సామాన్యుని వరించిన అసమాన్య ‘పురస్కారం’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ఇచ్చే YSR జీవన సాఫల్య పురస్కారాలు, YSR సాఫల్య పురస్కారాల్లో సమాజ సేవా విభాగంలో మిత్రుడు శ్యాం మెహన్ పేరు కనిపించింది. ఆ మాటకొస్తే పురస్కార గ్రహీతల్లో దాదాపు అందరూ నాకు దోస్తులే. కానీ, శ్యాం మోహన్ పేరు నాకు డబుల్ ధమాకా సంతోషాన్ని కలిగించింది. ఆయన YSR సాఫల్య పురస్కారం కోసం ఎంపికయ్యారు. ఐదు లక్షల రూపాయల నగదు తో కూడిన ప్రతిష్టాత్మక పురస్కారం అది.

Shyamohan cartoon - miss India

నేను ఆంధ్రజ్యోతి విజయవాడలో చేరిన రోజు ప్రత్యేకంగా శ్యాం మోహన్ ను చూశాను. త్రిపురనేని శ్రీనివాస్ తో మాట్లాడుతూ కనిపించారు. రోజూ ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో కనిపించే కార్యూనిస్ట్ శ్యాం మోహన్ అంటూ అప్పటి మొఫిషియల్ డెస్క్ ఇంచార్జ్ శ్రీ నళిని రంజన్ గారు నాకు శ్యాం మోహన్ ను పరిచయం చేశారు. అప్పటి ఎడిటర్ నండూరి రామమోహన్ రావు గారి ఛాంబర్ పక్కన ఒక టేబుల్ ముందు కూర్చుని సైలెంట్ గా బొమ్మలు గీస్తూ కనిపించేవారు. స్పెషల్ డెస్క్ కు మారిన తరువాత రోజూ ఏదొక టైం లో బాస్ అరుణ్ సాగర్ ను కలిసేందుకు మా క్యాబిన్ కు వస్తుండే వారు. అలా మొదలైంది 1994 లో మా పరిచయం. మితభాషి, కానీ మాట్లాడే ప్రతిమాట మనసులోంచి వస్తుంది. మానవీయ కోణం ఎక్కువ. ఎదుటివారి ప్రతిభను ప్రోత్సాహించే పెద్ద మనసు. గొప్ప స్నేహశీలి. 1996లో అందరం హైదరాబాద్ బదిలీపై వచ్చేసాం.


అప్పట్లో శ్యాం మోహన్ అప్పుడప్పుడు ఎడిటోరియల్ పేజీ వ్యాసాలు రాస్తుండే వారు. ఆంధ్రజ్యోతి పునః ప్రారంభం అయ్యాక ప్రత్యేక వ్యాసాలు రాయడమే పనిగా పెట్టుకున్నారు. అన్నీ హృదయాన్ని టచ్ చేసేవి. కన్నీళ్ల జీవితాలను ఆవిష్కరించేవి. మరో వైపు కార్టూన్ ప్రదర్శనలు, కార్టూన్ పోటీలు, కార్టూన్ సంకలనాలు ఒక ఉద్యమం లా పని చేశారు. 1989 లో పత్రికా రంగంలోకి ప్రవేశించిన శ్యాం మోహన్ 16 ఏళ్ళు పని చేశాక, ఐదేళ్ల క్రితం స్వతంత్రంగా రూరల్ మీడియా ఛానెల్ పెట్టి పల్లె ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన జీవితంలో రూరల్ మీడియా గొప్ప టర్నింగ్ పాయింట్. పల్లెల్లో ప్రజలు ఎలా ఉన్నారు? ఏం సాగు చేస్తున్నారు? విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? తదితర అంశాలను రూరల్ మీడియా చూపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరుదైన పల్లె జీవితాన్ని ఈ ఛానెల్ కళ్లకు కట్టేలా ఆవిష్కరిస్తోంది. ఆధునిక బాట పడుతున్న ఆదర్శ రైతులు, గ్రామాలను జల్లెడ పట్టి ఎవరూ చూపించని నిజమైన కోణాన్ని చూపిస్తున్నారు శ్యాం మోహన్. మరో వైపు ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించే గొప్ప వారధిగా సేవలు అందిస్తున్నారు.

ఎప్పుడు ఫోన్ చేసినా ఫీల్డ్ వర్క్ లో పలానా పల్లెలో వున్నానని అంటూనే అక్కడ విశేషాలను చెబుతుంటారు శ్యాం మోహన్. ఆయనతో కూర్చుంటే ఎన్నో పల్లె విశేషాలు మనని చుట్టు ముట్టి ‘ఒక్కసారి ఊరు పోయిరా’ అని మనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి ఆలోచనలు. ముఖ్యంగా ఆయన తిరిగిన గిరిజన గ్రామాలను, ఏజెన్సీ ప్రాంతాలను ఒక్కసారి చూడాలనిపిస్తుంటుంది. రంపచోడవరం మండలం పెద్ద కొండ గిరిజన గ్రామ సమస్య ను రూరల్ మీడియా ఛానెల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డు నిర్మించారు. ఇది శ్యాం మోహన్ విజయం. చిలక మామిడి పల్లెలో ఆదివాసీల ఇబ్బందులను రిపోర్ట్ చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తాగు నీటి సౌకర్యం కల్పించారు. ఇది రూరల్ మీడియా గెలుపు. ఇలా ఎన్నో పల్లెలను రూరల్ మీడియా ద్వారా ప్రగతి బాట పట్టించేందుకు విశేష కృషి చేస్తున్నారు. “ఎంత చేసినా తక్కువేనండి, సమయం సరిపోవడం లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, తిరగాల్సిన పల్లెలు చాలా ఉన్నాయి, సంతృప్తి లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు మిత్రుడు శ్యాం మోహన్.

శ్యాం మోహన్ ఇప్పటికే ఉత్తమ కార్టూనిస్ట్ గా, అత్యుత్తమ పాత్రికేయునిగా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేవా రంగంలో ప్రకటించిన వై.ఎస్.ఆర్ సాఫల్య పురస్కారం మరింత ప్రతిష్టాత్మకం. ఇదే విషయం శ్యాం మోహన్ మాట్లాడుతూ గ్రామాల్లో తిరుగుతూ మేము పడుతున్న కష్టాలకు ఇలాంటి పురస్కారం ఒక ఆక్సిజన్ అని, మరింతగా శ్రమించేందుకు ఒక ఉత్సాహం అని ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు, న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు తెలిపారు. శుభాకాంక్షలు శ్యాం మోహన్ గారు.

డా. మహ్మద్ రఫీ

2 thoughts on “సామాన్యుని వరించిన అసమాన్య ‘పురస్కారం’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap