మాతృభాష పరిరక్షణకే ఈ మహాయజ్ఞం

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నేడే విజయవాడలో ప్రారంభం…
సభలకు హాజరుకానున్న 1,600 మంది ప్రతినిధులు…
ప్రపంచ తెలుగు రచయితల 4వ మహాసభలు 27-12-19, శుక్రవారం నుండి ఆరంభం కానున్నాయి. విజయవాడ కేంద్రంగా నాలుగేళ్లకోసారి మహాసభలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడు జరిగాయి. ప్రస్తుతం నాలుగో మహాసభలు జరిగేందుకు సర్వం సిద్ధమైంది. విజయవాడలోని మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో నాలుగో మహాసభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 27,  28, 29 మూడు రోజులు జరిగే వేడుకల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక దేశాల నుంచి తెలుగు భాషాభిమానులు, రచయితలు, సాహితీవేత్తలు హాజరవుతున్నారు. విజయవాడ నగరంలోని 24 హోటళ్లలో వచ్చే అతిథులంతా బసచేస్తున్నారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో 2007లో ప్రపంచ తెలుగు రచయితల మొదటి మహాసభలు విజయవాడ కేంద్రంగా జరిగాయి. ఆ మహాసభల్లోనే ప్రపంచస్థాయి కలిగిన తెలుగు రచయితల సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ తర్వాత 2011లో రెండో మహాసభలు విజయవాడ కేంద్రంగా జరిగినప్పుడు.. ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2015లో మూడో మహాసభలను ఇక్కడే నిర్వహించారు. 2019లో ప్రస్తుతం నాలుగో మహాసభలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో నివసించే సాహిత్యాభిమానులైన తెలుగువారందరినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చి.. భాషా వికాసానికి కృషి చేయడమే ప్రధాన లక్ష్యంగా మహాసభలు నిర్వహిస్తున్నారు.
అందరిలోనూ భాషాకాంక్ష… గతంలో జరిగిన మూడు మహాసభల కంటే ఈసారి భిన్నమైన నేపథ్యంలో జరుగుతున్నందున 1,600 మంది ప్రతినిధులుగా నమోదయ్యారని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు పేర్కొన్నారు. భాషను కాపాడుకోవాలనే తపన అందరిలోనూ కనిపిస్తోందన్నారు. భాష కోసం ఇంతమంది వచ్చి తమ గళం వినిపించడం ఆనందంగా ఉందన్నారు.
ప్రజల గుండెతలుపులు తట్టి..
ఈ మహా సభలలో ప్రజల గుండె తలుపులు తట్టి తెలుగు గుడి కట్టేందుకు కావాల్సిన కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ మండలి బుద్ధప్ర సాద్ పేర్కొన్నారు. అందుకే.. మహాసభల్లో భాగంగా లోతైన అధ్యయనం చేసేందుకు భాషా పరిశోధన వేదికను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. తెలుగు వారి సాంఘిక చరిత్రకు ఆద్యులైన సురవరం ప్రతాపరెడ్డి పేరును ఈ వేదికకు పెట్టినట్టు మండలి బుద్ధ ప్రసాద్ వెల్లడించారు.
తెలుగు తల్లి ప్రత్యేక దూతలు..: ఈ మహాసభలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరూ తెలుగు తల్లి ప్రత్యేక దూతలుగా, భాషోద్యమ లక్ష్యసాధకులుగా మారాలని అభిలషిస్తున్నట్టు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కార్యదర్శి డాక్టర్ జి.వి. పూర్ణచందు పేర్కొన్నారు. గ్రామాల స్థాయి నుంచి శక్తివంతమైన తెలుగు వేదికలు ఏర్పాటు చేసి, అందరిలో భాషపై ఆసక్తిని పెంచే కార్యాచరణకు ఈ మహాసభల్లో ప్రణాళిక రూపొందించనున్నట్టు తెలిపారు.

ఈ సభల్లో ప్రసంగాలు వుండవు…
ఈ సభల్లో సాహిత్య ప్రస్తావన ఉన్నప్పటికీ… భాషా పరిరక్షణ, భాషోద్యమ నిర్మాణమే ప్రధాన ఉద్దేశం. భాషాభిమానం కలిగిన ప్రతి ఒక్కరినీ ఆహ్వానించామని. అనూహ్య స్పందన వచ్చిందని. 1600 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఎంతో మంది మమ్మల్ని సంప్రదించినా నమోదు చేయలేకపోయాం. వసతులు, వనరులు సరిపోకపోవడమే కారణం. ప్రారంభ, ముగింపు వేడుకల్లో తప్ప సదస్సులో ప్రసంగాలు ఉండవని. విషయ ప్రతిపాదన, దానిపై చర్చ సాగుతుందని. తీర్మానాలు చేస్తారని. చివర్లో తీర్మానాలన్నీ ఒక చోటుకు చేర్చి, సభ ఆమోదం పొందుతామని. ఈ మహాసభల వేదికపై నుంచే ప్రపంచ తెలుగు రచయితల సంఘం స్వరూప, స్వభావాలు, కార్యాచరణను ప్రకటిస్తామని కార్యదర్శి జి.వి. పూర్ణచందు తెలిపారు.

మొత్తం 15 సదస్సులు
మూడు రోజుల మహాసభల్లో ఇతర కార్యక్రమాలతో పాటు 15 సదస్సులు ఉంటాయి. ఈసారి సదస్సుల్ని అంశాలవారీ కాకుండా, రంగాలవారీ నిర్వహిస్తున్నారు. సభలకు ఇతర రాష్ట్రాలతోపాటు, మారిషస్, మలేసియా, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి ప్రతినిధులు వస్తున్నారు. విదేశీ ప్రతినిధులతోనే ప్రత్యేకంగా ఒక సదస్సు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో తెలుగు భాష పరిరక్షణ కోసం కృషిచేస్తున్న వారిని, సమాఖ్యల ప్రతినిధుల్ని కూడా ఆహ్వానిచారు. ఇతర రాష్ట్రాల నుంచి 100 మంది వరకు వస్తున్నారు. ఈ మహాసభలకు రాష్ట్ర అధికార భాషా సంఘం సహకారం లేకపోవడం వెనుక ఇతర కారణాలేమయినా వున్నాయా? అంటే ప్రభుత్వం ఇటీవల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం ఒక కారణం కావచ్చునని భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

పూర్తి సమాచారంతో 52 పేజీలలో ఆహ్వానపుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో మూడురోజులు జరగబోయే కార్యక్రమాలతో పాటు జీవిత సభ్యుల, వార్షిక సభ్యుల పేర్లు ప్రచురించడం అభినందనీయం

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link