‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల’పై స్పందించిన చిరంజీవి…!
జూలై 24, 25, 26, ఆగస్టు 1, రెండవ తేదీల వరకు …
తానా సంస్థ ఆధ్వర్యంలో జరగే ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాన్ని’ ఈ ఏడాది కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ తెలుగు ఫెస్టివల్ లా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తానా బృందం ఏర్పాట్లు చేస్తోంది. జూలై 24 నుండి 26 వరకు మూడు రోజులు జరగబోయే ఈ భారీ ఆన్ లైన్ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి ప్రారంభించనున్నారు. ఇక ఈ మహోత్సవాలను పురస్కరించుకుని ఎన్నో దేశాలలో ఉంటున్న తెలుగువారి మధ్య పోటీలను నిర్వహిస్తారు. కాకపోతే ప్రస్తుతం నెలకొనియున్న పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా ఆన్ లైన్ లోనే ఈ పోటీలను జరపబోతున్నారు. కాగా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు విజయవంతం కావాలని కోరుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో ద్వారా సందేశమిచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ”ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన బలపడిన తెలుగువారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉద్యోగ రీత్యా వృత్తి రీత్యా మీరందరూ ప్రవాస జీవితం గడుపుతున్నప్పటికీ… తెలుగు భాష – తెలుగు సంస్కృతి సంప్రదాయ ఔన్నత్యం పట్ల మీరు చూపుతున్న చెక్కుచెదరని మీ అభిమానానికి నా అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక మంది మాట్లాడే భాషగా తెలుగు 15వ స్థానంలో.. భారతదేశంలో చూసుకుంటే హిందీ బెంగాలీ తర్వాత మూడో స్థానంలోను.. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అమెరికాలో హిందీ గుజరాతీ తర్వాత మూడో స్థానంలో వెలుగొందుతోంది మన తెలుగు” అని కొనియాడారు.
”ఇలాంటి తెలుగు భాష తెలుగు సంప్రదాయ సంస్కృతీ పరిరక్షణ కోసం తానా ఆధ్వర్యంలో దాదాపు 50 దేశాల తెలుగు సంస్థలు ఒకే తాటిపైకి వచ్చి జూలై 24, 25, 26, ఆగస్టు 1, రెండవ తేదీల వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరం. ప్రాచీన హోదాను దక్కించుకున్న తెలుగు భాష సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటి భాషా సాంస్కృతిక సంప్రదాయ సమ్మేళనాల అవసరం ఎంతైనా ఉంది. స్వదేశంలో దేశ భాషలందు తెలుగు లెస్స అని.. ప్రపంచంలో ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రశంసలు అందుకున్న భాష తెలుగు. ఈ కరోనా కష్ట కాలంలో కూడా తెలుగు సంప్రదాయ విలువలు ముందు తరాల వారికి అందించేందుకు మీరు చేస్తున్న కృషికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ మూడు రోజుల కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆశిస్తున్నా” అని చిరంజీవి మాట్లాడారు.
https://www.youtube.com/watch?v=Qx6OLpr836o
Chala baaga chepparu