(మార్చి 27వ తేదీ ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా…)
1961వ సంత్సరం జూన్ నెల. అది హెల్సింకీ మహానగరం. ఫ్రాన్స్ దేశపు మహానగరాలలో ఎన్నతగినది. ఆ మహానగరంలోని అత్యంత విశాలమైన సభా మందిరంలో మధురంగా సాగుతోంది ప్రసంగం.
నాటకం జీవన చిత్రణం
నాటకం జీవిత ప్రదర్శనం
నాటకం జీవన సురాగం
నాటకం నవజీవన సందేశం.
సంక్షోభం నుండి ప్రశాంతతవైపు, ఆవేదన నుండి ఆనందంవైపు, విలాపం నుండి ఉల్లాసం వైపు, అంధకారం నుండి ప్రకాశం వైపు నడిపించేదే నాటకం.
అలా… అనర్గళంగా ప్రసంగిస్తున్న ఆ వక్త చిరునవ్వునవ్వేడు. అతడి చిన్ని నవ్వులో అనంతమైన భావాలు కనిపించాయి. అతడి నవ్వు ముఖంలో చెప్పలేనంత మధురమైన భావనేదో ప్రకటించబడుతోంది.
చిరునవ్వుతోనే ఆయన అన్నాడు కదా! సమస్త సాహిత్యానికి పరాకాష్ఠ నాటకమే. సాహిత్యంలోని అన్ని ప్రక్రియలు నాటకంలో వికసించినంతగా, నాటకంలో విన్పించినంతగా, కన్పించినంతగా మరి ఏ ఇతర సాహితీ రూపంలోగానీ కన్పించలేదు. సమస్త సాహిత్యానికి నాటకమే అంతిమ క్షేత్రం. ఒక్క నాటకం మాత్రమే… ఒక్క నాటకం మాత్రమే… మూడవసారి అధ్యక్ష స్థానంలో నున్న ఆ మహానుభావుడు ఈ మాట అంటున్నప్పుడు ఆ సభా మందిరమంతా ప్రేక్షకుల, శ్రోతల హర్షధ్వానాలతో ప్రతిధ్వనించిపోయింది. శ్రోతల ఆనందాతిరేక హర్షధ్వానాలతో మహాసభ అంతా పరవశించిపోయింది.
అంతటి అద్భుతమైన ప్రసంగంలో ప్రేక్షకుల హర్షధ్వానాలు సద్దుమణిగేదాకా ఆగి, తిరిగిన తన ప్రసంగాన్ని కొనసాగించాడాయన. ఆ అద్భుతమైన వ్యక్తి పేరు కార్లో ఆర్వే కివిమ్మా. ఫిన్నిష్ భాషలో ఎన్నో గొప్ప రచనలు చేసిన ప్రఖ్యాత రచయిత కార్లో.
టాంపీర్ థియేటర్ దర్శకుడిగా, హెల్సింకీ జానపద నాటకరంగ దర్శకుడిగా, ఫిన్నిస్ జాతీయ థియేటర్ ఉపాధ్యక్షుడిగా, జీవితమంతా నాటకసేవకు అంకితమై జీవిస్తూన్న కార్లో ఆర్వీ కివిమ్మా తన ప్రసంగాన్ని కొనసాగించాడు.క్రమక్రమంగా ఆనయ కంఠం రుద్ధమయ్యింది. ఆయన స్వరంలో దుఃఖం కన్పించింది. ఆయన స్మృతి విషాదభరితమైన గతంవైపుకు సాగింది.
మానవాళి పాలిట మహమ్మారిలా విరుచుకుపడి, లక్షలాది మందిని పొట్టన పెట్టుకొన్న రెండవ ప్రపంచ యుద్ధం ఆయన కళ్ళముందు కదలాడింది. మానవాళి చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటన రెండవ ప్రపంచ యుద్ధం. ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మారణహోమాన్ని కల్పించిన విషాద సన్నివేశం అది. కోట్లాదిమందిని భయంతో వణికించి, లక్షలాదిమంది ప్రజల జీవితాన్ని కబళించిన మృత్యుగీతం అది. స్వార్థరాక్షసి పద ఘట్టన క్రింద సామాన్య ప్రజల్ని అణచివేసిన వికృత నాట్యం అది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడాయన.
క్రమంగా..కార్లో గొంతు మూగబోయింది. ఆయన స్వరం వినబడటం లేదు. అయినా, ఆ సభామందిరంలోని సకల ప్రేక్షక సమూహం మౌనంగా ఆయన్నే పరికిస్తున్నారు. ఆయన హృదయంలో నుండి వినబడుతున్న ఆవేదనని, ఆయన స్వరంలో వినబడుతున్న దుఃఖాన్ని, వేదనాభరితమైన ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకుంటూ, ఆ విచిత్ర సన్నివేశంలో విస్మయానందభరితులైపోయారు. అదొక అపూర్వమైన ఘట్టం. అపురూపమైన సన్నివేశం.
కార్లో ఆర్వీ కివిమ్మా కళ్ళు తుడుచుకొన్నాడు. జీవితమంతా నాటకరంగ సేవలో చరితార్థుడైన నాటక తపస్వి సభికులందర్నీ ఒక ప్రశ్న అడిగాడు. మానవాళికి దుఃఖాన్ని, కష్టాన్ని, బరువును, బాధను శాశ్వతంగా తొలగించలేకపోయినా తాత్కాలికంగా మనుషుల మనసుల్ని తేలిక చేయలేమా? వారిని ఆనందంవైపు నడిపించలేమా! తేలిక చేయలేమా? మన నాటక కళాకారులం… మనవంటి నాటక కళాకారులం సమిష్టిగా లోకానికి ఆనందాన్ని పంచే యత్నం చేయలేమా? ఈ ప్రశ్నకు రంగస్థలోపాసకులైన సభాసదుందరూ అప్రయత్నంగా లేచి నిబడ్డారు. అసంకల్పితంగా అందరూ ఒకటిగా అరుస్తున్నారు. “అవును,అవును, చేయగలం, మనం చేయగలం.. మనం.. నాటక కళాకారులం.. ప్రపంచంలో మానవాళి కష్టాలు తొగించగలం, వారికి ఆనందాన్ని పంచగలం.
ఆ ఆడిటోరియం అంతా అర్థగంట వరకూ ప్రేక్షకుల ఉత్సాహాతిరేక జేజేలతో ప్రతిధ్వనించి పోయింది. అదిగో… అలా… 1961వ సంవత్సరం జూన్ నెలలో, పారిస్‌లోని హెల్సింకీలో ప్రఖ్యాత ఫిన్నిష్ రచయిత, కవి, నవలాకారుడైన కార్లో ఆర్వీ కివిమ్మా ప్రేరణతో ప్రపంచ నాటకరంగం ఏకమయ్యింది.
1962వ సంవత్సరం మార్చినెల 27వ తేదీన తొలి ప్రపంచ నాటకరంగ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రపంచ రంగస్థలశిక్షణాసంస్థ,ప్రతి ఏటా ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని, మార్చి 27న నిర్వహించే గురుతరమైన బాధ్యతని స్వీకరించి, 1962 నుండి నేటివరకూ అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది.
ఈ విశాల ప్రపంచంలోని నూరు దేశాలలో వైభవంగా జరిగే ఈ ప్రపంచ నాటకరంగ దినోత్సవంలో, ఒక గొప్ప భావన ఇమిడి ఉంది. నాటకం ద్వారా ప్రపంచ మానవుల్ని ఒక్కటి చేయాలని, వారి మధ్య గొప్ప అవగాహన కల్పించాని, పరస్పర సహకార భావనని ప్రోది చేయాలని, తద్వారా విశ్వశాంతికి దోహదం చేయాని సంకల్పించడం జరిగింది.
నిజానికి… ఇది ఎంత గొప్పమాట… ఎంత చక్కనిభావన. “నాటకంతో శాంతి,నాటకంతో విశ్వశాంతి”. నిజమే. నాటకం నిజంగా అంతగొప్పది. నాటకంతో నిస్సందేహంగా విశ్వశాంతి స్థాపన సుసాధ్యమే.
ఈ మహాప్రయత్నంలో భాగంగా, ప్రతియేటా ఒక రంగస్థల ప్రముఖుడ్ని ఆహ్వానించి, రంగస్థల దినోత్సవ సందేశం అందించడం జరుగుతుంది. ఆ సందేశాన్ని ఆ మహాసభలో సభికులతో పాటుగా ప్రపంచంలోని అన్నిదేశాల నాటకాభిమానులు, కళాకారులు దర్శిస్తారు. ఇరవై భాషల్లో ఆ సందేశం అనువదించబడి, ప్రపంచంలోని ఇరవై భాషల కళాభిమానుల చెంతకు చేరుతుంది.
1962లో తొలి ప్రపంచ నాటకరంగ దినోత్సవ సందేశాన్ని అందించే భాగ్యం ప్రముఖ రచయిత, రూపశిల్పి, నాటక రచయిత, నటుడు, నిర్మాత అయిన జె.ఎమ్.ఇ. క్లెమెంట్ కాక్‌టెయుకి లభించింది. దేశదేశాల మానవ సంబంధాల్ని నిలపడంలో, మలచడంలో నాటకానికి మించిన సాధనం మరొకటి లేదని ఎలుగెత్తి చాటాడు క్లెమెంట్.
ఏటేటా ప్రపంచ నాటకరంగ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించడంలో, ప్రపంచ శాంతి స్థాపనతో బాటుగా మరో నాలుగు అంశాలకు కూడా సముచితమైన ప్రాధాన్యత ఉంది. మొదటిది, నాటకరంగ విజ్ఞానాన్ని, ప్రపంచంలో వ్యాప్తి చేయడం. ఒకదేశం యొక్క నాటకరంగం గురించి మరొకదేశానికి, ఒక ప్రాంతం యొక్క నాటకరంగ కృషిని మరొక ప్రాంతానికి వివరించడం, విస్తరింపచేయడం. ఇక రెండో లక్ష్యం గురించి మాట్లాడవలసివస్తే, ప్రపంచ కళాకారులపట్ల సహకారాన్ని అందించడం, సహృదయంతో తోడ్పడటం, మరీముఖ్యంగా… మూడవది… నాటక కళాకారుల పట్ల, ప్రపంచ కళారూపాల పట్ల పరస్పర అవగాహన కల్పించడం. ఇక… నాల్గోది, ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధానాంగాలలో ఒకటైన యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక విభాగం) యొక్క ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చే దిశలో పరిపూర్ణమైన సహకారం అందించడం, ఇక చివరగా… వర్ణ వివక్షతని ఖండించి, జాతి, మత, కుల, వర్ణ, వర్గ వివక్షతకు వ్యతిరేకంగా సర్వసమానతని బోధిస్తూ కళారూపాలను రూపుదిద్దడం.
ఈ ఏటి ప్రపంచ రంగస్థల దినోత్సవం.. ఈ రోజు సాయంకాలం పారిస్ లోని యునెస్కో హాల్ లో జరుగుతోంది.ఈ ఇదు దేశాల నుండి ఐదుగురు నాటక ప్రముఖులు తమ సందేశాలను అందిస్తున్నారు.అందులో మన భారత దేశ నాటక ప్రముఖులు..పద్మశ్రీ రాంగోపాల్ బజాజ్ ప్రముఖులు.బీహార్లోని ధర్భంగాకు చెందిన రాంగోపాల్ ప్రముఖ నటులు,దర్శకులు,రచయిత..వీరికి హిందీ అకాడమి జాతీయ పురస్కారం కూడా ఇచ్చింది.వీరితో పాటుగా లెబనాన్ దేశం నుండి మాయ జిబ్ ,యునైటెడ్ కింగ్డమ్ నుండి సైమన్ మెక్ బర్నే,మెక్సికో నుండి సబీన బెర్నాన్, ఐవరీ కోస్ట్ నుండి వేరే వేరే లైకింగ్..ఇలా ఐదుగురు అతిధులు ఈ రోజు ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవంలో పాల్గొంటున్నారు..
మిత్రులారా! ఒక్కసారి ఆలోచించండి. లోకం దృష్టిలో, నాటక రంగానికి ఎంత గౌరవం ఉందో, నేను చెప్పలేను గానీ, లోకం నాటక రంగాన్ని ఎంతవరకూ పట్టించుకొంటోందో, నేను వివరించలేను గానీ… నాటకరంగం మాత్రం అనుక్షణం లోకశ్రేయస్సు కోసమే తపిస్తోంది. మానవాళి అభివృద్ధికే అంకితమవుతోంది. ఇది సత్యం… సత్యం… సత్యం…
ప్రతీ ఏటా మార్చి 27వ తేదీన, నూరు దేశాల నాటకరంగ కళాకారుల, కళాభిమానుల, దర్శక నిర్మాతల, సాంకేతికుల, సహాయకుల సమిష్టి ప్రయత్నమే ప్రపంచ రంగ స్థల దినోత్సవం. ఈ సదాశయాన్నే మరొక్కమారు స్మరిస్తూ, నాటకరంగం మానవాళి సేవకు, విశ్వశాంతికి పునరంకితమవుతోంది. విషాదం నుండి వసంతం వైపు మానవాళిని నడిపిస్తోంది.
ఇంతకన్నా మనకు భాగ్యమేముంది?
దీనికి మించిన అదృష్టమేముంది?
శాంతిని కోరడం కన్నా కర్తవ్యమేముంది?
విశ్వశ్రేయస్సు తోడ్పడడం కన్నా తపస్సు మరేముంది?
– వాడ్రేవు సుందర్రావు
మీ సమీక్షా చాలా బాగుంది. అన్ని విషయాలు కూలంకషంగా వివరించారు. నమస్సుమాంజలి.
అన్ని విషయాలు కూలంకషంగా పొందుపరచారు. సమీక్షా చాలా బావుంది. నమస్సుమాంజలి.