ఆకట్టుకుంటున్న చిత్రకళా ప్రదర్శన

 యోగి వేమన విశ్వవిద్యాలయం, లలితకళల విభాగ విద్యార్థుల బృంద ప్రదర్శన
మూడు రోజులపాటు కొనసాగనున్న చిత్రకళా ప్రదర్శన

మంచి వర్ణచిత్రాలు మనసుకు ఉల్లాసాన్నివ్వటమేకాక, సమాజానికి విలువల్ని నేర్పిస్తాయని, ఆంధ్రప్రదేశ్ విద్యామండలి ఛైర్మన్, ప్రొ. హేమచంద్రారెడ్డి అన్నారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం, లలితకళల విభాగ విద్యార్థులు రూపొందించిన వర్ణచిత్ర ప్రదర్శన ఎల్గొరాడో – 2020 ని, గురువారం(19-03-20) నాడు,విజయవాడలో, కల్చర్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి (సిసివిఎ) లో ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ప్రదర్శనలోని వర్ణచిత్రాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలకు అద్దం పడుతున్నాయని, ఈ ప్రదర్శన ఏర్పాటుకు తగిన ప్రోత్సాహాన్నిచ్చిన యోగి వేమన విశ్వవిద్యాలయ, ఉపకులపతి, ఆచార్య ఏం. సూర్యకళావతి, లలిత కళల శాఖ విభాగాధిపతి డా. కోట మృత్యుంజయరావు, అధ్యాపకులను ఆయన అభినందించారు. విశిష్ట అతిథిగా హాజరైన యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యకళావతి మాట్లాడుతూ, లలితకళా విభాగ విద్యార్థులు జాతీయ స్థాయి ప్రదర్శనల్లో పాల్గొనటానికి తగిన తర్పీదు, సహకారం అందిస్తామని, విద్యార్థులు ప్రదర్శించిన వర్ణచిత్రాలు ప్రకృతి అందచం దాలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. కల్చర్ సెంటర్, సీఈవో, డా. ఈమని శివనాగి రెడ్డి, చిత్రకళా ప్రదర్శన వివరాలను అతిథులకు తెలియజేశారు.

ఈ ప్రదర్శనలో ఉంచిన బి.ఎఫ్.ఏ చివరి సంవత్సరం విద్యార్థులు కళ్యాణ్, మణికంఠ , నరసింహారెడ్డి, రవి, శంకర్, సోమశేఖర్, సౌజన్య , సుహాసిని, వెంకటలక్ష్మి, అధ్యాపకులు మనోహర్ రామ, సంతోష్, వెంకటేష్ చిత్రించిన 65 వర్ణచిత్రాలు, 5శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కే.ఎల్.యు, లలిత కళలు విభాగాధిపతి, డా. గోమతి గౌడ, చిత్రం ఆర్ట్స్ సంచాలకులు చిత్రం సుధీర్, మీనాక్షి ఆర్ట్స్ అండ్ హ్యాండ్ క్రాప్స్ వెల్ఫేర్ సొసైటీ, అధ్యక్షురాలు, కె. మీనాక్షి, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, అధ్యక్షులు, గోళ్ల నారాయణరావు, డా. గుమ్మా సాంబశివరావు, రజనీ రెడ్డి, సర్వోదయ హితేష్ , చిత్రకారులు, కళాసాగర్, కొలుసు సుబ్రమణ్యం, టీవీ, కమతంగాంధీ, ఇంకా నగర చిత్ర కారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరైనారని కల్చర్ సెంటర్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఈ ప్రదర్శన శనివారం వరకూ కొనసాగుతుందని, ఉ. 10.00 గం. ల నుంచి సా. 7.00 గం. వరకూ అందరూ చూడవచ్చని ఆయన చెప్పారు. చిత్రాలకు ఎంచుకున్న నేపథ్యాలు కోడిపుంజు, తామరపూలు, అరటి గెలలు, మానవ రూపాలలో అంతర్లీనంగా సుడులు, శిల్పాలు, పక్షి గూళ్ళు తదితర అంశాలు ప్రేక్షకులను విశేషంగా అకట్టుకున్నాయి.

SA:

View Comments (1)