శ్రీ విరించి అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన ప్రముఖ కథా రచయిత డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రామానుజాచారి(87) జనవరి 26 (బుధవారం), 2022 చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఉదయం 11 గంటలకు రామానుజాచారి తుది శ్వాస విడిచారు. శ్రీవిరించికి ఒక కుమార్తె ఉన్నారు. రామానుజాచారి 1935లో విజయవాడలో జన్మించారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ, పారిశ్రామిక వాణిజ్య చట్టాలలో బీఎల్ పాటు డాక్టరేట్ కూడా చేశారు. తులనాత్మక తత్వశాస్త్రంలోనూ పట్టభద్రులు.
రామానుజాచారి 1958 నుంచి థియోసాఫికల్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. అడయార్‌లోని సంస్థ ప్రపంచ ప్రధాన కార్యాలయంలో అనేక హోదాలలో బాధ్యతలు నిర్వర్తించారు. 1951లో తెలుగులో ఆయన చేసిన తొలి రచన ఒక వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత తెలుగు, ఇంగ్లిష్ లో అనేక కథలు రాశారు.
తెలుగులో 100, ఇంగ్లీష్ లో 50కిపైగా విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. వందలాది గ్రంధ సమీక్షలు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీకి, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు అనువాదకులు. మధ్యమావతి, కొత్త నక్షత్రం (1982), అర్థం, కారని కన్నీరు, మెట్లులేని నిచ్చెన (1995), కనకపు గట్టు (1997) గంధపు చుక్క (2000) వంటి పలు కధా సంపుటాలు వెలువరించారు. ఇంగ్లీష్ లో అవేకనింగ్ టూ ట్రూత్, సీక్రెట్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, ద ట్రూ పాత్ ఆఫ్ థియోసాఫీ, వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ తదితర రచనలు చేశారు. సముద్ర శిఖర్ అనే హిందీ రచన కూడా చేశారు. తెలుగు యూనివర్శిటీ అవార్డు, డాక్టర్ దాశరథి రంగాచార్య, శ్రీమతి కమలా సాహిత్య పురస్కారం (2004) వంటి పలు పురస్కారాలను అందుకున్నారు. కథాశిల్పం విషయంలో ఆయనది ప్రత్యేకమైన శైలి, తెలుగు కథా ప్రపంచం ఓ గొప్ప రచయితను కోల్పోయింది.