విద్య సాధించిన ‘విజయగీతం’

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్
విద్య విశిష్టదైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాలపూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే


ఈ పద్యానికి సాకార రూపం ‘చదువు తీర్చిన జీవితం’ ఆత్మకథ రచించిన కాళ్ళకూరి శేషమ్మ గారు. ఆవిడకు పట్టుదల, క్రమశిక్షణ రెండు కళ్ళు. ఎనిమిది పదుల వయసులో కలం పట్టి స్ఫూర్తి దాయకమైన స్వీయచరిత్ర రచించారు. ఒక సామాన్య మధ్యతరగతి ఇంట్లో పుట్టి బాగా చదువుకోవాలనే కోరికను నెరవేర్చుకున్న మహిళ.

2021లో నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ తిరువూరు కృష్ణా జిల్లా వారు నిర్వహించిన జీవిత చరిత్రల పుస్తకాల పోటీలో ఈ పుస్తకానికి అవార్డు లభించింది. పుస్తకం ముద్రించిన అనతి కాలంలోనే రెండవ ముద్రణ పొందడం ఈ పుస్తకం ప్రత్యేకత. ఆమె ఈ పుస్తకం ఒకటి రాసి చేతులు ముడుచుకొని కూర్చోలేదు. “షేక్స్పియర్ ను తెలుసుకుందాం”, “గలివర్ సాహస సాగర ప్రయాణాలు” (జోనాథన్ స్విఫ్ట్ గలివర్ ట్రావెల్స్ కు) అనువాదం చేసారు. 2019 నుండి ఆంధ్ర ప్రభలో డా. నాగసూరి వేణుగోపాల్ గారు నిర్వహించిన “గాంధీయం ఓ గాండీవం” కాలమ్స్ లో 7, 8 వ్యాసాలు రచించారు.

“సంచిక”లో ఎన్నో కథలు కూడా రాసారు. కాళ్ళకూరి శేషమ్మ గారి శైలి సరళ సుందరం. వాక్యాలు కమ్మెచ్చున సాగిన తీగల్లా సూటిగా వుంటాయి. “పద్యం’లో ఇమడాల్సిన అందం పద్యం ముందే తెరగా వాలిపోతుంది” అన్నట్లు తన వాక్యాలకు ఏ అందాలు, నగిషీలు చెక్కకుండానే నిరలంకారంగా రాస్తారు.
ఈనాడు సెల్ ఫోన్ లకు, ఇంటర్ నెట్ కు బానిసలై ఆబాల గోపాలం నిర్మాణాత్మక కార్యక్రమాలకు, సాహిత్యానికి దూరంగా మసలుతున్నపుడు ఈ వయస్సులోనూ జ్ఞానదాహంతో తపిస్తూ, ఎప్పుడూ చదవాలని రాయాలని తపించే శేషమ్మ గారికి పాదాభివందనం చేస్తూ ఆ అమ్మ చెప్పే విశేషాలు తెలుసు కోవడానికి కాకినాడలో వారింటికి వెళ్దాం పదండి..

పలకరింపు:>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ప్రశ్న: అబ్దుల్ కలాం కలలు కనండి అన్నారు. చాలా మంది కల లు కంటారు కానీ కలలు సఫలం చేసికోలేరు. కానీ బాగా చదువు కోవాలనే మీ కలను ఎలా నిజం చేసుకొన్నారు?
జ. అబ్దుల్ కలామ్ గారు Dream, dream big, but wake up and and work to make them true అన్నారు. నేను ఏ కలలూ కనలేదు. నేలమీద నిలబడి వాస్తవాలను పరిశీలించి అడుగు ముందుకు వేసేను. నా పరిధిలో ఎంతవరకు చేయగలనో అవి చేసేను. అవకాశములను ఉపయోగించుకున్నాను.

ప్రశ్న: కృషి వుంటే మనుషులు ఋషులౌతారు అంటారు. దానికి ఉదాహరణ మీరు.మీలోని పట్టుదలకు మీ రక్తం లోని జీన్స్ కారణం కావచ్చు.మీ తల్లి దండ్రుల దగ్గర నుంచి వచ్చి వుంటాయి. మీ తల్లిదండ్రుల గురించి చెప్తారా?
జ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నది చాలా పెద్ద మాట. నేను సామాన్యురాలను. ప్రతి మనిషికీ తన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు వుంటాయి. Educational psychology లో “personalities half heridity and half environment” అన్నారు. మన వ్యక్తి త్వం పై ప్రభావం చూపేవారు మన తల్లి దండ్రులే. నేను జొన్నలగెడ్డ వారింట్లో జన్మించడం నా పూర్వజన్మ సుకృతమని నమ్ముతాను. నా తండ్రి వైకుంఠ సత్యనారాయణ మూర్తి గారు, తల్లి మాణిక్యాంబ. వారిది మూడు వందల సంవత్సరాల నుంచి వస్తున్న ముచ్చటైన వంశ చరిత్ర.
తండ్రి గారి పూర్వీకులు వైవిధ్యమైన రంగాల్లో నిష్ణాతులు. ఆ కాలం లోనే మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో పట్టభద్రులు. కొందరు లాయర్లు, బ్యాంకర్లు, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు. మరికొందరు వ్యవసాయ రంగంలో నిపుణులు. విశేషమైన దైవభక్తి వారందరి బలం. తండ్రి గారు public works department లో ఇంజనీరుగా పని చేసారు. వారినుండి గ్రృహ నిర్మాణంలో మెలకువలు ఇటుకలు ఎంపిక ఇతర సామాగ్రిని ఎలా ఖరీదు చేయాలి గ్రృహం నిర్మించటానికి ఏ పనులు అవసరం నేర్చుకున్నాను. వారు విశేష దైవభక్తి కలిగి నిత్యం రుద్రాభిషేకం చేసుకునేవారు అంతేకాదు ఇంగ్లీషు భాషలో మంచి పట్టు, వ్యాకరణంలో దిట్ట, వాక్యనిర్మాణం, లెటర్ డ్రాఫ్టింగ్ వంటి విషయాల్లో నేర్పరి. అవి కూడా నేర్చుకున్నాను.

తల్లి గారు సమయపాలన కు, బహుముఖ ప్రజ్ఞకు ఆమె వరవడి. పాఠశాలల్లోను, కళాశాలల్లోను చదువు కోలేదు. నేను బి.ఏ. ఆర్ధిక శాస్త్రం చదివేను. ఆమె చెప్పినవే అక్కడ మూల సూత్రాలు. ఆశ్చర్యం కలిగింది వివేకం, ఆలోచన, ప్రణాళిక ప్రకారం జీవితాన్ని చక్క దిద్దుకొనుట ఆమె మాకు నేర్పారు.

ప్రశ్న: మీరు ఎక్కడ పుట్టారు? మీ బాల్య విశేషాలు గురించి వివరించండి?
జ. నేను కృష్ణా జిల్లాలో ని దివిసీమలోపులిగెడ్డ గ్రామంలో జన్మించేను. నాన్నగారి ఉద్యోగం లో బదిలీలు ఉండేవి. అనంతపురంలో వుండగా వారు రిటైర్ అయేరు.
నా బాల్యం 5 వ ఏట నాటి నుండి నాకు గుర్తు. తండ్రిగారు మాకు భారత రామాయణ కథలు, అప్పుడు నడుస్తున్న భారత స్వాతంత్ర్య ఉద్యమం, గాంధీ గారి పాత్ర ఇవన్నీ చెప్పేరు. దైవభక్తి, దేశభక్తి నేర్పేవారు. నాన్నగారి తరఫున అనేకమంది బంధువులు తరుచు మా ఇంటికి వచ్చేవారు. అమ్మ అతిధి మర్యాదలు చేసేవారు. అమృతతుల్యమైన భోజనం వండి ఆప్యాయంగా వడ్డించడం ఆమె ప్రత్యేకత.

ప్రశ్న: వివాహం వలన విద్య నాశనమవుతుందని అంటారు. కానీ మీరు పెళ్ళయ్యాకే చదువుకున్నా రు. మీ భర్త ప్రోత్సాహం గురించి చెప్తారా?
జ.వివాహం వలన విద్య నాశనమవుతుందని ఎవరో అన్నారు.పూర్వంఅది చాలా మంది ఋజువు చేసారు. ఆ తరువాత రోజు ల్లో అంతకన్నా ఎక్కువ మంది మహిళలు అలా కాదని నిరూపించారు.కొందరు పట్టభద్రులయితే ఎందరో వృత్తి విద్య, మేనేజ్మెంట్ మున్నగు కోర్సులు చేసారు. I.A.S. వంటి పరీక్షలు నెగ్గి పెద్ద పదవుల్లో రాణించిన వారూ వున్నారు. వారందరిముందు నేను చాలా తక్కువ. బి.ఏ., బి.ఇడి. చేసాను. నా భర్త గారు మొదట పెద్ద పట్టించుకోలేదు. అవును, కాదు అని అనలేదు. 16 సంవత్సరాలకు భర్త ఇంటికి వెళ్ళాను. 24 ఏట తొలి సంతానం. వారు ఉద్యోగ విధుల్లో రోజంతా గడిపినపుడు నేను ఒంటరిని కదా. చదువుపై దృష్టి వుంచాను.

ప్రశ్న: సాధారణంగా బాల్యం లోనే చదువు కుంటారు చాలా మంది, కానీ మీరు బాల్యదశ దాటాక, చదువుకున్నారు. స్వయంకృషితోనే విద్యావంతులయ్యారు. ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా?
జ. స్వయంకృషితో విద్య నేర్చుకోవడానికి కఠోరమైన క్రమశిక్షణ, సమయపాలన, ఎవరిదైనా ప్రోత్సాహం, వనరులు అవసరం. మొదటి రెండింటితో పాటు జ్ఞాపకశక్తి కూడా దేవుడు అనుగ్రహించాడు. విజయవాడలో వున్నపుడు మా మేనత్త గారి కుమారుడు శ్రీ వెలుతురు పిల్లి ప్రకాష్ గారు అక్కడే ఉద్యోగంలో వున్నారు. వారు పుస్తక ప్రియులు. నాకు చదువుపై గల ఆసక్తి వారికి నచ్చింది. వారింట్లో ఓ గది గ్రంథాలయమే. అలాగ నాకు నిధి లభించింది. వెన్ను తట్టిన మహనీయులు వారు. వారానికి రెండుసార్లు, నాలుగు మైళ్ళు నడచి వారి ఇంటికి వెళ్ళి ఉత్తమ సాహిత్య గ్రంథాలు తెచ్చుకునే దాన్ని. ప్రపంచజ్నానం కోసం పాత దినపత్రికలు కొన్ని తెచ్చి చదివే దాన్ని. తిరిగి జాగ్రత్తగా వారి కి అప్పచెప్పేదాన్ని.

ప్రశ్న: మామూలుగా మనం తెలుగు రాష్ట్రాల్లో పుస్తకాలు అచ్చేసి చేతులు కాల్చుకోవడమేనంటారు. కానీ మీ “చదువు తీర్చిన జీవితం” ప్రచురించిన సం. లోపలే ద్వితీయ ముద్రణ కు వచ్చింది కదా కారణమేమిటో ?
జ. అవును. మీరన్నది అక్షరసత్యం. తెలుగురాష్ట్రాల్లో ఎవరైనా శ్రమకు ఓర్చి శ్రద్ధపెట్టీ పుస్తకం వ్రాయాలి, ముద్రణకు పంపాలి. ఖర్చులన్నీ భరించాలి. తెలిసినవారందరికీ మనమే పోస్ట్ ఖర్చులు, కొరియర్ ఖర్చులు భరించి పుస్తకంప్రతులు పంపాలి.,”మీరు చదవండి మీ అభిప్రాయం, ఆలోచనలు దయచేసి తెలపండి” అని వేడుకోవాలి. ప్రార్ధించాలి. అలా ఎన్నిసార్లో. కొందరు సమాధానమే ఇవ్వరు.
నా ఆత్మకథ అనుకోని విధంగా ఎందరినో ఆకర్షించింది. ఎందరో ఆ కథలో మమేకమయ్యారు. కొందరు తమ తల్లిని, అమ్మమ్మను, బామ్మ గారిని అందులో చూసారు.

మా అమ్మాయి డా. కాళ్ళకూరి శైలజ కు జహీరాబాద్ లో నివసిస్తున్న డాక్టర్ విజయలక్ష్మి గారితో పరిచయం వున్నది. ఆమె పుస్తకం ప్రతులను పంపమన్నారు. అందుండి ఒకటి శ్రీ దేవినేని మధుసూదన్ గారికి ఇచ్చేరు. కథ మలుపు తిరిగింది. డా. విజయలక్షి గారు చేసిన ఈ పని నేను సర్వదా తలచుకుంటాను.
దేవినేని మధుసూదన్ గారు తమ “దేవినేని సీతారామమ్మ ట్రస్ట్ ద్వారా ఈ‌ పుస్తకాన్ని ప్రచురించి పదిమందికి అందిస్తామని శైలజను సంప్రదించారు. ఆ విధంగా మా జిల్లాకే గాక ఉభయ తెలుగు రాష్ట్రాలు వారికీ పొరుగున కర్నాటక, తమిళనాడు లలో వారికీ కొందరు విదేశీయులకు కూడా శ్రీ దేవినేని వారు ఈ పుస్తకం చేరవేశారు. వారికి సర్వదా కృతజ్ఞతలు. పుస్తక ప్రతులు అయిపోతున్నాయి. మూడవ ముద్రణకు వెళ్ళవచ్చు నేమో.

ప్రశ్న: మన సమాజంతో పాటు సాహిత్యమూ పురుషాధిక్య సాహిత్యమే. చాలామంది పురుషులు ఆత్మ చరిత్రలు రాసారు కానీ రచయిత్రులు తక్కువ. మీకు స్వీయ చరిత్ర రాయాలని ఎందుకనిపించింది?
జ. ఆత్మకథలు జనాదరణ పొందే విషయంలో స్త్రీ పురుషుల భేదాలతో పనిలేదు పదార్ధం ముఖ్యం. నేను ఎంచుకున్న పద్ధతి నిజం జీవితాన్ని యధాతధంగా చెప్పడం. సానుభూతి కోసం కష్టాలు ఏకరువు పెట్టలేదు. అసలు వానిని ప్రస్తావించలేదు. ఏపని చేయాలన్నా అవరోధాలు వస్తూనే వుంటాయి. ఓర్పుతో అధిగమించాలి. సానుభూతి కాదు సందేశం ఇవ్వాలి, చేతనయితే అని నా‌ అభిప్రాయం. జీవితచరిత్ర వ్రాయడానికి కారణాలు నా తరువాత మనుమలు, వారి పిల్లలు,కాళ్ళకూరి కుటుంబ సభ్యులు. వీరికి నేనెవరో తెలియాలి. ఆడపిల్లలు తాము చదువుకోలేదు ఆన్న నె‌పం తండ్రి, అన్నదమ్ములు, భర్త వీరి పైకి పెట్టి నిందించ రాదు. స్త్రీ కి ఓర్పు అవసరం.కష్టాలు అందరికీ వుంటాయి అంతమాత్రాన ఇంటికప్పు ఎక్కి అరవనవసరంలేదు. పెట్టె సర్దుకుని భర్త ఇల్లు వదలిపోనక్కరలేదు. సహనంతో ఏదైనా సాధించవచ్చు. ప్రవాహానికి పెద్ద చెట్లు, పడిపోతాయి. గడ్డి అలాగే తల వాల్చి గడచి బతుకుతుంది. ఇది నేటి ఆడపిల్లలు గమనించాలని నా అభిలాష.

ప్రశ్న: ఇంగ్లీష్ లో చాలా మంది కవులు, నాటక కర్తలు చాలా మంది ఉన్నారు. షేక్ స్పియర్ గురించే మీరెందుకు రాసారు?
జ. అవును. ఆంగ్ల భాషలో కవులు, నాటకకర్తలు అనేకులు న్నారు. వారిలో అగ్రగణ్యుడు షేక్స్పియర్. మహాకవి, నాటకకర్త. ఆంగ్ల భాషకు పుష్టి ని చేకూర్చేడు. విశేషమైన పదజాలం vocabulary పెంచేశాడు. స్వల్పకాలం జీవించి నా అత్యుత్తమ కళాఖండాల వంటి నాటకాలు సానెట్స్ వ్రాసేడు. అవన్నీ ప్రపంచంలోని పలు భాషల్లో నికి అనువదింపబడినవి. సుమారు ఈ మహనీయుని పేరు విననివారు, అతని నాటకాలతో పరిచయం లేని వారు వుండరు. మానవనైజాన్ని విభిన్న కోణాలలోంచి చూపిన మహనీయుడు. ఉత్తమవిలువలకు పట్టం కట్టేడు. స్త్రీ లను గౌరవించేడు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇంగ్లిష్ బోధించినపుడూ ఈ రచయిత పై ఇంకా గౌరవం పెరిగింది. అలరించే సంభాషణలు, కాలం విలువ తెలిపి, ఒక్క కవిత్వానికి మాత్రమే కాలానికి దీటుగా నిలబడే శక్తి వుందని చెప్పాడు. ఇవన్నీ మనవారికి చెప్పాలనిపించింది .

ప్రశ్న: షేక్స్పియర్ మీద పుస్తకం రాసాక మీరు లండన్ వెళ్ళారా, అంతకు ముందే వెళ్ళారా? అక్కడి అనుభవాలు చెప్తారా ?
జ. “షేక్స్పియర్ ను తెలుసుకుందాం” పుస్తకం రాయకముందే 2016 లో వెళ్ళేను. అప్పుడు ఇది వ్రాస్తానని కూడా అనుకోలేదు కానీ ఆ గ్లోబ్ థియేటర్ ఆ నాటకాలు ప్రదర్శించే ప్రదేశాలు చూస్తే ఎంత ఆనందమో నేటికీ ఏదో ఒక నాటకం అక్కడ ప్రదర్శిస్తూ వుంటారు. ఇంగ్లండ్ వెళ్ళేము. లండన్ నగర విశేషాలన్నీ చూసాము. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య రాజధాని (Sir Winston Churchill) నేడు గత వైభవం తగ్గింది.

ప్రశ్న: గలివర్ యాత్రలు కూడా అనువదించారు కదా. దీనికి ప్రేరణ ఏమిటండీ ?
జ. గలివర్స్ ట్రావెల్స్” నేటికీ ఆంగ్ల భాషలో మొదటి వంద క్లాసిక్ రచనల్లో నిలచింది. మూడు వందల సంవత్సరాల క్రితమే జొనాధన్ స్విఫ్ట్ నేటి మన సామాజిక, రాజకీయ, విజ్ఞాన శాస్త్ర పోకడలన్నీ వర్ణించి చెప్పేరు. మానవ నైజం, దురాశ, సామ్రాజ్య కాంక్ష, స్వార్ధం అన్నీ ఉటంకించారు. అందువలన ఆ పుస్తకం ఎంతో అద్భుతంగా తోచింది. స్వేచ్ఛాను వాదం చేసాను. ఈ పుస్తకం కూడా చదువరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.

ప్రశ్న: మీ స్వీయ చరిత్రలో ది హిందూ పేపర్ చదివి ఇంగ్లీషు నేర్చుకున్నానన్నారు. నిజంగా ఆ పేపర్ చదివితే ఆంగ్ల భాషా పరిజ్ఞానం వస్తుందాండీ?
జ.హిందూ పేపర్ చదివినంత మాత్రాన ఇంగ్లీష్ రాదు. ఈ వార్తా పత్రిక సమగ్రంగా వుండేది.దేశ విదేశీ వార్తలు, ఆర్ధిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు, భాషపై మక్కువ పెంచడానికి ఉత్తమ సాహిత్య గ్రంథాల సమీక్షలు- వ్యాసాలు వచ్చేవి. సంపాదకీయం, Central spread essays by G.K. Reddy ఇవి చదవడం ఒక మధురానుభూతి. అవి Golden days for the Hindu (1950 to 1980).

ప్రశ్న: మీరు కథలు కూడా రాసారు. కవిత్వం, వ్యాసం మొదలైన ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి కదా! కథలే రాయాలని మీకెందుకు అనిపించింది ?
జ. అవును. కథలు కూడా చాలా వ్రాసాను.
నేటి సామాజిక, ఆర్ధిక స్థితి గతులను దృష్టిలో వుంచుకుని కథావస్తువు ఎంచుకున్నాను. R.G. Rees అనే మహారచయిత మనం సాహిత్యం ఎందుకు చదవాలి అని ఒక బుక్ వ్రాసారు. అందులో రచనలోని ప్రక్రియలను చెప్పారు. షార్ట్ స్టోరీ చాలా గొప్పది. చెప్పదలచుకొన్న అంశం స్పష్టంగా మనసులో వుంచుకుని కథ సామాన్యం గానో, నాటకీయం గానో ప్రారంభించి మధ్యలో ఉత్సాహం, ఉత్తేజం కల్గిస్తూ విషాదం వుంటే అందించి, ముగింపు కూడా చక్కగా చెప్పాలి. నీతులు వల్లించ కూడదు. అరే కథ అప్పుడే అయిపోయిందా” అని చదువరులు అనుకోవాలి” అని వ్రాసారు. అవి దృష్టిలో వుంచుకుని వ్రాసాను. సుమారు 14 వరకు వున్నవి. ఆన్లైన్ మేగజైన్ “సంచిక”లో వస్తుంటాయి.

ప్రశ్న: మీరు బాగా చదువుకున్నారు కాబట్టి మీ పిల్లల్ని ‌ బాగా పెంచారు. మీ పిల్లల వివరాలు చెప్తారా ?
జ. నేను అతి కష్టపడి పట్టుదలతో ప్రయివేటుగా బి.ఏ చదివేను. ఎమ్.ఏ. చదవాలని, మంచి ఉద్యోగంలో చేరాలని అప్పటి రోజుల్లో కోరిక బలంగా వుండేది. పోటీ పరీక్షలు వ్రాసి రేంక్ సంపాదించి నా సత్తా నిరూపించుకోవాలని ఉండేది. కానీ ఈ లోగా పిల్లలు కలిగారు. వరుసగా అమ్మాయిలు. వారికి విద్య ఎంతో అవసరం. వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకొని, ఎమ్.ఏ. చదువుకు స్వస్తి చెప్పేను. అదృష్టవశమున దేవుడు కుమారుణ్ణి కూడా ప్రసాదించాడు. అతడు తన అక్కల వలె నెమ్మదస్థుడు. ప్రతిభతో పదోతరగతి లోనే ఆరు లక్షలతో మొదటి పది రాంక్స్ లో నిలిచి మా ఇంటి విద్యా సౌరభాన్ని నలుగురికీ చాటాడు. పిల్లలు నలుగురూ ఆత్మ గౌరవంతో జీవిస్తున్నారు. ఉన్నతవిద్యల్లో రాణించేరు. ఆర్ధికంగా హాయిగా ఉన్నారు.

ప్రశ్న: మీరు ఆనాటి తరానికి చెందినవారు.అప్పటి విద్యా వ్యవస్థకు, నేటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ కు తేడా ‌ఏమిటి?
జ. మార్పు సహజం. నేటి విద్యా వ్యవస్థకు 1960 నుండి 1990 వరకు గల వ్యవస్థకు తేడాలున్నాయి. కోటి విద్యలూ కూటి కొరకే అన్నది జగమెరిగిన సత్యం. అయితే ప్రపంచీకరణ globalization) వచ్చి అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం నిష్క్రమించి ప్రైవేటు రంగానికి అవకాశాలు ఇచ్చింది. ఆనాడు ఉపాధ్యాయులంటే విద్యార్ధులకు గౌరవం.”గురువు”గా తల్లిగా, తండ్రిగా భావించేవారు. వారు కూడా తరగతి లోని పిల్లలందరినీ తమ కన్నబిడ్డ లవలె అభిమానించి, అందరినీ ఉత్సాహపరచి చదువు నేర్పేవారు. అదొక స్వర్ణయుగం అనిపిస్తుంది.
విద్యా ర్ధులను active participants గా తరగతులు Reading Dictation ప్రశ్నలడగడం Board పై లెక్క చేయించడం గ్రామర్ ప్రక్రియలు, మేప్ లొకేషన్స్, డయాగ్రమ్స్ అన్నిటి లోనూ అందరినీ ఇన్ వాల్వ్ చేసేవారు. అందువలన విద్యార్థులకు మూలాలు బోధపడేవి.,(Basics in all subjects) నేడు విద్య ప్రైవేటు పరమైంది. కార్పొరేట్ స్కూల్సు వెలిసాయి. కె.జి టు పి.జి అని అడ్వ్ ర్టైజ్మంట్స్. దీనికే అంతులేని ఖర్చు. పాఠశాలలు కూడా లాభాలనిచ్చే ఆర్ధిక వనరుల స్ధాయి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆయా పరీక్షల్లో ఉత్తీర్ణత, అధికశాతం మార్కులు, రాంకులు ఎలా రాబట్టాలనేదే ముఖ్యం. దృష్టి అంతా పరీక్షల్లో వచ్చే ప్రశ్నల నమూనాలు ప్రకారం పదేపదే శిక్షణ నిచ్చి ఉత్తీర్ణతాశాతం పెంచుతున్నారు. మూలాలు దెబ్బ తింటున్నాయి. ఇక్కడ రాంకులు పొందినా నిపుణత ఉన్న వారు లేక ఎందరో యువతీ యువకులు మంచి ఉద్యోగాలు పొందలేక పోతున్నారు.

ప్రశ్న: మీ కాలం లో ఉమ్మడి కుటుంబాలుండేవి.ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలే. వృధ్ధాశ్రమ సంస్కృతి కూడా వచ్చింది . మీరేమంటారు?
జ.వృధ్ధాశ్రమ సంస్కృతి అనే పదం నేను ఎంతమాత్రం సమ్మతించను. అది సంస్కృతి కాదు. అత్యంత అనాగరికమైన జుగుప్సను కలగించే పదము. అంటాను. అనాధాశ్రమాలు, సంతానం లేనివారు, బంధువులు ఎవరూ లేని వారూ అనాధలే కనుక వారికి పూర్వం వృద్ధాశ్రమాలుండేవి. దాతలు ఉదార మనస్సుతో నెలకొల్పే వారు. వృధ్ధాశ్రమానికి సమిష్టి, వ్యష్టి కుటుంబాలకు ఏమాత్రం సంబంధం లేదు. ప్రస్తుతం పురుషులు తమ తల్లి దండ్రుల విషయంలో తగు శ్రద్ధ చూపడం లేదు. భార్యతో సర్ది చెప్పలేని నిస్సహాయ స్థితి వారిది. ధనానికి లోటు లేనేలేదు. పెద్ద ఇళ్ళు, గదికో మనిషి. పెద్దలకి వాళ్ళ హృదయం లోనే చోటు లేదు. మహిళలు కొందరు కఠినంగా వుంటే పురుషులు ఇంకా తీవ్రంగా అనాగరికంగా వున్న సంఘటనలు చూస్తున్నాం. ఆస్తి కోసం అన్నదమ్ముల పోట్లాటలు గొడవలు, హత్యలు…
ప్రస్తుతం వృద్ధాశ్రమాలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. అవి కూడా ప్రైవేటు సంస్థలు నడుపు తున్నాయి. ముందుగా చెప్పకుండా కొందరు వారి తల్లిదండ్రులను అక్కడ చేరుస్తున్నారు. దయనీయ స్థితి.
వృద్ధులు అని తేలికగా తీసి పడేస్తారు కానీ వారు ఒకొక్కరు ఒకొక్క గ్రంధాలయంతో సమానం. వారి అనుభవాలు, కష్టాలను ఎదుర్కొన్న ధైర్యం, జీవితం పట్ల వారికి గల ప్రేమ విస్మరించ లేని సత్యాలు. ఈ సంపద ముందు తరాలవారికి అందించి తీరాలి. లేకపోతే తరువాత తరాలవారికి ఆత్మ లేని మరమనుషులౌతారు.

ప్రశ్న: యువతరానికి మీరిచ్చే సందేశం ఏమిటండీ?
జ.యువతపై నాకు ప్రేమ, విశ్వాసం ఉన్నాయి. నిపుణత్వాలు పెంచుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తమకు నచ్చిన సబ్జెక్టులో విద్య కొనసాగించి నా, ప్రపంచంలోని సామాజిక, ఆర్ధిక, రాజకీయ వ్యవస్థలు ఎటు వెళ్తున్నాయో తెలిసికొనాలి.
అప్పుడు తమని తాము మరింత నిపుణులుగా మలచుకొనే అవకాశం కలుగుతుంది. పిల్లల్ని సక్రమ మార్గంలో పెంచాలి. కష్టించే తత్వం విధేయత, బాధ్యతలు జాగ్రత గా నిర్వర్తించడం Accountability and honesty వీనికి భారత యువతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వున్నది.

ఏ దేశమేగినా భారతీయులకు విద్యా ఉద్యోగ అవకాశాలకు ప్రాముఖ్యం లభిస్తున్న విషయం మనం చూస్తున్నాం కదా. వారికి సందేశమంటారా! కుటుంబ వ్యవస్థ ప్రపంచ ప్రజల జీవన విధానానికి మూలం. ఆ మూలాలు మరువకూడదు. వివాహం భార్యాభర్తలు అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసికొని జీవన యాత్ర సాగించుట, పిల్లల్ని కని సక్రమ పద్ధతిలో మంచి పౌరులుగా తీర్చి దిద్దుట, తమ తల్లి దండ్రులను గౌరవించుట ఇవే మూలాలు.కుటుంబ వ్యవస్థ మాత్రమే మనిషికి ఇతర జీవరాశులకు గల భేదాన్ని నిరూపిస్తున్నది. బంధాలు శాశ్వతంగా నిలిచేది ఇక్కడే. ఆ వ్యవస్థ మూలాలు కదిలితే? అంతే సంగతులు.

ప్రశ్న: మీరు నిత్య విద్యార్థిని. భవిష్యత్తులో మీరేం రచనలు చేయాలనుకుంటున్నారు?
జ. నిత్య విద్యార్ధిగా వున్నందువల్లనే చాలా విషయాలు నేర్చుకొనడానికి అవకాశం. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు “A teacher shall be always a student’ అన్నారు. అది జీర్ణించుకున్నాను. నాకు వయస్సు పెరుగుతున్నది. ఆరోగ్యం సహకరించాలి. భవిష్యత్తు గురించి ఏమి చెప్పగలను? దైవేచ్ఛ. ఏమి వ్రాయగలనో.

ఇంటర్వ్యూ: మందరపు హైమావతి (9441062732)

7 thoughts on “విద్య సాధించిన ‘విజయగీతం’

 1. I feel proud whenever I read your books that I met you personally
  I enjoyed your three books. I must thank Sailaja for providing your books.
  Dr. Satya vani
  Sailaja’s colleague

 2. Interview mottam chadivanu. Excellent mee Amma ga naaku aunty teliyatam, kalisi kolkatta anni tiragadam telitani yenni Vishaal Amma dwara telusukovatam naa purva janma adrushtam.

  Lakshmi

 3. నా ప్రియమైన మేడం గారికి.. విజయ నమస్కరిస్తూ,… అనేక అనేక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.. మీ ఇంటర్వ్యూ ఓ అద్భుతం… చాలా చాలా బాగుంది,.. మీ ఆన్సర్లు చదువు తూ ఉంటే.. ఎంతో inspiratíon కలుగుతోంది… మీ తో 10mins మాట్లాడి తే చాలు. ఎంతో విజ్ఞానము వస్తుంది…,మేడం మీకు ఆ భగవంతుడు పూర్ణ ఆయష్ ని… ఆరోగ్యని ఇచ్చి ఇంకా ఎన్నో విలువైన ఆణిముత్యలు మీ కలం నుండి జాలువారాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తూ
  …మిమల్ని అమితంగా అభిమానించే.,. మీ విజయ…

 4. ప్రియమైన మా మేడం గారికి.. మీ vijaya హృదయ పూర్వక అభినందనలు తెల్పుతూ.. మేడం మీ ఇంటర్వ్యూ అద్భుతం..ప్రతి ఆన్సర్ ఎంతో ఇన్స్పిరేషన్ గా. స్పష్టంగా.. క్లుప్తంగా…. చాలా excellent గా వున్నాయి… మీ తో ఓ 10 mins మాట్లాడిన చాలు ఎంతో విజ్ఞానం వస్తుంది… మీరు నేర్పిన english వల్ల ఈ రోజు నేను పది మందికి చెప్పగలుగుతున్నాను… మీకు ఆ భగవంతుడు పూర్ణ ఆయష్ ని… పరిపూర్ణ ఆరోగ్యాని ఇచ్చి.. ఇంకా ఎన్నో ఆణిముత్యాలు మీ కలం నుండి జరువాలలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ… మిమల్ని అమితంగా అభిమానించే… మీ vijaya surabhi…

 5. Its really a fantastic interview. శేషమ్మ గారితో కాసేపు మాట్లాడితే చాలు మనకి ఆత్మస్థైర్యం, జ్ఞానం వస్తాయి. అందం, అణకువ, అపార జ్ఞానం దేవుడు ఆమెకు ఇచ్చిన వరాలైతే… ఆమె సాంగత్యం, సాహిత్యం, పాండిత్యం మనకి లభించిన వరాలు.

 6. I read Mrs Seshamma garu’s autobiography some time back and, impressed, sent my impressions to her by email. Now this interview throws more light on her views and would like to congratulate her. Keep the good work going ma’am!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap