ప్రేమ అంత మధురం

“ఎవ్వరికీ ఇవ్వనంతవరకే హృదయం విశాలంగా వుంటుంది. ఒకసారి ఇచ్చాక ఇరుకైపోతుంది. ఇంకెవ్వరికీ ఇవ్వనంటుంది”; “ఒకరికిస్తే మరలిరాదు. ఓడిపోతే మరచిపోదు. గాయమైతే మాసిపోదు. పగిలిపోతే అతుకు పడదు” (ప్రేమనగర్); “తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా… మనసు కొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా… ఆడవాళ్ళు ఆడుకొనే ఆటబొమ్మ ఈ మగవాడు… ఆడుకున్న ఫరవాలేదు, పగులగొట్టి పోతారెందుకో” (ఆడబ్రతుకు)… ఈ డైలాగులు, ఈ పాటల పల్లవులు, చరణాలు ఇంతగొప్పగా అలతిపదాలతో రాయగల ఒకేఒక మన’సు’కవి ఆచార్య ఆత్రేయ. అందుకే ఆయన అక్షరాలు బీజాక్షరాలు. అవి స్వర్ణార్ణవం నుంచి వెలికితీసిన అమృతాక్షరాలు… నిత్య సత్యాలు…. శాశ్వతంగా నిలిచిపోయేవి. అసలు ఆత్రేయ పాటల్ని ఈ ధోరణిలో రాయడానికి ఏదో ఒక కారణం వుండాలిగా. ఎక్కడో దెబ్బతిన్న హృదయం తనది. ఫలించని ప్రేమ దీనికి కారణం కావచ్చు. ఆత్రేయ పదహారేళ్ళ వయసులో స్కూలు ఫైనల్ చదివేటప్పుడు పద్మావతి అనే అమ్మాయిని ప్రేమించారు. ఆమెను అందరూ ‘బాణ’ అనే ముద్దుపేరుతో పిలిచేవారు. ఆ ప్రేమించబడిన ‘బాణ’ సగోత్రీయురాలు కావడంతో తండ్రి వారి పెళ్ళికి అభ్యంతరం చెప్పారు. దాంతో తను కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరగలేదు. అలా ‘బాణ’ ఆత్రేయ జీవితంలో అడుగిడలేకపోయింది. ఆమెకు వేరే సంబంధం చూసి ఆమె పెద్దలు పెళ్లిచేశారు. తరవాత టీనేజిలోనే (1940) మరో ‘పద్మావతి’తో ఆత్రేయకు వివాహం జరిగినా ‘బాణ’ మాత్రం తన మనసుకు తొలి గాయం చేసిందని ఆత్రేయ సన్నిహితులతో చెప్పుకునేవారు. పైగా ‘బాణ’ వీణ వాయించడంలో నేర్పరి. ఎవరైనా స్నేహితులవద్ద వీణ ప్రసక్తి వస్తే ఆత్రేయ ఉద్వేగానికి గురై చిన్నపిల్లాడిలా ఏడ్చేవారు. అందుకే ఆత్రేయ రాసిన ‘’వీణలోనా తీగలోన ఎక్కడున్నదీ నాదము అది ఎలాగైనది రాగము… మాటలోనా మనసులోనా ఎక్కడున్నదీ భావము… అది ఎప్పుడవును గానము” వంటి వీణ పాటల్లో ఆర్ద్రత వినిపించేది. కట్టుకున్న భార్యకు కొంత దూరమైన తరవాత ‘నల్ల కమల’ అనే వివాహితను చేరదీసి ఆమెతో సహజీవనం చేశారు. ఆమె కుటుంబ భారాన్ని తానే మోశారు. ఆత్రేయ ‘ప్రేమ’ను నమ్మిన వ్యక్తి. ఎక్కడో ఒక పాటలో ‘’ప్రేమకన్నా త్యాగం మిన్న… అది మిగిలిపోనీ నా జీవితాన… నన్ను రగిలిపోనీ నీ ప్రేమలోన” అంటూ రాసుకున్నారు.

‘ప్రేమ’ అనే రెండక్షరాల మాటకు ఆత్రేయ ఎన్ని నిర్వచనాలు చెప్పారో! ‘ప్రేమ’ అనే సినిమాలో ‘’ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ… ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ… ప్రేమ దివ్యభావము… ప్రేమ దైవరూపము… ప్రేమ జీవరాగము… ప్రేమ జ్ఞానయోగము’’ అంటూ ఆ దివ్య ప్రేమకు నిజమైన ఆర్ధం చెప్పారు. ప్రేమంటే ‘’మనసున పారే సెలయేరు వంటిదని, అలసట తీర్చే చిరుగాలి వంటిదని, అందమైన ప్రేమకు హద్దులేవీ వుండవని, జన్మలు ఎన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే” అంటూ తనదైన శైలిలో ప్రేమకు నిర్వచనం చెప్పిన మహాపండితుడు ఆత్రేయ. లేతవయసులో తన హృదయంలో చిగురించిన అమాయకపు ప్రేమను గురించి ఒకానొక పాటలో రాస్తూ “ప్రేమకన్నా పాశముందా, పెంచుకుంటే దోషముందా… తెంచుకుంటే తీరుతుందా, పంచుకుంటే మరచేదా” అంటూ వాపోయారు. మరొకదగ్గర “ప్రేమకు మరణం లేదు దానికి ఓటమి లేనేలేదు… అది ఓడి గెలుచుకుంటుంది, చావులోనూ బ్రతికుంటుంది” అని ప్రేమ విలువను తెలియజేశారు. సినిమాలలో పాటలు, మాటలు రాస్తున్న సమయంలో కూడా ఆత్రేయ ప్రేమ వ్యవహారంలో దెబ్బతిన్నారు. ఆ విషయాన్ని కొన్ని పాటల్లో నిక్షిప్తం చేశారు. వాటిలో ఒకటి బాబూ మూవీస్ వారి కన్నె మనసులు చిత్రంలో రాసిన ‘’ఓ..హృదయం లేని ప్రియురాలా’’ అనే పాట. ఆ పాటలోని ఒకానొక చరణంలో “నీ మనసుకు తెలుసు నా మనసు… నీ వయసుకు తెలియదు నీ మనసు … రాయి మీటితే రాగం పలుకును… రాయికన్న రాయివి నీవు… కసాయివి నీవు” అంటూ క్షోభించారు. మరోకచోట “నేనొక ప్రేమ పిపాసిని… నీవొక ఆశ్రమవాసివి… నా దాహం తీరనిది… నీ హృదయం కదలనిది” అని ప్రేమభిక్ష కోసం తపించారు. మరొకరైతే హృదయం కరగనిది అని రాసివుండేవారు. కానీ ఆత్రేయ మాత్రం కదలనిది అని రాసి తనదైన శైలిని ప్రదర్శించారు. తన తొలి ప్రేమ సుందరి “బాణ”ను తలచుకుంటూ “లతవై, నా జతవై, గతస్మృతివై, నా శ్రుతివై, స్వరజతివై, లయగతివై, నను పాలించవా…. చెలివై, నెచ్చెలివై, చిరుచలివై, కౌగిలివై, కౌగిలిలో జాబిలివై నను మురిపింపవా’’ అంటూ ఆమె మనసుతోనే విన్నవించారు… ప్రేమను! ప్రేమకు రూపంలేదు కానీ ప్రేమ లేదని అనగలమా? అందుకే ఆత్రేయ “ప్రేమ లేదని, ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని, నన్ను నేను చాటనీ… గడియపడిన మనసు తలుపుతట్టి చెప్పనీ… ముసురుగప్పి మూగవోయిన మనసుని” అంటూ ప్రేయసికి నీరాజనాలు అర్పించారు. ఒకానొక సందర్భంలో తన స్నేహితులకు ఒక ఉదంతం చెబుతూ “ప్రేమకు ద్రోహం చేసి అమాయకురాలైన శకుంతలను దుష్యంత మహారాజు మోసం చేశాడని మహాకవి కాళిదాసు తన ‘అభిజ్ఞాన శాకుంతలం’ కావ్యంలో గొంతెత్తి ధైర్యంగా చెప్పలేకపోయాడు. అలా చెప్పివుంటే కాళిదాసు తల అక్కడికక్కడే నేలరాలివుండేది. ఎందుకంటే, ఆ నాటకం ఆడేది రాజు కొలువుకూటంలో. అందుకు ఒక చిన్న పిట్టకథను సృష్టించి రాజునే సమర్ధించాడు కాళిదాసు. అది మహాకావ్యం కావచ్చు. కానీ, దాని వెనకవున్న కవి పిరికితనాన్ని నేను హర్షించలేను” అని అభిప్రాయపడ్డారు.

అందుకే ఆత్రేయ రాసిన “అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషిపని” అనే పాట అంటే దర్శకనిర్మాత పి. పుల్లయ్యకు ఆరో ప్రాణం! అంతేకాదు అక్కినేని నటజీవితంలో పూర్ణాయువు నింపుకున్న పాట కూడా!! అయితే ఆత్రేయకు మాత్రం ఇది తన ప్రేమ యాత్రకు ‘పాట విడుపు’.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

SA: