భారతీయ నృత్య ప్రతిభాశాలిని – యామినీ

(సాంప్రదాయ శాస్త్రీయ నాట్య వటవృక్షం కూలిపోయింది! నాట్యం కోసమే జీవితాన్ని అంకితం చేసిన నాట్య తపస్విని ముంగర యామిని పూర్ణతిలకం కృష్ణమూర్తి 3 ఆగస్ట్ 2024 న తుదిశ్వాసవిడిచారు. 64కళలు.కాం గతంలో ప్రచురించిన “విశ్వమోహిని” గారి వ్యాసం మరొకసారి…)

కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రద‍ర్శనలలో తనదైన ప్రత్యేకతతో, శైలితో, ఒరవడితో రాణించి భారతీయ నాట్యకళకు దేశ విదేశాలలో విశేషమైన ఖ్యాతిని సముపార్జించి పెట్టినయామినీ కృష్ణమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, మదనపల్లిలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించారు. ఈమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. అటుపై వాళ్ల కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ, విదేశాల్లో పేరు పొందారు.

ఈమె పూర్తి పేరు యామినీ పూర్ణతిలకం. తన తండ్రి ప్రోత్సాహంతో తన 5వ ఏట చెన్నైలోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో భరత నాట్యము నేర్చుకోవడము ప్రారంభించారు. భరత నాట్యంలో ఈమె గురువులు కాంచీపురం ఎల్లప్ప పిళ్ళై, చొక్కలింగం పిళ్లై, బాలసరస్వతి, తంజావూర్ కిట్టప్ప, దండాయుధపాణి, మైలాపూర్ గౌరి అమ్మ మొదలైనవారు. వీరు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ వంటి వారి వద్ద కూచిపూడి నేర్చారు.
పంకజ చరణ్‌దాస్, కేలూచరణ్ మహాపాత్రల వద్ద ఒడిస్సీ నేర్చుకొన్నారు. ఎం.డి.రామనాథన్ దగ్గర కర్ణాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ దగ్గర వీణ శిక్షణ పొందారు. ఈమె తన తొలిప్రదర్శనను తన 17వ యేట చెన్నైలో 1957వ సంవత్సరంలో ఇచ్చారు. ఈమెకు 20 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఈమె ఒక ప్రతిభావంతురాలైన నర్తకిగా గుర్తింపు పొందారు. ఆ క్రమంలో ఈమె తన నివాసమునుమ ఢిల్లీకి మార్చారు.

వివిధ రకాల నృత్యాలను హేమాహేమీలైన గురువుల వద్ద ఎంత నేర్చుకున్నా, ఈమె తన కళతో ప్రేక్షకులను నిలవేసి “ఇది నా ఒరవడి” అని చాటే ఒకానొక విశిష్ట బాణీ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈమె ఏ బాణీ నృత్యం చేసినా వివిధ నృత్య రీతులను కలగాపులగం చేయకుండా ఆయా నృత్య సంప్రదాయాల పరిధిలోనే తన వ్యక్తిత్వాన్ని అభివ్యక్తం చేస్తారు. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నర్తనానికి ఖ్యాతి రావడానికి చాలా కాలం ముందే ఈమె అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా ఇత్యాది ఎన్నోదేశాలు పర్యటించి ఆయా చోట్ల నృత్య ప్రదర్శనలిచ్చి, భారతీయ నాట్య ప్రచారం చేసారు.ఢిల్లీలో నృత్యకౌస్తుభ కల్చరల్ సోసైటి – యామిని స్కూల్‌ ఆఫ్‌ డాన్స్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇస్తున్నారు.

“క్షీరసాగరమధన”మనే నృత్యరూపకాన్ని, దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆకాశవాణి కోసం రచించారు.
కాని దాన్ని కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో ప్రసిద్ధ, నాట్యాచార్యుడు – చింతా కృష్ణమూర్తి ప్రిన్సిపల్‌గా ఉన్న రోజుల్లో అక్కడ ప్రదర్శించ తలపెట్టి ఈ రూపకానికి నృత్యం కూర్చవలసిందిగా ప్రఖ్యాత నర్తకుడు, నాట్యాచార్యుడు వెంపటి చినసత్యంకు అప్పగించారు.
అప్పుడు ఆయన నేతృత్వంలో మొట్టమొదట ప్రదర్శించిన “క్షీరసాగరమథనం”లో యామినీ కృష్ణమూర్తి “విశ్వమోహిని” పాత్రలో, ధన్వంతరి, మహావిష్ణువు పాత్రల్లో వేదాంతం సత్యనారాయణ శర్మ నటించి ఈ ప్రదర్శనను రక్తి కట్టించారు. ఆనాటి నుండి ప్రజలు ఈమెను “విశ్వమోహిని” అని సంబోధించడం మొదలు పెట్టారు. తరువాత ఈమె ఈ క్షీరసాగరమథనం నృత్యనాటికను అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ముందు ప్రదర్శించి వారి నుండి “భామావేణీ” బిరుదును అందుకున్నారు. అంతే కాక ఈమె “భామాకలాపం”లో సత్యభామగా అవతరించే వైఖరి, “మండూక శబ్దం”లో కృష్ణదేవరాయల ప్రశస్తిని లీలగా చూపే అభినయం, భంగిమల్లోని ఠీవి, ఔచిత్యం, “సింహాసనస్థితే” శ్లోకంలో దేవిని కళ్ళకు కట్టిస్తూ పట్టే భంగిమలు, “కృష్ణశబ్దం”లో భావతీవ్రత, లాలిత్యం, వైవిధ్యం ఈమె ప్రతిభకు తార్కాణాలు. వేదాలకు కొన్ని పసందైన జతులతో ఈమె కూర్చిన నృత్యం ఈమె పాండిత్యానికి ఉదాహరణ.

యామిని సేవలను గుర్తించిన ప్రభుత్వం 1968లో పద్మశ్రీ 2001లో పద్మభూషణ్‌ 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసింది. సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా అందుకొన్నారు.2014లో మహిళా దినోత్సవం సందర్భంగా శాంభవి స్కూల్‌ ఆఫ్‌ డాన్స్‌ సంస్థ యామినికి నాట్య శాస్త్ర పురస్కారాన్ని అందించింది. ఆపై యామిని కూచిపూడి నృత్యానికి సంబంధించి డీవీడీలు విడుదల చేసారు. తన నృత్యప్రస్థానాన్ని “రేణుకా ఖాండేకర్” సహకారంతో “ఎ ప్యాషన్ ఆఫ్ డాన్స్” పేరుతో పుస్తకంగా రాసారు. నృత్యకళ పట్ల జనసామాన్యంలో అవగాహన కలిగించడానికి అభిరుచి పెంచడానికి సుమారు మూడేండ్ల పాటు పరిశోధన చేసి “నృత్యమూర్తి” సీరియల్‌ను పదమూడు భాగాలుగా ఈమె రూపొందించి దూరదర్శన్‌లో ప్రసారం చేసారు.

మన సంస్కృతీ వైభవానికి గోపురమై నర్తనశిల్పాల ఆధారంగా, స్థలపురాణాలు, చరిత్ర జోడించి వ్యాఘ్రపాద, పతంజలి సూక్తులు, కర్ణాటక సంగీతం రుచిచూపిస్తూ ఈ సీరియల్‌లో నృత్య సర్వస్వాన్ని ఇమిడ్చి చూపించారు.2017లో విశాఖపట్నంలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారు ఈమెకు స్వర్ణకమలం బహూకరించి “నాట్య విద్యాభారతి” అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. న్యూఢిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ అనే సంస్థకు ఈమె డైరెక్టరుగా సేవలను అందించారు. ఈమె వివాహం చేసుకోకుండా అవివాహితగానే వుండి నాట్యరంగానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేసారు.

ఫిలింస్ డివిజన్ ఆఫ్ ఇండియా 1971లో ఏల్చూరి విజయరాఘవ రావు సంగీత దర్శకత్వంలో “యామినీ కృష్ణమూర్తి” పై 20 నిమిషాల ఒక డాక్యుమెంటరీ సినిమా తీసింది. ఈమె ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలో వెలువడిన చందనీర్ అనే బెంగాలీ సినిమాలో తన పాత్రలోనే (డా.యామినీ కృష్ణమూర్తి) నటించారు.
రాఘవాచారి (కళాదీపిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap