
కేరళలోని తిరువల్లాలో జన్మించి, ప్రస్తుతం దుబాయిలో నివసిస్తూ. ఐదేళ్ల వయసులోనే కంప్యూటర్‌ల పట్ల ఆసక్తిని చూపిస్తూ, HTML, CSS లాంటి కోడింగ్ భాషలు నేర్చుకొని, 9 ఏళ్ళ వయసులోనే తొలి “ఆండ్రాయిడ్ యాప్” ను రూపొందించి, 13 ఏళ్ళ వయసులో “ట్రైనెట్ సొల్యూషన్” అనే డెవలపర్ కంపనీ స్థాపించి, దానికి “సిఈఓ” అయ్యాడు ఆదిత్యన్ రాజేష్. ఆయన విజయ గాథ ఈ రోజు మీ కోసం.
ఆదిత్యన్ కేరళ రాష్ట్రంలోని తిరువల్లాలో జన్మించాడు. ఆదిత్యన్ కు ఒక చెల్లెలు వుంది. తండ్రి రాజేష్ నాయర్ ఉద్యోగ రీత్యా ఆదిత్యన్ 4 ఏళ్ళ వయసున్నప్పుడే దుబాయ్ కి వచ్చి స్థిరపడ్డారు.
టెక్నాలజీ దిశగా అడుగులు: ఆదిత్యన్ కు చిన్నప్పటి నుండే టెక్నాలజీ పట్ల ఆసక్తిగా వుండేది. 5 సంవత్సరాల వయసులోనే అతనికి కంప్యూటర్లపై వున్న ఆసక్తిని గమనించి, అతని తండ్రి బిబిసి టైపింగ్ వెబ్ సైట్‌ను పరిచయం చేసినప్పుడు అతనికి టెక్నాలజీపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఆదిత్యన్ ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గేమ్స్, స్పెల్లింగ్ బీ వంటివి నేర్చుకుంటూ సమయం గడిపేవాడు. తర్వాత కోడింగ్, డిజైన్ లాంటి అంశాల్లో ఆసక్తి పెరిగింది. కేవలం 6 ఏళ్ల వయసులోనే హెచ్.టి.ఎం.ఎల్., సి.ఎస్.ఎస్. లాంటి కోడింగ్ భాషలను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అలా టెక్నాలజీ పై శ్రద్ధ పెట్టి, కేవలం 9 ఏళ్ల వయసులోనే “ఆండ్రాయిడ్ యాప్” ను రూపొందించి, తొలి విజయం వైపు అడుగు వేశాడు.
సాఫ్ట్ వేర్ కంపనీ స్థాపన: కోడింగ్ నేర్చుకొని, ఆదిత్యన్ 9 ఏళ్ల వయసులో ఆండ్రాయిడ్ యాప్ రూపొందించాక, ఆదిత్యన్ 13 ఏళ్ళ వయసులో తన స్నేహితులతో కలిసి దుబాయిలో “ట్రైనెట్ సొల్యూషన్” అనే పేరుతో సాఫ్ట్‌వేర్ డెవలపర్ కంపెనీని స్థాపించాడు. ఇప్పటి వరకు వారు 12 కస్టమర్ల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశాడు. ప్రస్తుతం తన స్కూల్ కోసం క్లాస్ మేనేజ్‌మెంట్ యాప్‌పై పనిచేస్తున్నాడు. ఇంకా, అతను వర్చువల్ ప్రపంచంలో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లకు ప్రత్యామ్నాయ మార్కెట్ ప్లేస్ అయిన ఆప్టాయిడ్‌ను కనుగొన్నాడు మరియు అక్కడ తన యాప్‌లను అప్‌లోడ్ చేయడం కూడా ప్రారంభించాడు.

ఆదిత్యన్ “A Craze” అనే యూట్యూబ్ చానెల్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. ఇందులో టెక్నాలజీ, కోడింగ్, గేమింగ్, వెబ్ డిజైన్ వంటి అంశాలపై వీడియోలు తయారుచేసి, అందులో పొందుపరుస్తున్నాడు. ఆదిత్యన్ కు లక్షలాది మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ట్రైనెట్ సొల్యూషన్ కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం తన లక్ష్యం అంటున్న పిన్న వయసులోనే ఒక ఐటి కంపెనీకి సి.ఈ.ఓ. అయిన ఆదిత్యన్ రాజేష్ విజయ గాథ. ఆయన సక్సెస్ స్టోరీ ఎంతోమంది యువతకు స్పూర్తినిస్తుందని ఆశిస్తూ, మరో విశిష్ట వ్యక్తి సక్సెస్ స్టోరీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
–మధుసూదన్ మామిడి
సెల్ నం. 8309709642