2026 మార్చి 27 ప్రపంచ రంగస్థలం సందర్భంగా ప్రసిద్ధ దర్శకుడు విలియం డెఫో ఇస్తున్న సందేశం.
“రంగస్థలం (నాటకం) ఒక సజీవ కళ. అది కేవలం కొన్ని సంభాషణలతో ఒక రచనను ప్రదర్శించడం మాత్రమే కాక వాస్తవంగా ప్రత్యక్షంగా మనుషులు కలుసుకునే ప్రదేశము, కూడిక.
వేదిక మీద జరిగేది ఒక ప్రత్యేక ఘటన. అది ఆ క్షణంలోనే కనబడుతూ పుడుతుంది. దాన్ని అలాగే మరొకసారి పునః ప్రదర్శన చేయలేం. ప్రతిసారి కొత్తగా పుడుతుంది. నటీనటులు తమ ఆంగికం వాచకం ద్వారా ప్రదర్శన ఇస్తున్నప్పుడు ప్రేక్షకులతో ఒక జీవంతమైన సంబంధాన్ని నిర్మిస్తుంది.
ప్రేక్షకులు కూడా- నిశ్శబ్దంగా స్తబ్దుగా చూసే మూగ ప్రేక్షకులు కారు. వాళ్ళు స్పందిస్తారు. ఆత్మిక అనుభవం పొందుతారు. ఒక సామూహిక అనుభవంలో వారు భాగస్వాములు అవుతారు. తక్షణం వర్తమానంతో పెనవేసే అనుభవం. అదే రంగస్థలం.. నాటకం యొక్క అసలైన శక్తి.
మనం అనుక్షణం మార్పుకు లోనవుతున్న ప్రపంచంలో జీవిస్తున్నాం. సాంకేతికంగా వస్తున్న మార్పులు మనల్ని కలిపి ఉంచుతున్నట్లు కనిపించినా.. అదే సమయంలో అది మనల్ని ఒకరి నుంచి ఒకరిని విడదీసి దూరం పెంచుతున్నది కూడా! ఇలాంటి పరిస్థితులలో రంగస్థలం మనల్ని ఒక దగ్గర చేరుస్తున్నది, ఒక ప్రదేశానికి రప్పించి కూర్చోబెడుతున్నది. ఎందుకంటే మనమంతా కలిసి ఒకే రకమైన సామూహిక అనుభవం పొందడానికి.
రంగస్థలం మనకు వినడం నేర్పుతుంది. అది మన లోపల భయాలను,మన ఆశలు సందేహాలు మన సంఘర్షణలను బయటకు తీస్తుంది. మనల్ని ప్రశ్నించడానికి స్వాగతిస్తుంది.
మనం ఎవరం? ఎలా జీవిస్తున్నాం? మనం మనుషులుగా బాధ్యతగా జీవించడంలోని అర్ధాన్ని, అవసరాన్ని వివరిస్తుంది.
రంగస్థలం ఒక అద్దం లాంటిది. అది మన నిజస్వరూపాలను మనకు చూపెడుతుంది. అలా కేవలం మన ప్రతిబింబాన్ని చూపడమే కాకుండా సంభావిత మార్పు సాధ్యమేనని సూచిస్తుంది.
ఎన్నో విధాలుగా విభాజితమై ఉన్న మన ప్రపంచాన్ని కలిపే వారధిలా నిలుస్తుంది. అది మనల్ని కలిపి ఉంచి, మన అనుభవాలను పంచుకునే ‘ఒక ఆవరణను’ (స్పేస్) కల్పించి ఇస్తుంది. అదే ఇప్పటి రంగస్థల అవసరం.. ఆ అవసరం ఇప్పుడు ఎప్పటికంటే ఎక్కువగా ఉంది.
అనువాదం : మల్లేశ్వరరావు ఆకుల
(7981872655)
విల్లో(విలియం జేమ్స్) డెఫో
‘నాటకాత్మ పలికే స్వరం’
వేదిక వెలుగుల్లో నిలిచే నీడ కాదు ఆయన/
నీడలకే ప్రాణం పోసే స్వరం/
పాత్రను ధరించడం పాత్రలుగా మారిపోవడం/ నిశ్శబ్దంలోనూ పలికే సంభాషణలు/
కళ్లతోనే పలికించే కథనం/
అదే విలియం డెఫొ/ సినిమా తెరపై ఒక జ్వాల/ రంగస్థలం మీద ఒక అలమటించే ఆత్మ/
రెండిటి మధ్య వారధిగా నిలిచే కళాకారుడు/ ప్రయోగాల పథంలో నడిచే యాత్రికుడు/ సంప్రదాయాల సరిహద్దులు దాటి/
కొత్త భావాల కోసం వెతికే సాధకుడు/
మనిషి అంతః చేతనలో దాక్కున్న
అరుపులను/ ఆశలను అంధకారాల్ని/
వేదికపై వెలుగులుగా మార్చే మాంత్రికుడు/
అందుకే ఆయనకు నటన ఒక ప్రదర్శన కాదు/
ఒక అనుభవం/ ఒక క్షణం కాదు- ఒక జీవితకాల ప్రయాణం/ ఆయన స్వరం వినిపించినప్పుడు/
అది ఒక వ్యక్తి మాట కాదు/
నాటకం గుండెచప్పుడు/ ఆత్మ పలికిన ఒక నాటకీయ స్వరం/అతడే విలియం డిపో-
అమెరికన్ నటుడు/.
