ప్రపంచ రంగస్థల సంస్థ ఈ సంవత్సరం (మార్చ్ 27 2021) ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని హెలెన్ మిర్రేన్ ద్వారా ఇప్పించారు. ఆ సందేశం తెలుగులో….
“రంగస్థల ప్రదర్శన కళలకు ఇది ఒక గడ్డు సమయం. ప్రస్తుత క్లీష్ట సమయంలో కళాకారులు, సాంకేతిక వర్గం, నిర్మాణ వర్గం ఎన్నో ఇబ్బందులు చవిచూశారు. కొత్తగా సృజన చేయాలన్న తపన కలిగిన రచయితలు, రూపకర్తలు కళాకారులు గాయకులు స్త్రీ కళాకారులు,నటులు, సంగీత దర్శకులు, దర్శకులు అంతా ఒక ఊపిరాడని పరిస్థితిని అధిగమించి వీరంతా సమీప భవిష్యత్తులో కొత్త శక్తితో సరికొత్త అవగాహనతో, పని చేస్తూ, అనుభవాలను పంచుకుంటూ మళ్ళీ రంగస్థలాన్ని పునరుజ్జీవింప చేస్తారు.
ప్రస్తుత విపత్తు నుండి వీరంతా వారి వారి ప్రతిభా సామర్థ్యాలతో, బతుకుతూ- బతికిస్తూ, ముందుకు సాగుతారని ఆశిస్తాను.
ఇప్పటికే ఈ సంక్షోభానికి సంబంధించిన పరిస్థితులను, సమాచార మాధ్యమాల వినిమయం ద్వారా, ఆన్లైన్ విధానంలో పనిచేస్తూ సంభాషించుకుంటూ ఉన్నారు. వీటికి ఈ అవకాశం కల్పించిన అంతర్జాలానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఈ భూమి మీద మనిషి మనుగడ కొనసాగినంత కాలం పరస్పరం కథలు చెప్పుకున్నారు, చెప్పుకుంటూనే ఉంటారు. అందమైన ఈ రంగస్థల సుసంస్కృతి మనం ఉన్నంత కాలం అదీ బ్రతికే ఉంటుంది.
సృజనాత్మక కళాకారుడు ప్రస్తుత అననుకూల వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి కాకుండా, తాజా శ్వాసలతో నాటకరంగాన్ని పునః ప్రభవింప చేస్తారని ఆశిస్తూ.. ఈ సంఘీభావాన్ని మనమంతా కలిసి పంచుకుంటామన్న ఆశతో..
నేనైతే వేచి ఉండలేను..
హెలెన్ మిర్రేన్.
అనువాదం:
మల్లేశ్వరరావు ఆకుల