు ప్రారంభమైంది. ప్రముఖ సాహితీవేత్త విహారి అధ్యక్షత వహిస్తున్నారు. పెద్దింటి అశోక్‌కుమార్, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, ఆచార్య మన్నవ సత్యనారాయణ అతిథులుగా వచ్చారు.

నాలుగో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా మొదటిరోజు సాయంత్రం “తెలుగు బోధనారంగ ప్రతినిధుల సదస్సు” జరిగింది. దీనికి డా. రావి రంగారావు అధ్యక్షత వహించారు. తెలుగు బోధన కేంద్రంగా వక్తలు విశ్లేషణాత్మక సూచనలు అందించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనుబంధం, ఆత్మీయత, స్పందన, తిరుగుబాటు లాంటివాన్ని మనసు లక్షణాలు అని, ఒక వ్యక్తి నిజమైన మనిషిగా ఎదగాలంటే మాతృ భాషలో విద్యాబోధన అత్యావశ్యకమని అన్నారు. పరిభాషలో బోధన వల్ల మానసిక శక్తులు వికసించవని అన్నారు.  ఇంజనీరింగ్, వైద్యం లాంటి అన్ని స్థాయిల్లో తెలుగుని ఒక సబ్జెక్టుగా చేర్చాలని కోరారు. దీనివల్ల వాళ్లలో వ్యాపార దృష్టి పోతుందని విశ్లేషించారు. తెలుగునాట ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఎంపిక విధానాలు మారాలని, కేవలం ఐఛ్చిక ప్రశ్నలు ఇచ్చి వాళ్ళని ఎంపిక చేస్తున్నారని, కానీ తెలుగు బోధించే వారికి వాక్ రూప, లిఖిత, సృజనాత్మక నైపుణ్యాలు ఉండాలని, వీటన్నింటిని పరిశీలించే ఎంపిక చేయాలని అన్నారు. తెలుగు పాఠ్య పుస్తకాల స్వరూప స్వభావాలు మారాలని, పిల్లల స్థాయిని పరిగణనలోకి తీసుకుని పాఠాలు చేర్చాలని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో మూల్యాంకన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లానికి నిర్దేశించిన బోధన ప్రమాణాలనే తెలుగుకు అనుసరిస్తున్నామని, ఇది మారాలని అన్నారు.
సాయంత్రం ఆరు గంటలకు సరికొండ నరసింహరాజు,  మోహిత, మాదిరాజు బిందు వెంకట దత్త శ్రీ, ఉమర్ షరీఫ్… నిర్వహణలో..  సినీ గేయ రచయిత వెన్నెలకంటి  సభాధ్యక్షులుగా మహాకవుల ప్రత్యేక కవి సమ్మేళనం జరిగింది. మొదటగా వెన్నెలకంటి మాట్లాడుతూ… ” నానీ.. హైకూ.. రెక్కలు అంటూ… ఏవేవో రూపాల్లో కవిత్వం రాస్తూ.. అదే కవిత్వమనే భ్రమలో వున్నారు చాలామంది. అవి ప్రక్రియలు. ప్రక్రియలు ఎప్పుడూ కవిత్వం కాదు. అది ఏ ప్రక్రియలో చేరితే అది ఆ ప్రక్రియా కవిత్వమవుతుందన్నారు.
తర్వాత.. సినీ గేయ రచయిత రసరాజు.. ” వెన్నెలే ఏమందో… వెన్నలో ఏముందో.. నా భాషను అడగండి. నా వెంట నడవండి… తెలుగు నా భాష.. తెలుగు నా శ్వాస… అంటూ కవితతో ఎలుగెత్తారు. కడుపులో వున్న బిడ్డ ఈ భూమ్మీద పడటానికి ఎందుకు జంకుతున్నాడో…  ఈనాటి దారుణ పరిస్థితులను  భువనచంద్ర కవితలో  వెల్లడిచేశారు. గేయ రచయుతలు వడ్డేపల్లి కృష్ణ, వీణాపాణి.. ఇంకా ఇతర ప్రసిద్ధ కవులు తమ తమ కవితలు చదివి వినిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap