తెలుగు నాటకానికి దుర్దినం… వై.కే.  మరణం

సాంస్కృతిక దిగ్గజం, యువకళావాహిని వ్యవస్థాపకులు లయన్ వై. కె. నాగేశ్వరరావు ఈ రోజు 14-4-21, బుధవారం సాయంత్రం హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసారు. వారికి నివాళులర్పిస్తూ… రెండేళ్ళక్రితం 64కళలు పత్రికలో వారి గురించి ప్రచురించిన వ్యాసంతో నాటకరంగానికి వారు చేసిన సేవలను స్మరించుకుందాం…
____________________________________________________________________

ఒకప్పటి నాటక కళారంగపు స్మృతులను నెమరు వేసుకోవాలంటే.. కాస్తంత ఓపిక చేసుకుని గతంలోకి తొంగిచూడాలి. గతకాలంతో అనుబంధంగల కొందరితోనైనా కరచాలనం చేయాలి. అవసరమైతే పెట్రోమాక్స్ లైట్లను భుజానెత్తుకొని.. అలాంటివారు ఎక్కడున్నారో వెదకాలి. అలా వెదికితేనే నాటి తెలుగునాటకపు ఉత్తేజాన్ని అందుకోగలం. ఇదేంటి? పెట్రొమాక్స్ లైట్లు.. ‘ఇదేం ఉపమానం’ అనే అనుమానం రావొచ్చు. నిజానికి, ఆ వెలుగులోంచే చాలామంది కళాకారులు ఉద్భవించారు. కళలూ పరిఢవిల్లాయి. ఆ వెలుగులోనే అనేక కళాసంప్రదాయాలు తారాడాయి. అంతేకాదు, ఆ వెలుతురు ప్రేరణగానే సినిమాలూ పుట్టాయి. అలా.. ఒకప్పుడు దీపాల వెలుగులో నాటకాలు ఆడి, తర్వాత కాలంలో విద్యుల్లత శోభితంగా నాటక కళలో పరిణితమైన ప్రతిభతో ఎదిగిన వారెందరో. అలాంటి కోవకు చెందిన వ్యక్తే యార్లగడ్డ కృష్ణ నాగేశ్వరరావు అలియాస్ వై.కె. దాదాపు 55 ఏళ్ళుగా కళారంగాన నటుడిగా, సాంస్కృతిక రంగపు సారధిగా, సినీ, టీవి, నాటకరంగంలో అనేక దార్శనికత గల కార్యక్రమాలకు వారధిగా.. ప్రభావితంగా నిలబడగలగడం అంత సామాన్యమైన విషయం కాదు. అందుకు, ఎంతో కృషి చేస్తేగానీ సాధ్యంకాదు. అలా చేయడం వల్లనే.. సాంస్క ృతిక కళారంగాన వై.కె అంటే.. నాటకం, సాహిత్యం, సినిమా, సత్కారం, కళాకారుల సంగమం. అతడి కళాజీవన విశేషాలు మీ కోసం..
ఏకళకైనా, ఏ కళాకారుడికైనా.. మూలాలనేవి పల్లెల్లోనే ఉంటాయి. మట్టివాసనలోంచే కళాభిరుచి మొదలవుతుంది. ఎక్కడో ఓ మారుమూల పల్లెటూరిలో పుట్టిపెరిగిన కుర్రాడు..తర్వాత కాలంలో ఎన్టీఆర్, అక్కినేని వంటి నటుల సమక్షంలో పెళపెళమంటూ నాటక సంభాషలు చెప్పేలా ఎదగడం అంటే.. ఏదో విషయం ఉండనే ఉండాలి. అదే.. అయన్ని అడిగినప్పుడు.. ఆ అసలు విషయం తన ఊరే అంటారు వై.కే. దాదాపు నాలుగున్నరేళ్ళ కళారంగపు అనుభవం సంతరించుకోవడానికి.. ఒకప్పుడు పుట్టిపెరిగిన ఊరు, ఆ చుట్టుపక్కల వాతావరణమే కారణమంటూ.. ఎంతో సంబరపడుతూ.. మరోసారి తన ఊరిని వెదుక్కుంటూ అరవై ఏళ్ళ వెనక్కివెళతారాయన.
మాఊరు.. మా నాటకం
ఒకప్పుడు సమాజాన ప్రధానమైన వినోదపు కళ నాటకమే. అందునా గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతం నాటక సమాజాలకు, కళాకారులకు కేరాఫ్ అడ్రస్గా ఉండేది. పీసపాటి, షణ్ముకి ఆంజనేయరాజు, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, రఘురామయ్య, ఏ.వి.సుబ్బారావు, డీవి.సుబ్బారావు… ఇలా ఎందరో నాటకప్రముఖుల నాటకాలతో తెనాలి పట్టణం నిత్యం కళకళలాడేది. ఇదే జిల్లా, దుగ్గిరాలకు సమీపంలోని మంచికలపూడి గ్రామానికి చెందిన వై.కె పైనా ఈ నాటకాల ప్రభావం బాగానే పడింది. తొమ్మిది, పదవ తరగతిలో ఉండగానే.. ఊళ్ళో సొంతంగా ‘శిధిల హృదయాలు’ అనే నాటకం రూపొందించారాయన. ఇలా.. బాల్యంలోనే అదరక బెదరక ఊరి జనాల ముందు అదిరిపోయే ప్రదర్శన ఇవ్వడంతో వై.కె రంగస్థల ప్రస్థానం మొదలైంది.
‘మా ఊరు.. చూడ్డానికి మారుమూల ప్రాంతమైనాగానీ, మా తరానికి ముందువాళ్ళూ ఊళ్ళో బాగా నాటకాలు ఆడేవారు. మాకు దగ్గరలోని దుగ్గిరాల, కొలకలూరులో టిక్కెట్ నాటకాలూ ఆడేవారు. మేమైతే తెనాలి వెళ్ళి మరీ నాటకాలను చూసొచ్చే వాళ్ళం. నిజానికి నేను ఎనిమిది, తొమ్మిది తరగతిలో ఉండగానే ‘మహావిష్ణువు’గా పెద్దవాళ్ళతో కలిసి ఓ నాటకం చేశాను. ఎందుకో చుట్టుపక్కల నాటకాల ప్రభావం వల్లనో, గొప్పగొప్ప నాటక కళాకారుల పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలు చూడ్డవల్లనోగానీ స్కూళ్ళో చదివే వయసులోనే నాటకం రూపొందించాలి. ఆడాలి.. అనే తపన నాలో ఉండేది. నాటకాలతోపాటు సినిమాలూ బాగానే చూసేవాడ్ని. అయితే ఖరీదైన సినిమా కళను అందుకోవడం అంత తేలికైన విషయంకాదు, నాటకం అయితే చేయదగ్గ, అందుబాటులో ఉన్న కళ. అందుకే, నాటకంపై మనసుపడింది. అందుకు నేను పడ్డ తిప్పలుకూడా అలాంటివే” అంటూ తొలినాటి నాటక ప్రయాసల్ని గుర్తుచేసుకున్నారు నాగేశ్వరరావు.

పెట్రొమాక్స్ వెలుతుర్లో ….
‘అప్పట్లో కాగడాలు, లాంతర్లు వెలుగులోనే కళాప్రదర్శనలు చేసేవారట..’ అని విచిత్రంగా చెప్పుకుంటాం. ఆ లాంతర్ల ప్రహసనం అరవై, డబ్బై దశకాల్లోనూ కొనసాగింది అనడానికి వై.కె నాటక అనుభవమే ఓ ఉదాహరణ. ‘1966, 67 ప్రాంతాల్లో.. అప్పటికి ఇంకా మాఊళ్ళో కరెంటు సౌకర్యం లేదు. అయితే అప్పటికే నా బుర్రలో సొంతంగా ఏదో ఒక నాటకం వేయాలనే ఆలోచన బాగా తొలుస్తూ ఉండేది. అందుకోసం ఒక రచయితను పట్టుకుని నాటకం రాయించి, ఊర్లో కొంతమందిని పోగు చేసి వాళ్ళతో సాధన చేయించేవాడిని. గమ్మత్తైన విషయం ఏమంటే.. నాతోపాటు నాటకం వేసిన చాలామందికి చదువురాదు. అందువల్ల నాటకంలోని పాత్రలన్నీ నేనే చదివి, వాళ్ళకు నేర్పించి, వాళ్ళను బతిమాలో బామాలో.. మొత్తానికి నాటకం రూపొందించా. రాత్రిళ్ళు నాటకం ఆడాలంటే.. కరెంట్ కావాలి. కానీ కరెంట్లేని ఊళ్ళో నాటకం ఆడ్డం కోసం పెట్రోమాక్స్ లైట్లు స్తంభాలకు తగిలించి.. ఆ వెలుతురులో నాటకాలు ఆడేవాళ్ళం.. ‘శిధిల హృదయాలు, రక్తపాశం, రౌడీరంగడు’ ఇలా.. స్కూల్ ఫైనల్ దాకా ఊళ్ళో ఓ టీమ్గా ఏర్పడి, కనీసం ఏడాదికో కొత్తనాటకం ఆడేవాళ్ళం’ అంటూ అప్పటి నాటక విశేషాలను గుర్తుచేసుకున్నారు వై.కె.

ఉద్యోగం.. నాటకం
ఊరు వదిలి.. పట్నం రావడం అంటే.. ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలనే ప్రయత్నంలోనే వస్తుంటారు చాలామంది. వై.కె మాత్రం.. పేరుకి ఉద్యోగం వెదుకులాట అని ఇంట్లో చెప్పివచ్చినాగానీ.. తనలోని కళను మరింత పదునుపెట్టుకోవాలి అనే తపనతోనే నగరంలోకి అడుగుపెట్టారాయన. కళారంగంలో రాణించాలంటే.. ఏదో ఒక ఆధారం కావాలి. ఆధారం దొరికాక.. నచ్చిన అభిరుచికి మరింత పదును పెట్టుకోవచ్చు.. అనే ఒక లక్ష్యంతో.. ప్రణాళికతో ముందుకుసాగారు. ‘దుగ్గిరాల్లో స్కూల్ ఫైనల్, తెనాలి విఎస్ఆర్ కాలేజీలో పీయూసి పూర్తయ్యాక 74, 75 ప్రాంతంలో హైదరాబాద్ వచ్చేశా. కారణం మా బంధువులు కొందరు అక్కడ సెటిలయ్యారు. నాకున్న నాటకాల పిచ్చి వల్ల చదువు సరిగ్గా సాగదని నన్ను హైదరాబాద్కి పంపేశారు. ఇక్కడే డిగ్రీ పూర్తి చేశాను. మావయ్యగారి అమ్మాయితో వివాహం జరిగింది. గృహకల్పలో ఉద్యోగం వచ్చాక మళ్ళీ 1977 నుంచి చురుగ్గా నాటకాలు ఆడ్డం మొదలైంది.

ఇక్కడ మీకో విషయం చెప్పాలి. హైదరాబాద్ వచ్చాక ఎన్టీఆర్పై ఉన్న అభిమానంతో తరచూ ఆయన్ని కలుస్తూ ఉండేవాడిని. నటన, క్రమశిక్షణ వంటి విషయాలపై ప్రభావితమై.. పని ఉన్నా లేకున్నా.. వీలున్నప్పుడల్లా ఆయన్ని కలిసేవాడ్ని. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాక.. ఆయన్ని కలవడం తగ్గినాగానీ, ఆయన వదిలి వెళ్ళిన నటనా స్ఫూర్తి నాటకాలపై మరింత శ్రద్ధపెట్టేలా చేసింది. నిజానికి ఎన్టీఆర్ నన్ను రాజకీయాల్లోకి రమ్మనీ ఆహ్వానించారు. కానీ ధైర్యం సరిపోలేదు. అలాగే, ఆయనతో నాకు స్నేహం ఉందికదా? అని ఏరోజూ సినిమాల్లో అవకాశం ఇమ్మనీ అడగలేదు. ఎందుకనో నాటకాలపైనే ధ్యాసెక్కువ ఉండేది. అప్పట్లో పద్మశ్రీ ఏఆర్ కృష్ణ నిర్వహణలో హైదరాబాద్లో నటవిద్యాలయం కొనసాగేది. అందులో అధ్యాపకులుగా పనిచేసిన సి.రామలింగశాస్త్రి దగ్గర నటనలో కొన్నాళ్ళపాటు శిక్షణ పొందాను.’

చారిత్రక నాటకాల్లో ఆరితేరి …
‘పౌరాణిక నాటకాలు ఆడితే.. పేరొస్తుంది. సాంఘిక నాటకాలాడితే.. ప్రదర్శనావకాశాలు ఎక్కువ వస్తాయి. అయితే చారిత్రక నాటకాలకు పేరొచ్చినాగానీ ప్రదర్శనా అవకాశాలు పెద్దగా రావు. అయితే, నా సుదీర్ఘ నట ప్రస్థానంలో చేసినవన్నీ చారిత్రక నాటకాలే’ అంటూ అందుకుగల కారణాలను చెప్పుకొచ్చారు వై.కె. ‘అప్పటికే నాలా ఉద్యోగాలు చేస్తూ కళల పట్ల అభిరుచి ఉన్న కొంతమంది స్నేహితులం కలిసి 1974లో ‘యువ కళావాహిని’ సాంస్కృతిక సంస్థగా ఏర్పడ్డాం. ఎప్పుడంటే అప్పుడు పరిషత్ నాటకాలు ఆడ్డానికి ఉద్యోగస్తులకు తీరుబడి ఎలాగూ ఉండదు. అందుకే పరిషత్ నాటకాల జోలికి పోకుండా.. సమయానికి తగ్గట్టుగా ప్రత్యేక నాటకాలపై దృష్టిపెట్టాం. ఆ క్రమంలోనే 1988లో ‘సామ్రాట్ ఆశోక’ చారిత్రక నాటకాన్ని రెండేళ్ళు కష్టపడి రూపొందించాం. భారీ రంగాలంకరణ, పాత్రలకు తగ్గట్టుగా ఆహార్యం రూపకల్పన, సంగీతం వంటి విషయాల్లో సినిమాను తలపించాలనే తపనతో బాగానే ఖర్చుచేశాం. దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ సుమారు నలభైౖ ప్రదర్శనలు ఆడాం. తర్వాత ‘విక్రమాదిత్య’, గౌతమబుద్ధ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, శ్రమణకం, ఆ క్రమంలోనే స్వామి వివేకానంద, రాణాప్రతాప్ ఇలా చరిత్ర, చారిత్రక నేపథ్యంగల పలు నాటకాల్ని చేశాం. దాదాపు అన్ని నాటకాల్లోనూ టైటిల్ పాత్రలే ధరించా.
మొత్తం నాటకరంగ ప్రయాణంలో ఇప్పటిదాకా నటుడిగా వెయ్యికి పైగా నాటకాలు ఆడాను. అందులో ‘స్వామి వివేకానంద’ నాటకమే 150 ప్రదర్శనలు ఆడాం’ అంటూ సుదీర్ఘనాటక ప్రస్థానంలోని కొన్ని ముఖ్యాంశాలను ఉదహరించారు వై.కె. నటన, సాంస్కృతికరంగ కార్యక్రమాలతోపాటు సినిమా, టీవి, రంగస్థలం, సాంస్కృతిక సంస్థలు, కళాకారులు, కళారంగాలకు చెందిన వివరాలతో చనిపోయిన తన కుమారుడు పేరిట గత రెండు దశాబ్దాలుగా ఏటా ‘గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ’ని తీసుకొస్తున్నారు. ఇందుకోసం పడ్డ శ్రమ అన్నిటికంటే కష్టమైందని, ఎంతో విలువైందంటారు వై.కె.
ముందే అనుకున్నట్టుగా.. నాటకమే కాదు, రేడియో, దూరదర్శన్తోనూ నటుడిగా వై.కె అనుభవం అపారమైంది. ఇక ‘యువ కళావాహిని’ వ్యవస్థాపకుడిగా గత 45 ఏళ్ళుగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు లెక్కేలేదు. అందులో అక్కినేని నాటక పరిషత్ వంటి రంగస్థల కార్యక్రమాలు మొదలుకొని, కళారంగ పురస్కారాలు, సాహిత్య అవార్డులు, నృత్యం, సంగీతం, వెండితెర కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూపోతే.. ‘యువ కళావాహిని’ తరపున వై.కె నిర్వహిస్తున్న విభిన్న కార్యక్రమాల జాబితా లెక్కల్లో తేలేది కాదు. యువ కళా వాహిని ఆధ్వర్యంలో ఇటీవల రవీంద్రభారతిలో స్వామి వివేకానంద నాటకం 150 ప్రదర్శనలు పూర్తి చేసిన సందర్భంగా  విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అందుకున్నారు. ఒకపక్క నాటకరంగపు నటుడిగా తన ఉనికిని కాపాడుకుంటూనే సాంస్కృతిక రంగాన శిఖరాయమానంగా అలుపెరగని సేవలందించారు..!

– గంగాధర్ వీర్ల
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

యువకళావాహిని వై కె కనుమూత!

సాంస్కృతిక దిగ్గజం, యువకళావాహిని వ్యవస్థాపకులు లయన్ వై. కె. నాగేశ్వరరావు ఇక లేరు!
యువకళావాహిని నాలుగున్నర దశాబ్దాల క్రితం స్థాపించి వేలాది సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, నటుడిగా చారిత్రాత్మక నాటక ప్రదర్శనలు, చర్చా వేదికలు, సాంస్కృతిక సభలకు అధ్యక్షులుగా ఎన్నో ఎన్నెన్నో చేసి జీవితాన్ని సాంస్కృతిక రంగానికి అంకితం చేసిన మహానుభావులు నాగేశ్వరరావు గారు. సహకార శాఖ లో ఉద్యోగం చేస్తూ, మరో వైపు నాటకోత్సవాలు నిర్వహిస్తూ మమేకం అయిపోయారు. పదవీ విరమణ తరువాత పూర్తిగా సాంస్కృతిక రంగానికి అంకితం అయ్యారు. స్వామి వివేకానంద నాటకం లో ప్రధాన పాత్రను పోషించి అమెరికా తో పాటు దేశం లోని అనేక నగరాల్లో 150 ప్రదర్శనలు పూర్తీ చేసి రికార్డ్ సృష్టించారు!

మహా రచయితల పేరిట పురస్కారాలు నెలకొల్పి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. కరోనా టైం లో సైతం రికార్డ్ స్థాయి లో రోజుకో కార్యక్రమం నిర్వహించారు. అక్కినేని నాటకోత్సవాలు ప్రతి ఏటా జరుపుతున్నారు. గత మూడేళ్ళుగా ప్రతి నెల జానపద కళాకారులకు నగదు పురస్కారాలు అందిస్తూ వస్తున్నారు. ఎప్పుడూ ఏదొక కార్యక్రమం చేయాలనీ తపిస్తుంటారు! ఇద్దరం కలసి వందలాది కార్యక్రమాల్లో అతిధులుగా పాల్గొన్నాం. మంచి ఆత్మీయ మిత్రులు. ప్రతి కార్యక్రమం గురించి నాతో చర్చించే వారు. ఇవాళ ఉదయం శోభానాయుడు జయంతి లో నాగేశ్వరరావు గారికి ప్రత్యేక సన్మానమ్ వుంది. రాలేను ఆరోగ్యం సహకరించడం లేదంటూ ఫోన్ లో నాతో చాలా సేపు మాట్లాడారు. జలుబు తీవ్రంగా వుంది, దగ్గు ఇబ్బంది పెడుతోంది అన్నారు. కరోనా రాపిడ్ టెస్ట్ లో నెగటివ్ వచ్చింది అన్నారు. రెస్ట్ తీసుకోండి అన్నాను. కాసేపటి క్రితం పల్స్ పడిపోవడం, ఆసుపత్రికి తరలించడం, గుండె పోటు అని వైద్యులు నిర్ధారించడం అంతా నిముషాల్లోనే జరిగిపోయింది. సాంస్కృతిక రంగం ఒక మహా యోధుడ్ని మంచి మానవత్వం వున్న నిర్వాహకుడిని కోల్పోయింది. ఇది సాంస్కృతిక రంగానికి తీరని లోటు. అశ్రు నివాళి
-మహమ్మద్ రఫీ 

____________________________________________________________________
ఇంతలో ఏమయ్యింది మిత్రమా!
మధ్యాహ్నం గంటసేపు మాట్లాడావు వైకె. ఇంతలో ఏమయ్యింది మిత్రమా! వివేకానంద, గౌతమబుద్ధ పాత్రలకు నీకు నీవే సాటి. 1995 లోనే అనేక పౌరాణిక నాటకసప్తాహాలు చేసిన గొప్ప సమన్వయ కర్త. యువకళావాహిని అధినేత. సారిపల్లి వారి సౌజన్యం పేదకళాకారులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పంచిన పుణ్యమూర్తి. అనేక కార్యక్రమాలు మీతో కలిసి పంచుకున్న మధురానుభూతి ని మిగిల్చి అర్ధాంతరంగా వెళ్లిపోయావా నేస్తం.ఆత్మీయుడు వైకె నాగేశ్వరరావు లేడనే వార్త నమ్మలేక పోతున్నా.నీపవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ. శోకతప్త హృదయం తో..

గుమ్మడి గోపాలకృష్ణ, ఏపి నాటక ఎకాడమీ మాజీ చైర్మన్.
_____________________________________________________________________
ఆ గౌరవం ఆయనకే దక్కుతుంది…
వై.కె. నాగేశ్వరరావు గారి హఠాన్మరణ వార్త నా గుండెల్ని పిండేసింది. ఎంత సంస్కారవంతమైన మాట, ఎంత మర్యాదతో కూడిన ప్రవర్తన. ఆ గౌరవం ఆయనకే దక్కుతుంది. ఎంత గొప్ప కార్యక్రమాన్నైనా,తన కంటిచూపు తోనేనిర్వహించే దక్షత కలిగేవారు. ఆయన సహృదయత తో యువకళా వాహిని ఆర్థిక సహకారం పొందిన కళాకారుడినే నేను కూడా…
“కళా మిత్ర” అడివి శంకరరావు.
మేకప్ ఆర్టిస్ట్-హైదరాబాద్.
______________________________________________________________________

ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాహిత్య కళారంగాలు వెన్నెముకను కోల్పోయినాయి. మృదు స్వభావి, స్నేహా శీలి 2016 లో నన్ను వారి గురుజాడ పురస్కారం తో సత్కరించిన మిత్రమణి లయన్ Y.K.నాగేశ్వరరావు గారు ఆకస్మికంగా నటరాజైక్యం చెందటం నన్ను తీవ్రంగా కలిచివేచింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని నటరాజుని ప్రార్ధన చేస్తున్నా.
వారి కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.
మన్నే శ్రీనివాసరావు, నటులు, రచయిత
_________________________________________________________________________

కళ కోసం నిరంతరం తపించి అనేకానేక కార్యక్రమాలు అశ్రమంగా అవిశ్రాంతంగా నడిపించిన Y.K. నాగేశ్వర రావు గారు నిష్క్రమించడం అత్యంత బాధాకరం. వారు నటరాజు సాన్నిధ్యానికి చేరతారనడం, సత్య దూరం కాదు.
డా. మీగడ రామలింగస్వామి, నాటక రచయిత, నటులు

2 thoughts on “తెలుగు నాటకానికి దుర్దినం… వై.కే. మరణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap