వై.కె. నాటక కళా పరిషత్ నాటకోత్సవాలు

(ఉర్రూతలూగించిన గజల్ శ్రీనివాస్ గానలహరి)
సాంస్కృతిక దిగ్గజం లయన్ వై.కె.నాగేశ్వరరావు నాటక కళా పరిషత్ ద్వితీయ నాటకోత్సవాలు నాలుగు రోజుల పాటు దిగ్విజయంగా జరిగాయి. వై.కె. వర్ధంతి సందర్భంగా గుంటూరు ఎల్.వి.ఆర్. క్లబ్ లో వైష్ణవి ఫిలిమ్స్ అట్లూరి నారాయణరావు సౌజన్యంతో కళా విపంచి, ఎన్టీఆర్ కళా పరిషత్, ఆరాధన ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 14 వరకు నిర్వహించారు. చివరి రెండు రోజులు నేను స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాను. వై.కె. అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. వై.కె. తో వున్న జ్ఞాపకాలు, వారి సేవలు గుర్తు చేసుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

వై.కె. కు అత్యంత ఆత్మీయులయిన మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ రెండు రోజులు అక్కడే ఉండి ఉత్సవాలను సక్సెస్ చేశారు. ముగింపు ఉత్సవాల్లో గంటన్నర పాటు గజల్స్ గానం చేసి ఉర్రూతలూగించి వై కె కు ఘన నివాళులు అర్పించారు.
తొలి రోజు కె.కె.ఎల్. స్వామి దర్శకత్వంలో బోరివంక శ్రీకాకుళం కళాకారులు కొత్త పరిమళం నాటిక ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కొప్పోలు కళాకారులు ప్రదర్శించిన పక్కింటి మొగుడు నాటిక అందరిని ఆకర్షించింది. రెండవ రోజు విశ్వశాంతి, హైదరాబాద్ వారు బి.యం. రెడ్డి దర్శకత్వంలో గ్రహణం, రసఝరి పొన్నూరు కళాకారులు వై. ఎస్. కృష్నేశ్వరరావు దర్శకత్వంలో ‘కాపలా’ ప్రదర్శించగా రెండు ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయి. మూడవ రోజు హైదరాబాద్ కళాంజలి వారు కొల్లా రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రదర్శించిన రైతే రాజు నాటికకు విశేష స్పందన లభించింది. వై.కె. వర్ధంతి రోజు ప్రత్యేకంగా గుంటూరు, బృందావన్ గార్డెన్స్ బాలాజీ మండపంలో నిర్వహించిన కార్యక్రమం లో గాయని పద్మశ్రీ త్యాగరాజు దంపతులు అన్నమయ్య గీతాలు ఆలపించారు. లక్ష్మి రామరాజు వీణా నాదం తో ఘన నివాళులు అర్పించారు.

వై.కె. స్మారక రంగస్థల పురస్కారాలతో పాలకొల్లు నాటక కళాపరిషత్ అధ్యక్షులు మేడికొండ శ్రీనివాసరావు, కాకినాడ కు చెందిన నాటక ప్రయోక్త సి.ఎస్. మూర్తి, ఆహార్యం కళాకారుడు అడవి శంకరరావు, నాటక పిపాసి బొబ్బిలిపాటి సాయి, అద్దేపల్లి రాజ్ కుమార్, వీణా విద్వాంసురాలు లక్ష్మి శ్రీనివాస్ రామరాజు, గాయని పద్మశ్రీ, నటి జయ, తబలిస్ట్ కాజ గంగాధర్ తిలక్ లను సత్కరించారు. ఈ వేడుకల్లో పూర్వ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, డాక్టర్ గజల్ శ్రీనివాస్, డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, డాక్టర్ మహ్మద్ రఫీ, కథక్ నాట్యగురు అంజిబాబు, కావూరి సత్యనారాయణ, బి. వేదయ్య, దోగిపర్తి శంకరరావు, సి.హెచ్. మస్తానయ్య, నూతలపాటి సాంబయ్య, సి.ఎస్. ప్రసాద్, ఎల్.వి.ఆర్. క్లబ్ కార్యదర్శి వై. దుర్గారావు, కొశాధికారి ఎం.శివకుమార్, ఎన్. ఆంజనేయులు, న్యాయమూర్తి జి. రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కళా విపంచి బొప్పన నరసింహారావు (బుజ్జి), జి. మల్లికార్జునరావు, జి.వి.జి. శంకర్, ఎన్టీఆర్ పరిషత్ కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్, ఆరాధన ఆర్ట్స్ డి. తిరుమలేశ్వరరావు సమన్వయం చేశారు.

డా. మహ్మద్ రఫీ

1 thought on “వై.కె. నాటక కళా పరిషత్ నాటకోత్సవాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap