శ్రీశ్రీ రచనలతో సమాజంలో చైతన్యం

7వ ఎక్స్ రే శ్రీశ్రీ అవార్డును సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు తనయుడు కోటి అందుకున్నారు.

మహాకవి శ్రీశ్రీ రచనలు, పాటలతో సమాజంలో చైతన్యం వెల్లివిరిసిందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరి కోటి అన్నారు. విప్లవకవి అయినప్పటికీ జనం మెచ్చే పాటలు రాసిన మహనీయుడు శ్రీశ్రీ అంటూ కొనియాడారు. సుంకర టి. కృష్ణ మెమోరియల్ నాగార్జున కళాపరిషత్(కొండపల్లి), ఎక్స్ రే సాహిత్య సాంస్కతిక సేవా సంస్థ (విజయవాడ) సంయుక్త ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకుని 7వ ఎక్స్ రే శ్రీశ్రీ అవార్డును దివంగత సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుకు ప్రకటించగా ఆ అవార్డును రాజేశ్వరరావు తనయుడైన సినీ సంగీత దర్శకుడు కోటికి అందజేశారు. విజయవాడ, దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో బుధవారం (15-06-20222) జరిగిన ఈ కార్యక్ర మంలో అవార్డు స్వీకరించిన అనంతరం సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ… విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసిన తర్వాత తాను తన తండ్రికి వచ్చిన అవార్డును స్వీకరించేందుకు విజయవాడ రావడం ఎంతో ఆనందంగా ఉందని ఎన్టీఆర్‌కు జోహార్లు అర్పిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తన తండ్రి సాలూరి రాజేశ్వరరావు వంటి మహనీయుల మహోన్నత సంగీతాన్ని తాను ఎన్నటికీ అందుకోలేనని, కాలానుగుణంగా ప్రేక్షకులు ఇష్టపడే రీతిలో తాను సంగీతాన్ని అందిస్తూ విజయం సాధించుకుంటూ వచ్చానన్నారు. కుటుంబ నేపధ్యాన్ని బట్టి కాదని, నైపుణ్యం ఉన్న సంగీత దర్శకులను, కళాకారులను మాత్రమే సినీ పరిశ్రమ ఆదరిస్తుందని ఇది అక్షర సత్యమన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రళయగర్జనతో తాను, రాజ్ కలసి చేసిన సంగీతం, తదనంతర కాలంలో తాను సంగీత దర్శకుడుగా రాణించిన పలు చిత్రాల్లోని విశేషాలను ప్రేక్షకులతో కోటి పంచుకున్నారు.

Sri Sri Book

తను సంగీత దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాల్లోని పాటలను కోటి స్వయంగా పాడి వినిపించడంతో సంగీత కళాశాల ప్రాంగణం కేరింతలతో మార్మోగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షుడు సోమేపల్లి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు వంటి వారు తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారని, అదే కోవలో కోటి ఉన్నారన్నారు. ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. 500కు పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడం సాధారణ విషయం కాదని, సంగీతమంటే కోటి.. కోటి అంటే సంగీతం అనే నానుడి ప్రజల్లో వచ్చిందన్నారు. ప్రముఖ కవి, రచయిత ఎక్సరే కొల్లూరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ సాహిత్యనిధి కన్వీనర్ సింగంపల్లి అశోక్ కుమార్ రచించిన 135వ ప్రచురణ ‘మనసున మనసై‘ పుస్తకాన్ని హాసం క్లబ్ విజయవాడ కన్వీనర్ మొలుగు కమలాకాంత్ ఆవిష్కరించి తొలి కాపీని సంగీత దర్శకుడు కోటికి అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ వాకర్స్ నాయకులు పొత్తూరి సీతారామారావు, సినీయర్ జర్నలిస్టు ఘంటా విజయ్ కుమార్, నాగార్జున కళాపరిషత్ ఉపాధ్యక్షుడు, ఎక్స్ రే సంస్థ ప్రధాన కార్యదర్శి బోడి ఆంజనేయరాజు తదితరులు పాల్గొనగా శ్రీశ్రీ, సాలూరి రాజేశ్వరరావులకు పాటల నీరాజన కార్యక్రమం అలరించింది.

SA: