బుద్ధప్రసాద్ కు జీవన సాఫల్య పురస్కారం

సాంస్కృతిక శిఖరం వై.కె.నాగేశ్వరరావు గారిని అందరూ స్మరించుకుంటున్నారు. నాగేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా జంట నగరాల్లోని పలు సాంస్కృతిక సంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమి వారు శుక్రవారం (22-4-22) హైదరాబాద్, త్యాగరాయ గానసభ లో వైవిధ్య కార్యక్రమం నిర్వహించి వై.కె.గారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రత్యేకంగా వై.కె.స్మారక జీవన సాఫల్య పురస్కారం, వై.కె.ఆప్త మిత్ర పురస్కారాలను ప్రవేశపెట్టారు. అలాగే ప్రముఖ గాయకుడు దివంగత కె. వెంకటరావు స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. పురస్కార గ్రహీతలకు సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి బండారు సుబ్బారావు, శృతిలయ చైర్మన్ డాక్టర్ బి.భీంరెడ్డి ఆశీస్సులు అందించారు.

శృతిలయ సంస్థ ఏ కార్యక్రమం చేపట్టినా తొలుత జరిగే సినీ సంగీత విభావరిలో లీడ్ సింగర్ వెంకట్రావుగారే. అలాగే సభాధ్యక్షులుగా తొలుత మాట్లాడేది వై.కె.నాగేశ్వర రావుగారే. వీరిద్దరూ తమ సంస్థ కు రెండు కళ్ళు లాంటి వారని శృతిలయ అధినేత్రి శ్రీమతి ఆమని తెలిపారు. వారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నదని, ఆ లోటు ఎన్నటికీ తీరనిదని కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు.
సాంస్కృతిక దిగ్గజం వై.కె.నాగేశ్వరరావు స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రాజకీయ దిగ్గజం, పూర్వ డిప్యూటీ స్పీకర్, పూర్వ మంత్రివర్యులు మండలి బుద్ధప్రసాద్ స్వీకరించారు. గాయకుడు కె.వెంకట్రావు స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని ఆలిండియా రేడియో పూర్వ డిప్యూటీ డైరెక్టర్, గాయకుడు శ్రీ చంద్రతేజ అందుకున్నారు.

వైకె నాగేశ్వరరావు ఆప్త మిత్ర పురస్కారాలు, నూతన వస్త్రాలతో తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, ప్రముఖ సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు వంశీ ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ వంశీ రామరాజు, యువకళావాహిని అధ్యక్ష ఉపాధ్యక్షులు లంక లక్ష్మి నారాయణ, బొప్పన బుజ్జి, శ్రీ భాగిశాస్త్రి, జి.వి.ఆర్. ఆరాధన వ్యవస్థాపకులు గుదిబండి వెంకటరెడ్డి, ఆరాధన అధినేత లోకం కృష్ణయ్య, కథక్ నాట్యగురువు అంజిబాబు, కనకదుర్గ నృత్య విభావరి నాట్య గురువు శ్రీమతి నిర్మల ప్రభాకర్, ఆదర్శ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కుసుమ భోగరాజు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, పాత్రికేయులు పవన్ కుమార్ లను సన్మానించారు. వీరంతా వై.కె.నాగేశ్వరరావు గారికి అత్యంత ఆప్తులు కావడం విశేషం.
పురస్కారాల ఎంపిక కమిటీ చైర్మన్ గా డాక్టర్ మహ్మద్ రఫీ వ్యవహరించారు. శృతిలయ సంస్థ కార్యదర్శి, నవరస గాయని శ్రీమతి ఆమని, శ్రీ చంద్రశేఖర్ పర్యవేక్షించారు. ఇదే వేదిక పై కనకదుర్గ నృత్య విభావరి శ్రీమతి నిర్మల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆమని గారిని వై.కె.స్మారక పురస్కారం తో ప్రత్యేకంగా సన్మానించడం విశేషం.
ఈ సందర్భంగా ఆమనిగారి నేతృత్వంలో శ్రీ చంద్రతేజ, శ్రీమతి వి.కె.దుర్గ, శ్రీ సుభాష్, శ్రీ బి.శ్రీనివాస్, శ్రీ రాజన్ తదితరులు ఎస్.జానకి పాటలు ఆలపించి “స్నేహని కన్నా మిన్న లోకాన లేదురా” అనే సందేశాన్ని చాటిచెప్పారు. ఎ.తులసీరాం, పి.ఎం.కె.గాంధీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
-మహ్మద్ రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap