బహుముఖ ప్రజ్ఞాశాలి “సాహిత్య” చంద్రలత

“కొందరంటారు ప్రేమంటే…
అది లేతరెల్లు పొదలని ముంచెత్తే నదీ ప్రవాహమని
కొందరంటారు ప్రేమంటే…
అది నీ మనసును రక్తమోడేలా గాట్లు పెట్టే చురకత్తని”

ఇది చంద్రలతగారి ఆయువు పాటలోని ఒక పాట. తమిళ, జర్మనీ, ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్, ఆఫ్రికన్, కరీబియన్, అమెరికన్, గ్రీకు పాటలను అనువాదం చేసిన అజరామరమైన పాటల సంపుటి ఈ పుస్తకం. సాధారణంగా ఇంద్రధనుస్స౦టే సప్తవర్ణమాలిక, కానీ చంద్రలతగారు అనేక రంగుల విభిన్న వర్ణాల మాలిక. కథ, నవల, కవిత, వ్యాసం అనువాదం ఇలా సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో రచనలు చేసారు. బాలరచయితల పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఎన్నో రచనలకు సహరచన చేసారు. సంకలనకర్తగా బాధ్యతలను నిర్వహించారు, పరిశోధన చేసారు.

పిల్లలంటే మార్కులు గ్రేడులు ఉత్పత్తి చేసే మరయంత్రాలు కారని, సృజనాత్మక శక్తులు విరబూసిన కుసుమాలని నిరూపిస్తూ ప్రభవ బడిని నిర్వహించారు. పుస్తకాల షాపు నడిపారు. చిన్నారులంటే గుడ్డిగా పాఠాలు బట్టీ పట్టడమే కాదు పాటలు కూడా అల్లగలరని, కవితలు, కథలు, చెప్పగలరని నిరూపించారు.
వర్ధని, రేగడి విత్తులు, దృశ్యాదృశ్యం, నీలంపురాశి, నవలలు, నేనూ నాన్ననవుతా, ఇదం శరీరం, వివర్ణ౦ వంటి కధా సంపుటాలు రచించారు.
విరిగిన అల, పట్టు పువ్వులు, పిల్లనగ్రోవి, ప్రియమైన అమ్మా నాన్నా, పిల్లల కలాలకు సంపాదకత్వం వహించారు. ‘మడత పేజీ, ప్రభవ’ e-రచన చేసారు.

బహుముఖ ప్రజ్ఞా వంతురాలైన ఈమెను అనేక పురస్కారాలు వరించాయి. బాల సాహిత్యంలో అశేష కృషి చేసినందుకు డా. మంగా దేవి పురస్కారం, తానా పురస్కారం, ఎన్.టి.ఆర్. పురస్కారం తెలుగు యూనివర్సిటీ వారి ఉత్తమ గ్రంధ రచయిత్రి అవార్డు పొందారు. కథ రాసినా, వ్యాసం రాసినా చదివించే చక్కని తెలుగు ఆమె సొంతం. వేసవి కాలం సాయంకాలం అరచేతుల్లో విచ్చుకొన్న మల్లెపూల పరిమళంలా చంద్రలత గారి శైలి పరమ మనోహరం మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి నెల్లూరులో ఆవిడ ఇంటికి వెళదాం పదండి !

*మీ మొదటి రచన…
జ) ఎందరో రచయితలాగానే, అనుకోకుండానే రాయడం మొదలెట్టాను. బడిలో ఉన్నప్పుడు, పది పదకొండేళ్ళ వయసులో వ్యాసాలు, కవితలు, గేయాలు, రాసేదానిని. వ్యాసాలు, కవితలు, గేయాలు, రాసేదానిని, (1981-85), అవన్నీ బడిపిల్లలు రాసేటటువంటి ఉద్వేగభరిత రచనలే. వ్యాసరచనలో తరుచు ప్రథమ బహుమతులు వచ్చేవి. కథారచనలోనూ, కవితారచనలోనూ బహుమతులువచ్చినా, వ్యాసరచన అంటేనే ఇష్టం. దానాదీనా, బడిరోజుల్లో మా తరగతిలో చిన్నపాటి రచయితగా మా స్నేహితులు గారాబం చేసేవారు.
పత్రికలో అచ్చయిన మొదటి రచన కూడా వ్యాసమే. నెల్లూరు లోని స్థానిక పత్రిక, “లాయర్” లో జాషువా గారి “ప్రతిమలకు..” పద్యాన్ని విమర్షిస్తూ ఒక వ్యాసం అచ్చయ్యింది. ఆ విమర్షని ఖండిస్తూ, ఆ ప్రత్రిక సంపాదకులకు రాసిన సుధీర్ఘలేఖను, వారు వ్యాసంగా అచ్చేసారు. అదే నా మొదటి రచన (1991). ఆ తరువాతి వ్యాసం, మలాది సుబ్బమ్మ గారు సంపాదకులుగా ఉన్న “స్త్రీ స్వేచ్చ”లో అచ్చయ్యింది. వ్యాసరచననే కొనసాగించాను. వనిత, మిసిమి తదితర పత్రికలలో అచ్చయ్యాయి.

మొదటి కథ “వనిత” మాస పత్రికలో (మనోతేజ, 1993), మొదటినవల “చతుర’ లోనూ (వర్ధని, 1996) అచ్చయ్యాయి. మొదటి కథాసంపుటి “నేనూ నాన్న నవుతా” 1996లో ప్రచురించబడింది.

*మీ బాల్య విశేషాలు.. ఊరి ప్రత్యేకతలు.. అమ్మానాన్నల విశేషాలు…
జ) కృష్ణా తుంగభద్రల నడుమనున్న నడిగడ్డ ప్రాంతంలో, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్నలకు నడిపిబిడ్డను. నాన్నగారు కోటపాటి మురహరిరావుగారు (1933-2011). అమ్మ సరోజిని దేవి. ఇద్దరూ విద్యావంతులు. నాన్నగారు ప్రగతిశీలరైతు, వ్యాపారవేత్త, వితరణశీలి. మానవవాది. అమ్మ ఆధునిక పత్రికాసాహిత్యాన్ని, ఆకాశవాణిని పరిచయం చేసింది. నాన్నగారు చరిత్రను, బౌద్ధాన్ని, తాత్విక హేతుబద్ధతను వ్యవసాయాన్ని, సాహిత్యాన్ని మరెన్నిటినో పరిచయం చేసారు.

*వ్యవసాయ నేపథ్యంగా రేగడివిత్తులు నవలకు ప్రేరణ ఏమిటి?
జ) వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరగడమే. హరితవిప్లవం మా పొలాల్లోకి బహుశా నేను పుట్టినప్పుడే ప్రవేశించింది. అప్పుడు విశ్వవిద్యాలయాల వారు పొలాల్లోకి విస్తరిస్తున్న వారి ప్రయోగాల “ల్యాబ్ టు ల్యాండ్”ను అందిపుచ్చుకొన్న రైతులలో మా నాన్న గారు ఒకరు. సజ్జ, జొన్న, మొక్కజొన్న వంటి మెట్ట పంటలతో.
హరిత విప్లవ పితామహుడు, నార్మన్ బోర్లాగ్, పపువా, స్వామినాథన్ వంటి వారు మా పొలాలను పలుమార్లు సందర్షించారు. నాన్న గారు కర్షక మేళాలను, రైతు సదస్సులను నిర్వహించేవారు. శాస్త్రవేత్తలకు తరుచు మా ఇంట్లో బస ఏర్పాటు చేసేవారు. ఆ విధంగా, ఆనాటి వ్యవసాయరంగంలో వస్తోన్న మార్పులన్నీ మా ఇంట్లో ఒక భాగం. అవన్నీ చూస్తూ పెరిగాం. అలాగే, దేశవాళీ పంటల నుంచి వ్యాపార పంటల వైపు రైతాంగాం మొగ్గు చూపుతున్న కొద్దీ, ఆ ప్రభావం అనాదిగా ఉన్న వ్యవసాయ కుటుంబాల వ్యవసాయ సంస్కృతిపై పడింది. ఆ నవల రాసేప్పటికి నాకు పాతికేళ్ళు. అంటే, నా ఊహ వచ్చిన నాటి నుండి ఆ రెండు దశాబ్దాలలో మా నడిగడ్డ ప్రాంతంలోని వ్యవసాయ రంగంలో వచ్చిన అనివార్యమైన మార్పులను పాఠకులతో పంచుకొనే ప్రయత్నం చేసాను. అది “రేగడి విత్తులు” నవల అయ్యిది.

*పరిశోదాత్మక నవల “నీలంపు రాశి” కి నేపథ్యం ఏమిటి?
జ) మా పూర్వీకుల స్వగ్రామం గూడవల్లి. మా నాన్నగారి తరంలో మేము నడిగడ్డకు వెళ్ళి స్థిరపడ్డాం. అందుచేత, గూడవల్లి నాకొక ఊహ గూడవల్లి లోంచి వెళ్ళే దండుబాట గురించి తరుచు ఆసక్తికరమైన విశేషాలు చెబుతూ ఉండేవారు. మరింత తెలుసుకోవాలని అనుకొనేదానిని, ముఖ్యంగా చారిత్రక ప్రసిద్ధ గ్రామాలన్నో ఆ దండుబాట కు ఇరువైపులా ఉన్నాయి. ఇటు చందోలు అటు భట్టిప్రోలు పొరుగూర్లయిన మా గూడవల్లి ప్రాంతచరిత్రను గ్రంథస్థం చేయాలని నాన్నగారు అనుకొనేవారు. అది వారికి వీలుపడలేదు.

“రేగడి విత్తులు” రాసినపుడు వ్యవసాయ కుటుంబాల సంస్కృతిని ప్రభావితం చేసిన వ్యాపారపంటలు ప్రత్తి, తేయాకు,కాపీ,పొగాకు, మిరప… ఇలా ఎన్నో నా అధ్యయనం లోకి వచ్చాయి. వీటన్నిటి లోనూ ఏది మొదటి వ్యాపార పంట అన్న ఆసక్తి తో అధ్యయనం మొదలుపెట్టాను. అప్పుడు తెలిసింది. ఆధునిక కాలాల్లో, ప్రపంచవిపణి లో ప్రధమంగా నిలిచిన మొదటి భారతీయ వ్యాపారపంట, నీలి పంట అని, దండుబాట కు ఇరువైపులనున్న గ్రామాలు నీలి నడవా (ఇండిగో కారిడార్) లో ముఖ్యమైన భాగమనీ. మా తాతముత్తాతలు నీలి పండించి ఇచ్చిన వారని అర్ధమయింది. అలా మొదలయిన పరిశోధన, నవలగా మీ ముందుంది.

*ప్రచురణరంగంలో మీ అనుభవం ఏమిటి..?
జ) సాధారణంగా అందరు తెలుగు రచయితలాగానే, మొదటి కథాసంపుటాన్ని 1996లో స్వయంగా ప్రచురించాము. ముద్రణారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన, ‘ప్రింట్ ఆన్ డిమాండ్’ వంటి పద్ధతుల వలన, పరిమిత వనరులతో కొత్తపుస్తకాలు తీసుకు రాగలుగుతున్నాం.
తెలుగు పుస్తక విక్రయరంగంలో మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఒకే ధోరణి. ఒక వ్యాపారంగా చూస్తే, ఏ కొందరికో తప్ప గిట్టుబాటు వ్యవహారం మాత్రం కాదు.

అయితే, ప్రధానమైన మార్పు ఆన్ లైన్ బుక్ స్టోర్స్ వలన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుపాఠకులను నేరుగా చేరగలుగుతున్నాం. వేగంగా మారుతున్న సాంకేతిక మాధ్యమాల వలన ప్రచురణ రంగం మరింత సులువుగా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు కావాల్సినదల్లా, తెలుగు పుస్తకాలను కొని చదివే పాఠకులు.

*పుస్తకాల షాపు నిర్వహించారు కదా.. పుస్తకాలు బాగా కొనేవారా?
జ) ‘ప్రభవ’ ను 2008 లో ప్రారంభించాము. ప్రధానంగా తెలుగు ఇంగ్లీషు సాహిత్యాల పుస్తకాలు, పిల్లల పుస్తకాలు ఉండేవి. ఆరేడేళ్ళవరకు బాగానే కొనేవారు. మొదట, పిల్లల పుస్తకాలు కొనడం తగ్గుతూ వచ్చింది. ప్రభవకు వచ్చిన పిల్లలు పుస్తకం కావాలంటే, వారి పెద్దలు బొమ్మనో, బోర్డ్ గేమో కొనుక్కోమని ప్రోత్సహించేవారు ఆసక్తి గల పిల్లలకు ప్రభవలో కూర్చుని చదువుకొనే ఏర్పాటు కూడ చేసాం. రాను రాను పిల్లల పుస్తకాలు కొనడానికి గానీ, చదవడానికి వచ్చే వారు పూర్తిగా తగ్గి పోయారు. పైనుంచి, ఆన్ లైన్ బుక్ స్టోర్స్ వచ్చాక నేరుగా వచ్చే పాఠకుల సంఖ్య తగ్గిపోయింది. అందుకే, 2018 నుంచి ప్రభవ ఆన్ లైన్ బుక్ స్టోర్ మొదలెట్టాం.
ప్రభవలో పుస్తకాలు ఉన్నా, ప్రభవకు వచ్చి కొనేవారు పూర్తిగా తగ్గిపోయారు. ఊర్లో ప్రభవకి పొరుగున ఉన్నవారు కూడా, ఆన్ లైన్లో కొనుక్కొంటున్నారు.

*మీరు చదువుకొన్న బడి వివరాలు.. అప్పటి మధురమైన జ్ఞాపకాలు
జ) మా ఊరి వీధిబడిలో ఇసుకపలక మీద చదువు మొదలయింది. ఆ తరువాత, మహబూబ్ నగర్ లోని తిరుమల్ గేర్ మున్సి పల్ బడిలో ఒకటి రెండో తరగతులు, మూడో తరగతి నుంచి భారతీయ విద్యానికేతన్, హైదరాబాద్ లోని మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి.
బడికాలం అంతా మధురమైనదే. వర్ధని నవలకు స్పూర్తినిచ్చినది ఆ బడిరోజులే.

*నేటి విద్యావ్యవస్థలో మార్పు వస్తుందంటారా ?
జ) మార్పు అనేది అనివార్యం. ఇప్పుడు తెలుగువారం ప్రపంచవ్యాప్తం అయ్యాం. వివిధ విద్యావిధానాలలో తెలుగు పిల్లలు చదువుకొంటున్నారు. ఈ నేపథ్యంలో, స్థానిక విద్యా వ్యవస్థపై ప్రభావప్రమేయాలు తప్పనిసరి. అలాగే, సాంకేతికత చదువును సులువుగా అందుబాటు లోకి తెస్తోంది. అయితే, అది అందవలసిన వారికి అందేట్టు చూడడమే ఈ నాటి సవాలు.

*రిషీవ్యాలీ స్కూల్ వర్క్ షాప్ నిర్వహణలో మీ అనుభూతులేమిటి ?
జ) 2003 నుంచీ రిషి వ్యాలీలో తెలుగులో సృజనాత్మక రచనలో వర్క్ షాప్లు నిర్వహించాను. పిల్లలనుంచి నేనెంతో ప్రేరణ పొందాను. నేర్చుకొన్నాను.

*… అన్ని సాహిత్యప్రక్రియల్లో ఏది ఇష్టం ?
జ) నవల. ఎందుకంటే, అన్ని సాహిత్య ప్రక్రియలు నవలాకథనంలో అంతర్భాగం కాబట్టి.
కవిత, కథ, నాటకం, పాట, ఉత్తరం, డైరీ.. ఇలా అనేక సాహితీ ప్రక్రియలు నవలలో అంతర్భాగం.

* ఆయువుపాటకు ప్రేరణ ఏమిటి ?
జ) నాకు పాటలంటే ఇష్టం. సుబ్రహ్మణ్య భారతి గారి పాటను మా అబ్బాయి పరిచయం చేశాడు.
కథనశాస్త్ర అధ్యయనం చేసేటాప్పుడు కొన్ని పాటలు పరిచయం అయ్యాయి. పాట భాషకు, కాలానికి, ప్రాంతానికి అతీతంగా, ఎలా సజీవ సచేతనారూపంగా అలరించగలదో తెలుకోవాలని అనుకొన్నాను. అది ఆయువుపాట అయ్యింది.

* … ఈ ప్రయాణంలో సహకరించిన వారెవరు ?
జ) జీవితం.

* బి.టి. బ్రింజాల్ ..పై ఆసక్తికి కారణం.
జ) వ్యవసాయ రంగంతో ఉన్న సన్నిహిత సంబంధమే. అప్పటికి మా నాన్నగారు మన్సాంటో కంపెనీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
ఇంతలో బి.టి. వంకాయ వివాదం వచ్చింది. సహజంగానే, నేను ఆ వైపు దృష్టి సారించాను. పబ్లిక్ హియరింగ్ నాటికి ఆ పుస్తకం వెలువరించి, మా అభిప్రాయాన్ని వ్యక్తపరిచాము. డా. భార్గవ తదితరులతో సభ నిర్వహించాము.

* మీ చిరకాల స్వప్నం ఏమిటి ?
జ) పల్లెపట్టున పొలంగట్ల మీద పిల్లలతో చుట్టుముట్టిఉండడం.

* మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
జ) ఇప్పుడు చేస్తున్నవి కొనసాగించ గలగడమే.

ఇంటర్వ్యూ: మందరపు హైమావతి (9441062732)

1 thought on “బహుముఖ ప్రజ్ఞాశాలి “సాహిత్య” చంద్రలత

  1. బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్రలత గారి పరిచయం కొంత సమగ్రంగాను, మరికొంత అసంపూర్ణంగాను ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని విషయాలతో మరో భాగం రావాలని కోరుకుంటూ, పరిచయ కర్తకు, ప్రచురించిన సంపాదకునికి ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap