
(జూన్ 28 పెండెం జగదీశ్వర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
పెండెం జగదీశ్వర్ అనేక జానపద కథలు సేకరించి ఆంధ్రప్రదేశ్ జానపద కథలు అనే బృహత్తర గ్రంథాన్ని రాశారు. అందులోంచి కొన్ని కథల్ని బడి పిలగాల్ల కతలు పేరిట తెలంగాణ మాండలికంలో రాశారు. ఇది తెలంగాణ భాషలో వెలువడిన మొట్టమొదటి బాల సాహిత్య గ్రంథంగా పేర్కొనవచ్చు ఇది పిల్లలు ఇష్టంగా చెప్పుకునే ఇరవై జానపద, హాస్యకథలతో రూపొందించిన పుస్తకం. ఇందులోని కథలన్నీ తెలంగాణ మాండలికంతో పూర్తిగా పిల్లల ఉచ్చారణను అనుసరిస్తూ రాయబడ్డాయి. ఇవి పిల్లలకు తమ కథలు, తమ భాష అన్న ఆసక్తిని, అభిమానాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. పెద్దవాళ్ళకు తమ బాల్యాన్ని గుర్తుకు తెస్తాయి.
పెండెం జగదీశ్వర్ బాలసాహితీ లోకానికి దూరమై ఏడు సంవత్సరాలు గడిచింది.
2018 తరువాత జగదీశ్వర్ పేరును బాల సాహిత్యంలో చిరస్థాయిగా నిలపడం కోసం ఏదైనా చేయాలని జగదీశ్వర్ మిత్రులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మొదటి వర్ధంతి రోజున జగదీశ్వర్ సాహిత్యం పై ‘బాల సాహితీ రత్న’ అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు.
ఆ తర్వాత 2020 సంవత్సరం నుండి, ‘పెండెం ఆత్మీయులు’ పేరుతో జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కారం ఇస్తూ వచ్చారు.
మొదటి పురస్కారాన్ని పుప్పాల కృష్ణమూర్తి (2020), రెండవ పురస్కారాన్ని చొక్కాపు వెంకట రమణ (2021), మూడవ పురస్కారాన్ని డాక్టర్ వి. ఆర్. శర్మ (2022), నాలుగవ పురస్కారాన్ని దార్ల బుజ్జి బాబు (2023), ఐదవ పురస్కారాన్ని గరిపల్లి అశోక్ (2024) అందుకున్నారు. ఆరవ పురస్కారాన్ని ముంజులూరి కృష్ణ కుమారి 29 జూన్ 2025 ఆదివారం నాడు నల్గొండలో అందుకోనున్నారు.
ఈ పురస్కారం కింద 5000 రూపాయల నగదు, ప్రశంసా పత్రం, శాలువా అందజేస్తారు.
ఒక సంవత్సరం తెలంగాణ వారికి, మరుసటి సంవత్సరం తెలంగాణేతరులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
పూర్వ నల్లగొండ జిల్లా, రామన్నపేట మండలం, మునిపంపుల గ్రామంలో 28 జూన్ 1976 న శ్రీమతి సత్యమ్మ, శ్రీ నరసింహ దంపతులకు జన్మించారు. తెలుగులో మాస్టర్ డిగ్రీతో పాటు తెలుగుపండిత శిక్షణ పూర్తి చేశారు. సర్కారు బడిలో తెలుగు పంతులుగా కొలువు చేశారు.
ఆనంద వృక్షం (పర్యావరణ కథల సంపుటి), పసిడిమొగ్గలు, ఉపాయం, గజ్జెలదెయ్యం, విడ్డూరాల బుడ్డోడు, తానుతీసినగోతిలో, ముగ్గురు అవివేకులు, విముక్తి, బడి పిలగాల్ల కతలు, గమ్మతి గమ్మతి కతలు, మాతో పెట్టుకోకు, చిన్ని కోరిక, మొదలైన కథాసంపుటాలను ప్రచురించారు. పర్యావరణం నేపథ్యంగా వీరు రాసిన “చెట్టు కోసం” అనే కథ మహారాష్ట్రలో ఆరవ తరగతి తెలుగు పాఠ్యాంశంగా ఎంపికైంది. తెలంగాణ మాండలికంలో రాసిన “నాకోసం యెవలేడుస్తరు?, వొంకాయంత వొజ్రం” కథలు కూడా పాఠాలుగా ప్రవేశపెట్టబడ్డాయి. మన రాష్ట్రంలో కూడా తెలుగు పాఠ్యపుస్తకాల తయారీలో సేవలందించారు. నూతన అక్షరాస్యుల కోసం పలు పుస్తకాలు రాశారు.
జానపద కథలపై ప్రత్యేక ఆసక్తితో పది సంవత్సరాలు అనేక కథలు సేకరించి ‘ఆంధ్రప్రదేశ్ జానపద కథలు’ అనే చాలా పెద్ద పుస్తకం ప్రచురించారు. బాలసాహిత్య గ్రంథాల ప్రచురణలో రాజీవ్ విద్యామిషన్ కు సేవలందించారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గజ్జెల దెయ్యం కు 2015 సాహితీ పురస్కారం అందించింది. ‘బాలసాహితీరత్న’ పురస్కారం ను బాలసాహిత్య పరిషత్ అందించింది. ఇంకా వాసాల నర్సయ్య బాలసాహిత్య పురస్కారం అందుకున్నారు.
17 జులై 2018 న బాలసాహితీలోకాన్ని విడిచి వెళ్ళారు పెండెం జగదీశ్వర్.
–పైడిమర్రి రామకృష్ణ
(92475 64699)