పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

(పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – పుడమి తల్లి కి కీడు చేస్తే చరిత లేదు…భవిత లేదు… శ్రీమతి ఆమ్రపాలి, సీనియర్ చిత్రకారిణి.)

పర్యావరణ పరిరక్షణపై చిన్నారులకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ పర్యావరణ వేత్త, శాస్తవేత్త యలవర్తి నాయుడమ్మ 101 వ జయంతోత్సవాల సందర్భంగా శుక్రవారం విజయవాడ, బాలోత్సవ్ భవన్ మొదటి అంతస్తులో చిన్నారులు చిత్రించిన చిత్రాలతో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమం జాషువా సాంస్కృతిక వేదిక, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, 64కళలు.కాం సంయుక్త నిర్వహణలో జరిగింది.

ఈ చిత్రకళా ప్రదర్శనను తెనాలికి చెందిన ప్రముఖ చిత్రకారిణి ఆమ్రపాలి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆవిడ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకం చాలా అవసరమని పుడమి తల్లికి కీడు చేస్తే చరిత లేదు… భవిత లేదన్నారు… అలాగే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన “స్ఫూర్తి” శ్రీనివాస్ చిన్నారులనుద్ధేసించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున బాధ్యతగా మొక్కను నాటాలని… శుభకార్యాలకు, ఇంటికి వచ్చిన అతిథులకు మొక్కలను బహుమతులుగా ఇవ్వాలని.. అలాగే నగరంలో చాలా చోట్ల ప్రకటన బోర్డులతో చెట్లకు తూట్లు పొడుస్తున్నారని ప్రతి ఒక్కరూ ఆ విధానాన్ని ఖండించి చెట్లను కాపాడాలని పిలుపునిచ్చారు.

అనంతరం మరొక అతిథిగా హాజరైన 64కళలు.కామ్ ఎడిటర్ కళాసాగర్ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణకు… లెదర్ టెక్నాలజీ డెవలప్మెంట్ కి యలవర్తి నాయుడమ్మ చేసిన కృషిని చిన్నారులకు తెలియపర్చారు. “సామాన్య మానవుని కోనం విజ్ఞాన శాస్త్రం” అనే ఉత్తమ సదాశయాన్ని ఆచరణలోకి తెచ్చిన నాయుడమ్మ గొప్ప వైజ్ఞానికుడని, 1971 లో భారత ప్రభుత్వము నుండి పద్మశ్రీ పురస్కారం, రాజలక్ష్మీ సంస్థ నుండి శ్రీ రాజాలక్ష్మీ పురస్కారం అందుకున్నారని, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ శాస్త్ర సంస్థలలో సభ్యులుగా పనిచేశారన్నారు. పర్యావరణ పరిరక్షణకు – చిత్రకళని మేళవించి విద్యార్ధిని-విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయం అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న జాషువా సాంస్కృతిక వేదిక మరియు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంస్థల కృషిని ఆయన అభినందించారు.

చిత్రకారిణి ఆమ్రపాలిని, స్ఫూర్తి శ్రీనివాస్ ని, కళాసాగర్ ని సత్కరించిన అనంతరం ఈ చిత్రకళా ప్రదర్శన లో పాల్గొన్న చిన్నారులందరికీ అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. సుమారు పది విద్యాసంస్థల నుంచి చిన్నారులు విచ్చేసి చిత్రకళా ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.

ఈ కార్యక్రమానికి జాషువా సాంస్కృతిక వేదిక కార్యదర్శి గుండు నారాయణరావు వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని నడిపించగా… MBVK మహిళా విభాగం ప్రతినిధి స్వరూపరాణి, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ, కోకన్వీనర్ గిరిధర్ అరసవల్లి, సంధ్యా తదితరులు పాల్గొన్నారు.

SA:

View Comments (1)