కథని పలవరిస్తూ… స్వప్నిస్తూ కథల తోటలోకి ‘పుష్పగుచ్చం’తో జనించిన ఖదీర్, అక్షరాల తోటలో రుతువులన్నిటా కథలని విరబోయించాలనే ఆకాంక్షతో ‘రైటర్స్ మీట్’ అనే రంగురంగుల అక్షరాల రిబ్బన్తో రచయితల మనసుల్ని చెలిమితో ముడివేసి భిన్నదృక్పథాల కథకులందరినీ ఒక రెండ్రోజులు కథావన ప్రాంగణంలోకి ఆహ్వానించే నవ్యకథామాలి ఖదీర్ బాబుకి జేజేలు.
సెప్టెంబర్ 14, 15 శని, ఆదివారాలలో హైదరాబాద్ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ‘రైటర్స్ మీట్’ లో పాల్గొనే కథకులందరికీ వో రెండ్రోజులు పూర్తిగా కథకు సంబంధించిన విషయాలతోనే గడపటంతో రచనావ్యాసంగంలో వదిలించేసుకోవలసినవేమిటో, నింపుకోవలసినమేమిటో, మరింతగా మనల్ని మనం enrich చేసుకోటానికి, మనలో గందరగోళంగానో చుట్టుకుపోతున్న ఆలోచనలను డీ టాక్సిన్ చేసుకోటానికి, అల్లిబిల్లిగా అల్లుకుపోతున్న కథ వస్తువులను ప్రోసెస్ చేసుకోవటానికి ‘రైటర్స్ మీట్’ వో ధ్యాన లోగిలి.
భాద్రపద మాసపు తొలి వేకువలో ముదురాకు పచ్చని మామిడి తోటల నడుమ నడుస్తూ… నడుస్తూ… నేలంతా పరుచుకున్నా బీర పువ్వుల్ని… దారికి అటు యిటూ విచ్చుకున్న పత్తి పువ్వుల్ని… మోటారు బావిలో వొత్తయిన నీటి సవ్వడిని… ముంగిట్లో విరబూసిన రంగురంగుల పువ్వుల్ని… పేరు తెలియని పిట్టల పాటల్ని… వెచ్చని టీ… కాఫీ పరిమళాల్ని మనసున నింపుకొని పూర్తిగా వాన తడి ఆరని మట్టి పరిమళపు గాలుల్ని శ్వాసిస్తూ రెండ్రోజులు గంట కొట్టగానే క్లాస్ రూమ్స్ కి చేరుకునే న్యూ స్టూడెంట్స్ లా సరిగ్గా తొమ్మిదిన్నరకి మీటింగ్ హాల్లోకి అంతా చేరుకునే వాళ్ళం. అప్పుడే అయిపోయిందా అనిపించేది ప్రతీ సెషన్.
అనువాదం, బహుజన కథ, మాండలికం, అర్బన్ స్టోరీస్, కథ నుంచి నవలకి, భ్రమణ కాంక్ష, దృక్పథం, సినిమా, ప్రచురణలు, లెక్కలు ఫిక్షన్, Chat GPT యిలా పలు అంశాలను రెండ్రోజులు విన్నాము.
అన్ని భావజాలాల రచయితలని అన్ని భావజాలాల వాళ్ళు వినటం ‘రైటర్స్ మీట్’ లో వొక ప్రత్యేకత.
ఖదీర్, అక్కితో కలిసి రామారావు గారు నిర్వహించిన సెషన్ లో పాల్గొనటం నాకు భలే సంతోషాన్ని యిచ్చింది.
శ్రద్ధగా… ఏకాగ్రతతో వింటున్నారన్న దానికి ‘రైటర్స్ మీట్’ లో పాల్గొన్నవారిలో యెందరో యెంతో చక్కగా వారివారి అనుభవాలను facebook లో డీటెయిల్డ్ గా పంచుకోవటమే అందమైన ఆనవాలు.
యింతకు ముందు యీ మీట్ లో పాల్గొన్న రచయితలు తమ మొదటి కథా సంపుటిని పాఠకుల ముందుకు తీసుకొచ్చే స్ఫూర్తిని ‘రైటర్స్ మీట్ ‘ కలిగించిందని పంచుకోవడం విన్నప్పుడు… చదివినప్పుడు యీ సారి మీట్ లో పాల్గొన్న మరి కొంతమందికి త్వరగా తమ పుస్తకం తెచ్చుకోవాలనే వుత్సాహాన్నిస్తుందనిపించింది.
దాదాపు ముప్పై యేళ్ళ క్రితం తన చుట్టూ వున్న కథా ప్రపంచాన్ని లేలేత కళ్ళతో ఆశ్చర్యంగా ‘పుష్ప గుచ్ఛం’తో చూసిన యీ కావలి కథా ప్రేమికని యీ రోజు కథా గుచ్చం అబ్బురంగా చూస్తుంటే…. వకుళా భరణం రామకృష్ణ గారు వో వేదిక మీదన్న మాట స్ఫురించింది.
‘నిన్ను చూస్తుంటే మాకెంతో గర్వంగా వుంది ఖదీర్.
Yes, we are proud of you dear Khadheer.
సెప్టెంబర్ కథా ఉత్సవం 2024 : పాల్గొన్న సభ్యులు వివరాలు (వారి ఇప్పటి నివాస ప్రాంతం/ సొంత ప్రాంతం)
గ్రూప్ ఫోటో లో కూర్చున్న వారు:
ఆర్.జె.శ్రీ (అమెరికా/ శ్రీకాళహస్తి), అవినేని భాస్కర్ (బెంగళూరు/చిత్తూరు), మల్లికార్జున్ (హైదరాబాద్/నల్గొండ), మహమ్మద్ గౌస్ (హైదరాబాద్/అనంతపురం), నూనె ఆనంద్ (ఆర్మూర్), ప్రవల్లిక (హైదరాబాద్/కాకినాడ), సాయివంశీ (హైదరాబాద్/మహబూబ్‌నగర్), విజయశేఖర్ ఉపాధ్యాయుల (హైదరాబాద్/అమలాపురం), రావెళ్ల రవీంద్ర (హైదరాబాద్/ఖమ్మం), వేణు జుజ్జూరి (జంగారెడ్డి గూడెం/ప.గో), తగుళ్ల గోపాల్ (మహబూబ్‌నగర్).
కుర్చీల్లో కూర్చున్న వారు:
రుబీనా పర్వీన్ (హైదరాబాద్/ఖమ్మం), శారద కావూరి (రామగుండం/గుంటూరు), స్వర్ణ కిలారి (హైదరాబాద్/ఖమ్మం), రామరాజు (హైదరాబాద్/నెల్లూరు), చిలుకూరి రామఉమామహేశ్వర శర్మ (హైదరాబాద్/భద్రాచలం), శివ నాగేశ్వరరావు (హైదరాబాద్/గుంటూరు), హనుమంతరావు (హైదరాబాద్/హనుమకొండ), కుమార్ కూనపరాజు (ప.గో), చక్రవర్తి కర్రి (హైదరాబాద్/కిర్లంపూడి), జి.ఎస్.రామ్మోహన్ (న్యూఢిల్లీ/ ప్రకాశం), ఖదీర్ (హైదరాబాద్/నెల్లూరు).
నిలబడ్డ వారు:
అనంత్ చింతలపల్లి (హైదరాబాద్/కర్నూలు), శ్రీ ఊహ (హైదరాబాద్/కృష్ణ), శృతకీర్తి (హైదరాబాద్/కరీంనగర్), మానసా చామర్తి (బెంగళూరు/విజయనగరం), మాధవీ రెడ్డి (హైదరాబాద్/కరీంనగర్), గుడిపల్లి నిరంజన్ (మహబూబ్‌నగర్/నాగర్ కర్నూల్), వివేక్ లంకమల (హైదరాబాద్/కడప), కన్నెగంటి రామారావు (అమెరికా/గుంటూరు), అనిల్ అట్లూరి (హైదరాబాద్/మద్రాసు), కుప్పిలి పద్మ (హైదరాబాద్/రాజమండ్రి), ఝాన్సీ పాపుదేశి (బెంగళూరు/చిత్తూరు), అక్కిరాజు భట్టిప్రోలు (హైదరాబాద్/కొత్తగూడెం–కృష్ణ), తప్పెట ఓదయ్య (ఓల్డ్ కరీంనగర్), దుప్పల రవికుమార్ (శ్రీకాకుళం), బాహుదా సుదర్శన్ (హైదరాబాద్/చిత్తూరు), కవనమాలి (హైదరాబాద్/నాగర్ కర్నూల్), ఆదిత్య అన్నవఝల (హైదరాబాద్/విశాఖపట్నం), ప్రవర్ష్ (హైదరాబాద్/కాకినాడ), రమేష్ సామల (హైదరాబాద్/వరంగల్), మహి బెజవాడ (హైదరాబాద్/నెల్లూరు).
…….
కుప్పిలి పద్మ.