ప్రముఖ కవి, ‘ఎక్స్ రే’ సాహిత్య మాసపత్రిక ఎడిటర్, ఎక్స్ రే సాహిత్యసేవా సంస్థ వ్యవస్థాపకులు, మినీ కవితా సారధి కొల్లూరి అక్టోబర్ 16న రాత్రి 7 గంటల సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 69. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో కాలికి చికిత్స నిమిత్తం 15 రోజుల క్రితం చేరిన కిడ్నీ సమస్యలతో డయాలసిస్ తీసుకుంటూ గురువారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రా బ్యాంకు అధికారిగా జీవితం ఆరంభించిన కొల్లూరి అమలాపురంలో వంశపారంపర్య కొల్లూరి సత్రం నిర్వహించేవారు. ప్రముఖ సినీ దర్శక, రచయిత విజయ బాపినీడు తెచ్చిన చిరంజీవి పత్రికకు సంపాదక సారథ్యం వహించేందుకు ఆంధ్రాబ్యాంకు ఉద్యోగం వదిలిపెట్టి మద్రాసు వెళ్ళారు. 1993లో విజయవాడకు చేరుకుని బావమరిది సాయంతో కొంతకాలం ‘అంజలి’ వారపత్రిక నడిపారు. అంతకుముందే ఎక్స్ రే పేరుతో అచ్చంగా కవిత్వం కోసం ఓ పత్రిక నడిపారు. మహాకవి శ్రీశ్రీ కూడా మినీ కవిత్వానికి వేదికగా నిలిచిన ఆ పత్రికకు చందా మొత్తాన్ని మనియార్డర్ చేశారు.
మినీ కవితా సారథిగా పేరు గడించారు. సాంస్కృతిక రాజధానిగా పేరుందిన విజయవాడలో 90 వ దశకంలో ఉన్న పళంగా స్తబ్ధత ఆవరించగానే ఎక్స్ రే పేరుతో సాహిత్య సేవా సంస్థను ఏర్పాటు చేసి నెలనెలా వెన్నెలతో పాటు మరెన్నో పెద్ద కార్యక్రమాలు చేపడుతూ సాహిత్య వాతావరణం ఉట్టిపడేలా చేశారు. సినారెను విజయవాడలో ఆంజనేయ విలాస్ హోటల్ పై సబా కార్యక్రమానికి విజయవాడకు రప్పించారు. దిగంబర కవులు నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, నగ్నమునితో పాటు ఇంకా కె. శివారెడ్డి వగైరా ప్రముఖ తెలుగు కవులతో మాంటిస్సోరి కళాశాలలో 24 గంటల కవి సమ్మేళనం నిర్వహించారు కొల్లూరి. ఏటా పది ఉత్తమ కవితలకు ఎక్స్ రే అవార్డులు ఇస్తూ వస్తున్నారు. అది చాలదన్నట్టు కొంతకాలం హరికథా వారోత్సవాలు నిర్వహించారు. అక్కడితో ఆగకుండా మదర్ తెరిసా పేరుతో లెక్కలేనంత మందిని సత్కరించారు. కమ్యూనిస్టుల కంచుకోట బెజవాడలో మహాకవి శ్రీశ్రీకి విగ్రహం లేకపోవడం చిన్నతనంగా, అవమానంగా భావించి తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మహాకవి శ్రీశ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 2010 లో శ్రీశ్రీ శత జయంతి మహా సభలు ఘనంగా నిర్వహించారు.
కరోనా కష్టకాలంలో నిత్యాన్నదానంతో అలసటెరగకుండా శ్రమించారు. వేసవికాలం వచ్చిందంటే చాలు కొన్ని వేల మజ్జిగ ప్యాకెట్లతో పాదచారుల దాహార్తిని తీర్చేవారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అంజలి చార్టర్ అధ్యక్షులుగా సేవలందించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గా చేశారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యవర్గ సభ్యుడిగా కూడా చురుగ్గా వ్యవహరించారు. నిరంతర సేవా తత్పరుడు లయన్, వాసవియన్ కొల్లూరి ఆకస్మిక మృతి పట్ల పలువురు నగర ప్రముఖులు, కవులు, రచయితలు, పుస్తక ప్రచురణకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకి సంతాపం తెలిపారు. నా మట్టుకు నాకు కొల్లూరి ప్రాణదాత. 2010లో సెలబ్రల్ మలేరియా కారణంగా తెల్ల రక్త కణాలు 11 వేలకు పడిపోయి ఏలూరు రోడ్ లో డాక్టర్ చలపతిరావు గారి ప్రశాంతి నర్సింగ్ హోమ్ లో దాదాపు మృత్యుముఖంలో ఉన్న నన్ను అరగంట వ్యవధిలోనే నాలుగు ప్లేట్ లెట్ ప్యాకెట్లు తెప్పించి ప్రాణగండం తప్పించిన మానవతామూర్తి. మరో సందర్భంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సహాయాచార్యుల ఉద్యోగ ఖాళీ ఉందని తెలిసి ఉపకులపతి డాక్టర్ అనుమాండ్ల భూమయ్య గారింటికి నన్ను తీసుకెళ్లి ప్రతిభకు పట్టం కట్టాలని రికమెండ్ చేసిన పరోపకార సంపన్నుడు, స్నేహశీలి, కొల్లూరి గారికి అక్షరాశ్రువులు సమర్పించుకుంటున్నా.
ఏలూరు రోడ్డు లోని రామ్మందిరం దగ్గర ఆదాం వాచీ కంపెనీ పక్కనే కొల్లూరు వారి స్వగృహంలో పార్థివ దేహాన్ని దర్శించుకుని ఆఖరి కైమోడ్పులు అర్పిద్దాం.. కన్నీటి సంద్రమై కదిలి రండి. ఇన్నాళ్ళూ మన కవితలకి వేదికలిచ్చిన కొల్లూరి కవికి లోలోపల కవితాసుమాలవుదాం…
–డాక్టర్ సశ్రీ
