ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి -సాహితీ సంస్థలు

చలపాక ప్రకాష్ గారు కవి, కథకులు, కార్టూనిస్ట్ మరియు పత్రికా సంపాదకులు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల 7 వ తరగతితో చదువుకు స్వస్తి పలికి, కుల వృత్తి అయిన గోల్ద్డ్ స్మిత్ రంగంలోకి ప్రవేశించి, అటు రచయితగానూ వృత్తి-ప్రవృత్తిలను రెండు కళ్ళుగా భావించి అవిశ్రాంత కృషి సల్ఫి బహుముఖ రంగాళ్ళో రాణిస్తున్న చలపాక ప్రకాష్ గారి మనసులో మాటలను తెలుసుకుందాం….

ప్రశ్న: ముందుగా మీ బాల్యం, విద్యాభ్యాస విశేషాలు వివరించండి?

జవాబు: నేను క్లాసులకెళ్ళి చదివింది 7వ తరగతి మాత్రమే. కటుంబ ఆర్థిక లేమిస్థితి కారణంగా నేను చదువు మధ్యలోనే ఆపేసి నా వృత్తిలోకి రావలసివచ్చింది. కాని చదువుమీద వ్యామోహంతో నా పెళ్లైన తరువాత పని చేసుకుంటూనే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బి.ఏ, ఆ తరువాత ‘రైటింగ్ ఫర్ మాస్ మీడియి ఇన్ తెలుగు’ పిజి డిప్లొమా కోర్సు, ఆ తరువాత ఎం.ఏ. (తెలుగు) వరకు చదివాను.

ప్రశ్న: అసలు మీరు రచనలు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? దానికి ప్రేరకులు ఎవరు?

జవాబు: నా చిన్నతనంలో టి.వి.లు, ఫోన్లు లేవు. రాత్రి నిద్రపోయేటప్పుడు మా నానమ్మ జానపద కథలు, రామాయణం, భారతం వంటివి ప్రతిరోజూ సీరియల్గా చెప్పేది. అలా చెప్పడం వలన కథలమీద కుతూహలం పెరిగింది. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచింది. నా ఊహలకు కథలు రాయాలనే ఆశమాన్ని రగిలించింది. అలా మొదట్లో చందమామ, బాలమిత్ర, బాలభారతి వంటి చిన్నపిల్లల పత్రికలు, జానపద నవలలు చదివేవాణ్ణి. మొదటిసారిగా అచ్చులో నా పేరు చూసుకోవాలనే తలంపుతో ‘బాలజ్యోతి’ పిల్లల మాసపత్రికకి లేఖలు రాసేవాడ్ని. అలా మొదటిసారి నా పేరు అచ్చులో చూసుకున్నాను. అలా మార్కెట్లో వచ్చిన ప్రతి పత్రికా కొని చదివేవాణ్ణి. అలా పత్రికలు తిరగేస్తున్నప్పుడు ‘కాజ హనిత-ఏలూరు” అనే ఆమె పేరు అన్ని పత్రికలలో తరుచుగా కనిపించేది. మా నాన్నగారు, పెదనాన్నగారు నా పఠనాభిలాషపై ఆసక్తిని గమనిస్తూ ఒక సందర్భంలో వాళ్లు మాట్లాడుకుంటున్నారు ‘ఆమె ఆడామె కనుక పత్రికల్లో పడుతున్నాయని మగవారికి అలా అవకాశాలుండవని’. దానిని ఛాలెంజ్ గా తీసుకొని నేనూ అన్ని పత్రికల్లో నాకు తోచిన రచనలు చేయడం ప్రారంభించాను. అలా నేను సాహిత్య రంగంలో లేఖా సాహిత్యంతో ప్రారంభించబడి, చాలా ప్రక్రియల్లో రచనలు చేయడం జరిగింది. నిజానికి సాహిత్యరంగంలో నా ఉన్నతికి ప్రత్యక్ష కారకులు మా నానమ్మ, కాజా హనిత. ఆ తరువాత మా నాన్నగారు, పెదనాన్నగారు… మా తాతగారు లక్కోజు కనకదుర్గాచార్యులు, మామయ్య లక్కోజు శ్రీనివాసరావు, బావ ఎల్.వి.ఎస్ దుర్గాప్రసాద్. వీరు ఆ రోజు నాకు ప్రోరీల్సిహం ఇవ్వకపోతే నేను ఏమాత్రం మిముందు నిల్చుండి వుండేవాణ్నికాను.

ప్రశ్న: కులవృత్తిలో కొనసాగుతూనే మీరు సాహిత్యాన్ని ఔపాసన పట్టారు. ఒక పక్క కులవృత్తి, మరోపక్క సాహిత్యం ఈ రెండింటిలో మీరు రాణించడానికి కారణమేమిటి?

జవాబు: మాకు మా తాతలు సంపాదించిపెట్టిన ఆస్తులేమీ లేవు. మా నాన్న గారి రెక్కల కష్టంపైనే మేమంతా ఆధారపడి బ్రతికేవాళ్ళం. ఆయన ఒక్కళ్లే చాలా కాలం కష్టపడి మా అందర్నీ పోషించారు. కాని ఆయనకు ఎవరో ఒకరు ఊతం కావాలి. అప్పుడు నన్ను చేతికిందకి పెట్టుకుంటే బాగుణ్ననిపించి ఆయనకు ఇష్టలేకపోయినా నా చదవు మానిపించి నన్ను మా కులవృత్తిలోకి ప్రేవేశపెట్టారు. అప్పుడు ఆయన ఒకమాట అనేవారు. ‘లక్ష్మీ ఉన్నచోట, సరస్వతి ఉండదు.. సరస్వతి ఉన్నచోట లక్ష్మీ ఉండదు. ఆ రెండు సరిసమానంగా రెండు చేతుల్లో బ్యాలెన్స్ చేసుకునే బ్రతికేవాడే సమాజంలో గొప్పోడవుతాడని’ అనేవారు. ఆయన మాటల్ని నేను తూచ పాటించాను. ఎందుకంటే ఎంత గొప్ప చదువు ఉన్నా డబ్బు లేకపోతే బ్రతకలేం కదా. ఆ రకంగా నేను కుటుంబ భారాన్ని మోయడం కోసం ఆసరాగా నిలబడవలసి వచ్చింది. ఆరకంగా పని చేస్తూనే నా రచనా వ్యాసంగాన్ని రాత్రివేళల్లో కొనసాగిస్తూ వచ్చాను… వస్తున్నాను.

ప్రశ్న: మీరు సాహిత్యంలో కృషి చేస్తూనే ‘రమ్యభారతి’ పత్రికను, ‘రమ్యభారతి’ సాహిత్య సంస్థను నడుపుతున్నారు. దాదాపు 20 ఏళ్ళుగా క్రమం తప్పకుండా పత్రిక వస్తూనే వుంది. విపుల, చతుర వంటి ఆర్థికంగా బలోపేతమైన పత్రికలే కరోనా కాలంలో ఆగిపోయాయి. ఈ సందర్భంలో మీ పత్రిక వస్తుందంటే కారణమేమిటి?

జవాబు: గతంలో ఒకానొక సందర్భంలో కొందరు మిత్రులతో కలిసి ‘మనోహరం’ అనే మాసపత్రికను నాలుగు నెలలపాటు నడపగలిగాము. నాకున్న సాహిత్య అనుభవంతో దానికి నన్ను ఎడిటర్గా నియమించారు. పత్రిక ఎదుగుతున్న క్రమంలో మిత్రులు మధ్య సమన్వయం లోపించి పత్రిక ఆగిపోవడానికి కారణమైంది. అప్పుడు నేను ‘కలసి’ చెయ్యడం వలన ఆగిపోయే ప్రమాదం ఉన్నదని గ్రహించి, నేనే ‘స్వంతం’గా ఒక పత్రికను పెట్టి వర్ధమానులకు ప్రోత్సాహం అందించాలన్న లక్ష్యంతో 2004లో ‘రమ్యభారతి’ని స్థాపించాను. ఈ పత్రిక రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వ అధికారుల అలక్ష్యం వలన ‘మొదట్లోనే హంసపాదు’గా నిరుత్సాహంతో ఉన్న సందర్భంలో, ప్రముఖ కవి సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు ఉద్యోగ రీత్యా విజయవాడకు ట్రాన్ఫపర్ అయ్యి రావడం వలన ఈ పత్రిక వెలుగులోకి రావడానికి ప్రధాన కారకులైనారు. ఆయన రాకుంటే ఆ పత్రిక ఇలా మీముందుకు వచ్చి ఉండేదే కాదు. ఆ తరువాత పలువురు సాహితీవేత్తల ప్రోత్సాహంతో వెను దిరిగి చూడవలసి రాకుండా పోయింది. అలా గత పందొమ్మిదేళ్ళుగా పత్రిక సక్రమంగా వెలువడుతూ వస్తోంది. ఒక్క నెల ఆలశ్యమైతే పాఠకులు, రచయితల నుండి ఫోన్లు రావడం ప్రారంభమవుతాయి. అంతటి ఆదరణ పాఠకుల నుండి రమ్యభారతికి పుష్కలంగా ఉంది. కరోనా కాలంలో పత్రికలు ప్రచురణకు నోచుకోకుండా ఉండి ఉండవచ్చు గాని, చతుర, విపుల వంటి పత్రికలు ఆగిపోవడానికి కారణం కరోనా ఏమాత్రం కాదు. అంతకుముందు నుండి ఉన్న ఆర్థిక లావాదేవిలు, పత్రిక నిర్వహణలో తరువాతి తరం యాజమాన్యానికి మక్కువలేకపోవడమే కారణంగాని, కరోనా కారణం కొంతమాత్రమే గాని, మొత్తంగా మాత్రం కాదు.

ప్రశ్న: ప్రపంచీకరణ వలన కులవృత్తులన్నీ నాశనమయ్యాయి. ఒకప్పుడు పెళ్ళిళ్ళకు స్వర్ణకారుడి దగ్గరకు ఊరేగింపుగా వచ్చి సంభావనలిచ్చి మంగళసూత్రాలు తీసుకొని వెళ్ళేవారు. ఇప్పుడవి లేవు. బంగారపు పనివాళ్ళకు పనులు లేక ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి కారణాలు చెప్పండి?

జవాబు: గతంలో కూడా జ్యూయలరీ షాప్లున్నాయి. కాని ఇంత పెద్ద స్థాయిలో మాత్రం కాదు. అయితే అప్పటి జ్యూయలరీ షాపులవారు స్థానిక పనివాళ్ళ చేత పనులు చేయించుకునేవారు. దాని కారణంగా స్థానికులకు చేతినుండా పని ఉండేది. కాని ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆక్రమిస్తున్న బడా పెట్టుబడీ వ్యవస్థలు ఇతర రాష్ట్రాలనుండి వస్తువులు దిగుమతి చేసుకోవడం వలన స్థానిక పనివాళ్ళకు పని లేకుండా పోయింది. అదీకాక మిషనరీ వ్యవస్థ అభివృద్ధి చెందటం, కొలకత్తా వంటి మహానగరాలనుండి తక్కువ జీతాలకు పనివాళ్ళను జీతాలకు పెట్టుకుని పనులు చేయించుకుంటూ ఉండటం వలన స్థానిక పనివాళ్ళకు పనులు లేకుండా పోయింది. ఇక ప్రజలకు ఈ బిజీప్రపంచంలో సంప్రదాయమంటూ మంగళసూత్రలు తీసుకెళ్ళడానికి స్వర్ణకారుడి ఇళ్ళకు వచ్చే సమయం ఉందంటారా? ఏమాత్రం లేనే లేదు. అయితే నిజంగా సంప్రదాయాలు పాటించేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ బ్రాహ్మణులు సైతం విశ్వబ్రాహ్మణుడి చేతే మంగళసూత్రం తయారు చేయించే నియమం కొందరు పాటిస్తున్నారు. ఇళ్ళకు వచ్చి స్వయంపాకం ఇచ్చి కొందరు, తమ పెళ్ళి ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి కొసరు కొసరు వడ్డించి మరీ సంప్రదాయం పాటించేవాళ్ళూ ఉన్నారంటే ఆశ్చర్యపోతారు. కాకపోతే అయితే అలాంటి వాళ్ళు లక్షలో ఒక్కరు.

ప్రశ్న: మీ తర్వాత ఈ వృత్తిని కొనసాగించేవారున్నారా?

జవాబు: లేరండీ. షెందుకంటే నాకు ఇద్దరూ ఆడపిల్లలే. మొగపిల్లలు లేరు. నా విషయంలోనే కాదు, ఇతర పనివాళ్ళ కుటుంబాలనుండి కూడా ఎవరూ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇప్పటి వర్కర్లే పనులు లేకపోవడం చేత ఆటో డ్రైవర్లుగానో, మెడికల్ సాపుల్లోనో ఇతర పనుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళ పిల్లల విషయంకి వస్తే, ఎలాగోలా కష్టపడి చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారు చేస్తున్నారు. మొన్నటివరకు మా వృత్తిలో విశ్వబ్రాహ్మణులు కులవృత్తి చేస్తుంటే, తర్వాత పద్మశాలీ కులస్థులు అధిక సంఖ్యలో ఈ పనిలోకి వచ్చారు. ఇప్పుడైతే పొరుగు రాష్ట్రాలనుండి వచ్చి సెటిలైన బెంగాలీల హవానే ఎక్కువగా ఉంది. తద్వారా స్థానికుల్లో భవిష్యత్ చేతిపని ఆలోచనల్లో పడింది.

ప్రశ్న: వచన కవితల్లో ‘నానీలు’, రెక్కలు మొదలైన ప్రక్రియలు వచ్చాయి. నానీలపై పరిశోధనకు మీకు కేంద్రప్రభుత్వం ఫెలోషిప్ ఇచ్చారు. వీటి గురించి వివరించండి!

జవాబు: మొదట్లో ‘నానీ’ ప్రక్రియగా రూపాంతరం చెందుతున్న క్రమంలో నేను అక్షర నియమానికి వ్యతిరేకిని. కాని అక్షర నియమ చట్రంలో కూడా కవిత్వ భావన కూర్చడం కూడా చాలా కష్టమని అర్థమయ్యింది. కవిత్వం చదివేవారి సంఖ్య తగ్గుముఖ పడుతున్న ఈ ప్రస్తుత బిజీ ప్రపంచానికి లఘు రూపాలు అవసరం ఎంతైనా ఉందని ఈ పరిశోధన ద్వారా అర్థమయ్యింది. కొత్త కవుల పుట్టుకకి, కవిత్వ శకలాలుగా పాఠకుల హృదయాలలో సూటిగా పేలడంలో ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకారి అనిపించింది. దీని మీద మొదట్లో పలు పత్రికలలో వ్యాసాలు రాసాను. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికలో కేంద్రసాంస్కృతిక శాఖ వారి ఫెలోషిప్ ప్రకటనను చూసి నేను అప్లై చెద్దామనుకున్నాను. మొదట్లో డాక్టర్ చలపాక ప్రకాష్ అని సంబోధించిన ఆ ప్రక్రియ సృష్టికర్త ఆచార్య ఎన్ గోపిగారే ఇది రాయడం కష్టమన్నారు. అలా అప్లై చెయ్యడంలో నిరుత్సాహంతో ఉన్న నన్ను చూసిన మిత్రులు చింతా లక్ష్మీ సుజాతా, ఎస్వీ కృష్ణ తీవ్ర ఒత్తిడి చేసి ‘వస్తే వచ్చింది, పోతే పోతుంది ముందు ప్రయత్నం చెయ్’ అని నాచేతి ఆ ఫెలోషిపి అప్లై చేయించారు. అలా వారి కారణంగా ప్రయత్నం చేయడం, రెండు నెలల్లోనే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నుండి ఫెలోషిప్కు ఎన్నికనట్లు పోస్ట్లో వచ్చిన లేఖ చూసి ఆశ్చర్యపోయాను. ఇక నా ఆనందానికి అవదుల్లేవు. మిత్రుల ప్రోద్భలం వల్ల అలా నేను ఈ పరిశోధన చెయ్యడానికి కారణమయ్యింది. ఆతర్వాత గోపి గారు కూడా జాతీయస్థాయిలో నానీ ప్రక్రియ పరివ్యాప్తికి కృషి చేసినందుకు నన్ను ఎంతో అభినందించారు. పరిశోధన పూర్తయిన తర్వాత మైసూరులోని ‘భారతీయ భాషా కేంద్రం’ వారు పుస్తకం వేసుకోవడానికి ఆర్థిక సాయం చేసి నా పరిశోధన పూర్తిగా ప్రజలలోకి వెళ్ళేలా సహకరించింది. పూర్తిగా రికమెండేషన్ ఉంటేనే ప్రభుత్వాల నుండి ఇటువంటి సహకారం అందదని అనేవారికి నాకు లభించిన ప్రభుత్వ సహకారమే చెంపపెట్టు. కృషి ఉంటే అన్నిచోట్ల సహకారం ఈరోజుల్లో లభిస్తుందని చెప్పడంలో నేను ఏమాత్రం సందేహించను. (చివరికి నేను డి.టి.పి నేర్చుకోవడానికి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్’ వారి సహకారం వల్లనే నేను నేర్చుకోగలిగాను.. దీనికీ ఎవరి సహకారం, రికమెండేషన్లు లేవు. కేవలం తెలుగులో అప్లై చెయ్యడం మాత్రమే నేను చేసిన పని.

ప్రశ్న: మీరు ‘విజయవాడ సందర్శనం’ అనే పుస్తకం ప్రచురించారు. వివరాలు చెప్తారా?

జవాబు: నేను పుట్టిన నేల గొప్పదనాన్ని గురించి ఇప్పటివారికి, భవిష్యత్ తరాలకీ అందించేరీతిలో ‘విజయవాడ చరిత్ర’ క్లుప్తంగా అందించాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలెట్టాను. కానీ రాష్ట్రం విడిపోయి విజయవాడ కేంద్రంగా రాజధాని ఏర్పాటు కావడంతో కొంతమేర మార్పులు చేసి రికార్డు చేద్దామనుకున్నాను. కాని కాలం కలిసిరాలేదు. అంతలో కరోనా రావడం, లాక్డౌన్ కారణంగా కావలసిన సమయం లభించడంతో ‘విజయవాడ సందర్శనం’ రాయగలిగాను. నేను కవిత/ కథ/ వ్యాసం/ సమీక్ష/ కార్టున్ / జోకులు ఇలా అనేక ప్రక్రియలలో నా స్వంత రచనలు చేసినా, నా జీవితంలో ‘అత్యాధిక ఆధునిక కవిత రూప ప్రక్రియ- నానీ’ ఫెలోషిప్, ‘విజయవాడ సందర్శనం’ చరిత్రకు అందించగలిగాననే తృప్తి నాకు కలిగింది.

ప్రశ్న: కథ, కార్టూన్, నానీ, కవిత్వం… ఇలా విభిన్న ప్రక్రియల్లో కృషి చేసారు మీరు. మీకు ఏ ప్రక్రియ ఇష్టమైంది

జవాబు: అయిష్టత ఉంటే ఆ ప్రక్రియలో ఎందుకు రచనలు చేస్తాను. అన్నీ నాకు నచ్చిన ప్రక్రియలే. కాకపోతే నాకు అబ్బనిది పద్యం, శతకం.

ప్రశ్న: విజయవాడలో ప్రతి సంవత్సరం పెట్టే పుస్తక ప్రదర్శనశాలలో రచయితలకొక స్టాలు ఉచితంగా వచ్చేలా ప్రయత్నించి విజయం సాధించారు. ఈ సంవత్సరం ఈ స్టాలు ఎందుకు లేదు?

జవాబు: ఇది నా ప్రయత్నం కాదండి. తెలంగాణ బుక్ ఫెయిర్లో రచయితలకు నామమాత్రపు రుసుముతో స్టాల్ ఇచ్చేవారు. అది చూసి విజయవాడ బుక్ ఫెస్టివల్ వారు గత రెండు సంవత్సరాలుగా ఒక సాహిత్య సంస్థచే రచయితల పుస్తకాలు ఉచితంగా అమ్ముకునేలా ఓస్టాల్ కేటాయించారు. గత ఏడాది ఏ సంస్థకో కాకుండా పూర్తిగా రచయితలు అమ్ముకునేలా ఉచితంగా నాలుగు స్టాళ్లు ఇచ్చారు. ఈ సంవత్సరం ఈ బుక్ ఫెస్టివల్ స్థలం మార్పు కారణంగా, స్థలం తక్కువగా ఉండడం వలన రచయితలకు కేటాయించబడలేదు. రచయితలకు ఉపయోగపడే ఏ విషయంలోనైనా నేను చేతనైన విధంగా ఎడ్యుకేట్ చేసి పోరాటం చేయడం, అందరికీ ఉపయోగకారి కావడంలో నావంతు పాత్ర పోషిస్తుంటాను.

ప్రశ్న: సమాజహితం కోసమే సాహిత్యం’ అంటారు. ‘విశ్వ క్రీయః కావ్యమ్’ అంటారు. అందరికీ మేలు చేయాల్సిన సాహిత్యం ఇప్పుడు ‘తన’, ‘మన’గా మారిపోయింది. కలుషితమైపోయాయి సాహిత్య రాజకీయాలు. ఈ తరుణంలో రచయితల కర్తవ్యాలేమిటి?

జవాబు: కొన్ని సాహిత్య సంస్థలు కూడా రాజకీయ పార్టీలులాగా మారిపోతున్నాయి. రచయితల సంఘాలెప్పుడూ ప్రజలకు, ప్రభుత్వానికి, రచయితలకు మధ్య వారధిగా ఉండాలి. కాని పదవుల కోసం పార్టీలు చీల్చి వేరు కుంపటి పెట్టినట్లు కొన్ని సాహిత్య సంస్థలు ఏర్పడుతున్నాయి. ఇది ఎంతమాత్రం ఎవరికీ మంచిది కాదు. రచయితలంటేనే మనుషుల్ని, మనస్సుల్ని దగ్గర చేయడం. తమ స్వార్థం కోసం స్నేహాల్ని తెంచడం కాదు.

ప్రశ్న: రాజులు కవులని పోషించారు ఇదివరకు. ఇప్పుడు ప్రభుత్వమే కవులని ప్రోత్సహిస్తుంది.. కానీ ప్రస్తుత పాలకపక్షం భాషను పట్టించుకోవడంలేదు. దీనిపై మీ స్పందన..?

జవాబు: తెలుగుభాషకుఈ ప్రభుత్వం తిలోదకాలిచ్చేసిందని చెప్పడంలో ఏమాత్రం సందేహించనవసరం లేదు. దానిపై భాషాభిమానులు ఉద్యమించాల్సిందే. ఇక రచయితల గురించి పట్టించుకోక పోవడం అంటూ ఏమీ లేదని చెప్పక తప్పదు. . గత కొన్ని సంవత్సరాల క్రితం రికమెండేషన్ బాగా పనిచేసేది. కాని కాలంలో మార్పు వచ్చింది. నిజాయితీ కనిపించడం కోసం కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. గత టి.డి.పి ప్రభుత్వం ఎదుగుతున్న కవులు, రచయితలు/ కళాకారులకు ప్రోత్సాహంగా ఉగాది పురస్కారాలు ఇచ్చారు. ప్రసిద్ధులకి ‘కళారత్న’ పురస్కారాలిచ్చారు. ఉగాది పురస్కారానికి పది వేలు, కళారత్నకి ముఫ్ఫై వేల గౌరవ పారితోషికం ఇచ్చేవారు. ఇప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం సినిమా వారికి ఇచ్చేంత గౌరవం,అత్యంత ప్రతిష్టాత్మక స్థాయిలో ‘వైఎస్ఆర్’ అవార్డులు ఇస్తూ వస్తోంది. దీనికి గౌరవ పారితోసికం అక్షరాల పది లక్షలు. ఇది విలువైన, గొప్ప పురస్కారమే కదా! అయితే ఇక్కడ జరుగుతున్నదేమిటంటే, 30 నుండి 70 మందికి ఇచ్చే ఉగాది పురస్కారాలు కింద, మధ్యస్థాయి కవులు, రచయితలకు ఇవ్వడం ఆపేసారు. కేవలం లబ్దప్రతిష్టులకు మాత్రమే సంవత్సరంలో 5 గురి నుండి 10 మంది వరకు ఇస్తున్నారు. గత సంవత్సరమైతే సాహిత్య రంగంలో కేవలం ఒక్కరికే ఇచ్చేరు. దీనివల్ల ఎక్కువమంది నిరుత్సాహంగా ఉండిపోతున్నారు. ఇక ‘ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ’ స్థాపించిదీ ప్రభుత్వం. కానీ గత 3 ఏళ్ళల్లో అకాడమీ ఒక్క కార్యక్రమం కూడా జరుప తలపెట్టలేదు. అలాంటప్పుడు అకాడమీ వేసి ప్రయోజనమేమున్నది. ఈ అకాడమీ ఏర్పరిచినప్పుడు కవులు, రచయితలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని అందరూ ఆశించారు. కాని ఫలితం మాత్రం సున్నా. ప్రభుత్వం ఇటువంటి విషయాలపై ఆలోచించేలా నేను పలు ప్రతికల ద్వారా అనేక వ్యాసాలు రాసాను, రాస్తూనే ఉన్నాను. నా సంకల్పం, రచయితలకు ప్రభుత్వం నుండి లభించవలసిన ఆర్థిక ప్రోత్సాహాలు చేరువ చేయడం, దాని విధి విధానాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం.

ప్రశ్న: తెలంగాణ ప్రభుత్వంలో సాహిత్య అకాడమీ నెలకో కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తుంది. ఈమధ్యనే కీర్తి పురస్కారాలు ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలు ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఎడారే. దీనికి కారణం?
జవాబు: చెప్పా కదా, ఇక్కడ ప్రభుత్వ విధానాలలో ఆలోచనా లోపం మాత్రమే. చెయ్యాలనే ఆశయం ఉందిగాని, దాన్ని ముందుకు నడిపించడంలో సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేకపోవడం. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొన్ని పదవులలో ఆయా రంగాలలో ప్రసుద్ధులైనవారిని నియమించకుండా, ఏమాత్రం అవగాహన లేని తమ పార్టీవారికి కట్టబెట్టడం. తెలంగాణాలో అయితే సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్ ఒక రచయిత కావడం వలన రచయితలకు ఏం అవసరమో ఆయనకు తెలుసు కనుక, అటువంటి కార్యక్రమాలు ఆయన రూపొందిస్తున్నారు. ఇక మొదట్లో తెలంగాణ వారి ప్రతిభకే పట్టంగడుతుందన్న విమర్శున్న పొట్టిశ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంవారు, ఇటీవల కాలంలో మార్పు చెంది తెలుగువారి అందరినీ సమదృష్టితో చూడడం అవార్డులిస్తూ ప్రోత్సహించడం మంచి పరిణామం. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ వారు కూడా తెలుగు సాహిత్య అకాడమీ సలహాదారులను, ఛైర్మన్ ఎన్నిక చేయడంలో కూడా అందరికీ అవకాశం కల్పించబడుతూ ఉండడం మంచి పరిణామం, అభినందించతగ్గ విషయమూనూ. ప్రతిభకు అందరూ సమానమే అనే భావం ఎప్పుడైతే కలిగి అందర్నీ నమ్మంచగలిగిందో.. అన్ని రంగాలూ సమానంగా అభివృద్ధి చెందితే… ఇక అసంతృప్తి అన్నది ఎక్కడ ఉంటుంది?

ప్రశ్న: మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జవాబు: ప్రజల్ని నా రచనలు/ ప్రక్రియల ద్వారా చైతన్యం కల్గిస్తునే, అలాగే తమ సమయాన్నీ, కష్టాన్ని వెచ్చించి రచనలు చేసే సాటి రచయితలకు ఉపయోపడేవిధంగా కృషి చేయడం. ఉదాహరణకు- రచయితలు ప్రచురించుకునే పుస్తకాలు ప్రభుత్వ కేంద్ర, జిల్లా గ్రంథాలయాలు కొనుగోలు చేసేలా చెయ్యడం, ప్రభుత్వాల నుండి రచయితలు ప్రచురించుకునే పుస్తకాలకు ఆర్థిక సహకారం లభించేలా కృషి చేయడం, ప్రతిభకు తగ్గవారికి ప్రభుత్వ పురస్కారాలు వర్తించేలా ఒత్తిడి తేవడం. అలాగే పుస్తకాలు ప్రచురించుకునే రచయితలు ప్రాథమిక కర్తవ్యాలైన – (కాపీరైట్ చట్టం ప్రకారం) నేషనల్ లైబ్రరీలలో తమ రచనల వివరాలు రిజిస్టర్ చేయించుకోవడంలో అవగాహన కల్పించడం… రచయితలకు పనికొచ్చే ఇతర విషయాలపై వర్క్షాప్లు నిర్వహించడం.

ప్రశ్న: కన్నడ, మళయాళాల్లో ఒక పుస్తకం, 5,6 సార్లు ముద్రింపబడుతుంది. ఆ స్థితి తెలుగు సాహిత్యంలో రావాలంటే ఏం చెయ్యాలి? మీరు ఆంధ్రప్రదేశ్ రచయితల సంస్థ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేస్తున్నారు…. రచయితల శ్రేయస్సు కోసం మీరు చేస్తున్న కృషి…?

జవాబు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వేరుపడినప్పుడు ఆంధ్రప్రదేశ్ సాహిత్యవేత్తలలోనే అదొకవిధమైన నిరుత్సాహం ఏర్పడింది. దీన్ని తొలగిస్తూ కొత్త ఉత్సాహం తెచ్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారేమోనని చూసాం. అయితే ఒకరిద్దరు ఆ ప్రయత్నం చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అటివంటి సందర్భంలో అప్పటికే గుంటూరు జిల్లా రచయితల సంఘం స్థాపించి జిల్లాస్థాయిలో అనేక కార్యక్రమాలు చేస్తున్న సోమేపల్లి వెంకటసుబ్బయ్యగారు, నేను ఓ ప్రయత్నానికి అడుగేసాం. అయితే అది కార్యరూపం దాల్చింది మాత్రం నేనూహించని దిశలో నన్ను ఆంద్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా మిగతా మిత్రులు ఎన్నుకోవడం. అదీ నాకన్నా సీనియర్ రచయితలు నన్ను ప్రపోజల్ చెయ్యడం. ఆ తరువాత అందరికన్నా నేను ఓ మెట్టు ఎక్కువేసి రాష్ట్ర రచయితల సంఘం ఏర్పాటులో 13 జిల్లాలూ తిరిగి స్థానిక రచయితలతో ముఖాముఖి ఏర్పాటుచేసి సంఘాన్ని బలమైన పునాది కల్పించడం జరిగింది. రచయితలు/ కవులకు వర్క్షాప్లు నిర్వహించాం. రాష్ట్రస్థాయి ఏకదినకవిసమ్మేళనాలు జరిపించాం. ‘రచయితలు/ ప్రచురణకర్తల ప్రాథమిక కర్తవ్యాలు’ పుస్తకాలన్ని ప్రచురించాము. ముఖ్యంగా రచయితల పుస్తకాలు గ్రంథాలయ సంస్థలు కొనుగోలు చేసేలా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అది జరిగేలా కృషి చెయ్యడంలో సఫలీకృతులమయ్యాము. ఇక రచయితల పుస్తకాలు 5, 6 ముద్రణలు జరుపుకునే ఇతర భాషల పుస్తకాల విషయం గురించి వస్తే, తెలుగులో ఆయా అవకాశం ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే పుస్తకాలు కొని చదివే అలవాటు ప్రస్తుత కాలంలో తగ్గిపోయింది. కేవలం ప్రభుత్వ గ్రంథాలయాలు పుస్తకాలు కొనుగోలు చెయ్యడం తప్పించి మరో మార్గం కనిపించటం లేదు. గతంలో ఇక్కడా ఒక రచయిత వెయ్యికాపీలు తక్కువ కాకుండా ప్రతులు ప్రచురించుకునేవారు. ఆకాలంలో రాజారామ్మోహనరాయ్ కొలకత్తా ఫౌండేషన్ వారు ఏటా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ద్వారా రచయితలపుస్తకాలు 350 వరకు కొనేవారు. ఇక జిల్లా గ్రంథాలయ సంస్థలు తమ నిధుల మేరా ఒక్కో జిల్లా 20 నుండి 80 కాపీలు కొనుగోలు చేసేవారు. అలా రచయితల పుస్తకాలు చాలావరకు అమ్ముడయ్యి పోయేవి. కాని నేడు రాష్ట్రం చీలిపోయిన తరువాత తెలంగాణ వారు ఆర్ఆర్ఆర్.ఎల్.ఎఫ్ నిధులతో 50 కాపీలు కొనుగోలు చేస్తున్నారు గాని, ఆంద్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఆ నిధులు రప్పించుకోవడంలో ఏమాత్రం ముందడుగు వేయలేక పోతుంది. అయితే జిల్లా గ్రంథాలయ సంస్థల ద్వారా గత ఏడాది నుండి పుస్తకాలు కొనుగోలు చేస్తూ వస్తోంది.

ఏది ఏమైనా గతకాలంలో కవులు, రచయితల ప్రతిభను గుర్తించి రాజులు ధన, కనక, వస్తు, అగ్రహారాల స్థాయిలో సైతం ఇచ్చి పోషించేవారు. నేడు కూడా అరునూరైనా ప్రభుత్వాలే ఆ బాధ్యత తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజలను నిత్యం చైతన్యం చేసి, సమాజం మంచి దారిలో పయనించే దిశగా ప్రతిక్షణం కృషిచేసే రచయితలు/కవులకు ఆమాత్రం కూడా చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు. ప్రజలకోసం ఆలోచించే రచయితలు/కవుల బాగోగులు ఆర్థిక వెసులుబాటు ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు. ఒక్కసారి ఆలోచించండి… ఒక నెలపాటు ప్రపంచంలోని రచయితలు/ కవులు తమ రచనలు చెయ్యకపోతే సినిమాలు/ టి.విలు, సెల్ఫోన్లు వగైరా వైగరా ఏమైపోతాయి. నిజానికి తల్లిదండ్రుల తరువాత గురువును ఆ సరసన చేరుస్తారు. కాని రచయితనే ఆ సరసన చేర్పాలంటాను నేను. ఎందుకంటే గురువు చెప్పే పాఠాలు కూడా ఒక రచయిత రాసిందేనని గుర్తుపెట్టుకోవాలి. అలా రచయిత రాసిన పాఠ్యాంశాన్నే గురువు విద్యార్థికి నేర్పిస్తాడు. అలా తలిదండ్రుల తరువాత స్థానం రచయితేనని ఎవరు గుర్తిస్తారు?

-మందారపు హైమావతి

2 thoughts on “ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి -సాహితీ సంస్థలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap