
“వెయ్యి సార్లు వినడం కన్నా ఒక్క వాక్యం చదవడం మేలు. వెయ్యి వాక్యాలు చదవడం కన్నా ఒక్కసారి చూడడం మేలు” అని లోక నానుడి ఉంది. అంటే యాత్రల వలన ఎంతో అనుభవం, విజ్ఞానం వస్తుందనేది నిర్వివాదాంశం.
అసలు మొదటగా ఈ యాత్ర అనే శబ్దం ఎలా వచ్చిందో చూద్దాం. “యాన్తి అస్యామ్ ఇతి యాత్రాయా- ప్రాపణే” అని సంస్కృతం లో దీనికి వ్యుత్పత్తి ఉన్నది. మనుస్మృతి కాలం నాటికి యాత్ర అంటే రాజులు పొరుగు రాజ్యాలపై దండెత్తి పోరు సర్పి విజయం పొందడానికి చేసే జైత్రయాత్ర, విజయయాత్ర. అనే అర్థంలో ఉండేది.
కాలక్రమేణా అది తీర్థయాత్ర అన్న అర్థంలో విస్తరించబడింది. యాత్రల వలన ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, ఆహార విశేషాలు, వేష భాషలు, సంప్రదాయాలు వంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ప్రపంచం వన్య భాషల, భిన్న ఆకారాల, భిన్న మతాల సమాహారం. కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తెలిసిన ఆశ్చర్యకర విషయాలను యాత్రికులైన మహానుభావులు కొందరు అక్షర రూపంలోకి మలిచారు. వారి కళ్ళు చూసిన అత్యద్భుత సౌందర్యాలను, వారి గుండెల్ని తాకిన ఆశ్చర్యకర సంఘటనలను, హృదయ స్పందనలను అక్షరీక రించారు. ఇటువంటి యాత్రా చరిత్రల వలన మనకీనాడు ఎంతో విషయ పరిజ్ఞానం లభిస్తున్నది
ప్రతి ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పర్యాటక ప్రాముఖ్యత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువల గురించి అంతర్జాతీయంగా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ టూరిజం డేను నిర్వహిస్తారు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు మొదటిసారిగా 1980లో ‘ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని’ సెప్టెంబర్ 27న నిర్వహించడం ప్రారంభించారు. అప్పట్నుంచీ – ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సప్ట్‌తో నిర్వహిస్తున్నారు. 1980లో – ‘టూరిజం కంట్రిబ్యూషన్ టు ది ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అని పేరు పెట్టారు. ఇలా ప్రతి ఏడాది ఒక్కో అంశాన్ని తీసుకుని టూరిజం పట్ల పర్యాటకుల్లో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఆయా చారిత్రక విషయాలను పదిలపరచుకోడానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నారు.
ఎప్పుడూ ఒకే చోట కూర్చుని చేసిన పనే చేస్తూ, చూసిన వారినే చూస్తూ ఉంటే ఏముంటుంది? ఇక ఈ జీవితం ఇంతేనా.. ఇంకేం లేదా అనిపిస్తుంది. జీవితం అనే డైలీ సీరియల్ లో కూడా అప్పుడప్పుడు కాస్త విరామం అనేది ఉండాలి. ప్రతీ ఒక్కరికి ఏవో బాధలు ఉండొచ్చు, ఎవేవో కష్టాలుండొచ్చు. వాటన్నిటి నుంచి మనసు ప్రశాంతత పొందాలంటే… డైలీ రొటీన్ నుంచి రిఫ్రెష్ కావాలంటే ఒక కొత్త ప్రదేశం చూడాలి. ఒక చిన్న టూర్ వేయాలి.
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడి అందాలు చూసి మనం మానసిక ఉల్లాసమే పొందడం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కూడా. అక్కడి మనుషులు, వారి సంస్కృతి, వారి జీవనోపాధి ఏంటి ? ఎలా సంపాదిస్తున్నారు? ఎలా బతుకుతున్నారు.? ఈ చిన్న ప్రయాణం మనపై ఎలాంటి మంచి ప్రభావం చూపింది? అనే ఉద్దేశ్యాలతో ప్రతీ ఏడాది సెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
పర్యాటక రంగంలో మనది వెనుకబాటే!
అత్యధిక జనాభా గల దేశాల్లో మనది రెండోస్థానం. ప్రపంచ ఆర్థిక శక్తుల్లో మనది ఐదో స్థానం. పర్యాటక రంగంలో మాత్రం మన దేశం మొదటి పదిస్థానాల్లో ఎక్కడా చోటు దక్కించుకోలేదు. ఏటా వచ్చిపోయే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ప్రాతిపదికన చూసుకుంటే 2018 నాటికి భారత్ 34వ స్థానంలో ఉంది. అంతకు ముందు ఏడాది 40వ స్థానంలో ఉండేది. ఏడాది వ్యవధిలో కొంత మెరుగుదల సాధించినా, పర్యాటక రంగంలో భారత్ మరింత మెరుగైన ఫలితాలను సాధించాల్సి ఉంది.
ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో అత్యధికులు సందర్శించుకునే ప్రదేశాలు ఏవంటే..
ఆగ్రా: భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఎక్కువమంది ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను తప్పనిసరిగా సందర్శించుకుంటున్నారు. ప్రపంచంలోని ఏడువింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను చూడటమే లక్ష్యంగా పెట్టుకుని ఇక్కడకు ప్రత్యేకంగా వచ్చే పర్యాటకులు కూడా ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. తాజ్‌మహల్ చూడటానికి వచ్చే పర్యాటకులు ఆగ్రాలోను, చుట్టుపక్కల ఉండే పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించుకుని వెళుతున్నారు.
ఢిల్లీ: ఆగ్రా తర్వాత భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల తాకిడి ఢిల్లీలో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశ రాజధాని అయిన ఢిల్లీని చూడటానికి విదేశీయులు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడి చారిత్రక కట్టడాలైన ఇండియా గేట్, ఎర్రకోట, కుతుబ్ మీనార్, లోటస్ టెంపుల్, అక్షర్‌ధామ్, రాష్ట్రపతి భవన్, పురానా ఖిల్లా వంటి ప్రదేశాల్లో విదేశీ పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తారు.
జైపూర్: రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ నగరానికి కూడా విదేశీ పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. ‘పింక్ సిటీ’గా పేరు పొందిన జైపూర్ నగరంలో రాజపుత్రుల గత వైభవానికి నిదర్శనంగా నిలిచే చారిత్రక నిర్మాణాలను తిలకించేందుకు విదేశీ పర్యాటకులు అమితంగా ఆసక్తిని చూపుతుంటారు.
హంపి: దక్షిణాదిని సందర్శించుకునే విదేశీ పర్యాటకుల్లో అత్యధికులు కర్ణాటకలోని హంపిని తప్పనిసరిగా సందర్శించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడి పురాతన చారిత్రక శిథిల నిర్మాణాలు, విరూపాక్ష ఆలయం వంటి ప్రాచీన ఆలయాలతో పాటు ఆర్కియలాజికల్ మ్యూజియం, పాత రాజప్రాసాదం వంటి ప్రదేశాలను సందర్శించుకుని వెళుతుంటారు.
గోవా: భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల్లో సముద్రతీరంలో విలాసంగా సేదదీరాలనుకునే వారు ఎక్కువగా గోవాకు వస్తుంటారు. విందు వినోదాలకు కొదువలేని గోవా ‘పార్టీ కేపిటల్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందింది. ఇక్కడ దొరికే సంప్రదాయ వంటకాల రుచులను ఆస్వాదించడానికి, క్యాసినోల్లో పార్టీలు చేసుకోవడానికి ఇక్కడకు వచ్చే విదేశీయులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.
ముంబై: భారత్ వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపే ప్రదేశాల్లో ముంబై కూడా ఒకటి. భారత ఆర్థిక రాజధాని అయిన ముంబై హిందీ సినీ పరిశ్రమకు కూడా కేంద్రం. ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులు విక్టోరియా టెర్మినస్, గేట్ వే ఆఫ్ ఇండియా, హజీ అలీ దర్గా, ఫిలింసిటీ వంటి ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శించడానికి ఇష్టపడతారు.
మైసూరు: దక్షిణాది వచ్చే పర్యాటకుల్లో విదేశీయులను అమితంగా ఆకట్టుకునే నగరం మైసూరు. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అద్భుతమైన చారిత్రక కట్టడాలను విదేశీ పర్యాటకులు అమితంగా ఇష్టపడతారు. మైసూరు ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్, మైసూర్ సాండ్ స్కల్ప్చర్ మ్యూజియం, కరంజి సరోవరం వంటి ప్రదేశాల్లో విదేశీ పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తారు.
వారణాసి: ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన వారణాసి ‘భారత ఆధ్యాత్మిక రాజధాని’గా పేరుపొందింది. గంగాతీరంలో వెలసిన కాశీ క్షేత్రం నిరంతరం తీర్థయాత్రికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. భారత ఆధ్యాత్మిక జీవనశైలిపై ఆసక్తి గల విదేశీ పర్యాటకుల్లో ఎక్కువ మంది తప్పనిసరిగా వారణాసిని సందర్శిస్తుంటారు.
అరుణాచల్ ప్రదేశ్: ఈశాన్య భారత్‌లో విదేశీ పర్యాటకులు అత్యధికంగా సందర్శించుకునే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. దేశంలోనే అతిపెద్ద బౌద్ధారామమైన ‘త్వాంగ్’ బౌద్ధారామాన్ని దర్శించుకునేందుకు విదేశాల నుంచి వచ్చే బౌద్ధులు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి కొండలు, కోనలతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి పులకించిపోతుంటారు.
కేరళ: ‘దేవుడి స్వదేశం’గా ప్రాచుర్యం పొందిన కేరళకు విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువే. దక్షిణాదిలో విదేశీయులను అత్యధికంగా ఆకట్టుకునే రాష్ట్రంగా కేరళనే చెప్పుకోవచ్చు. తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో పురాతన కట్టడాలు, ఆలయాలను సందర్శించుకోవడానికి, వాయనాడ్‌లోని కొండ కోనల్లోను, కొల్లాం వంటి సముద్ర తీరాల్లో సేదదీరడానికి మాత్రమే కాదు, ఆయుర్వేద చికిత్సల కోసం కూడా పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు కేరళకు వస్తుంటారు.
డా. ఏ. శ్రీనివాసరెడ్డి